Wednesday, September 18, 2013

కార్తిక పౌర్ణమి -III

నేను బయటకి  వచ్చిన  నిముషం నుంచి ఆగకుండా పరిగెడుతున్నా,నా చెయ్యి పట్టుకొని పరిగేడుతున్నది ఎవరు..? అయ్యా రేణు  అందులోనే ఉండి పోయిందే  అని చూస్తే...  నన్ను బయటకు లాగిందే రేణు! నేను గమనించలేదు.. నేను భయపడుతుంటే  అది బయటపడే మార్గం ఆలోచించినట్టు ఉంది ...  మా వెనకాల శబ్దమే లేదు!మమ్మల్ని వాళ్ళు, తరమటం  మానేశారా? ఆగకుండా చాలా దూరం పరిగెట్టి బహుశా ఒక  పావుగంట సేపు పరిగెత్తమేమో.. ఇంక పరిగెట్టే ఓపికలేక ఒక  గుబురుగా ఉన్న  చెట్టు దగ్గర ఆగాము. విపరీతం గా అలిసిపోయా, ఆయాసం వస్తోంది, రేణు  మాట్లాడలేక సైగ చేసింది.. పైకి ఎక్కమని, అతి కష్టం మీద నేను చెట్టు ఎక్కుతూ 'ఖర్మ కాకపోతే లంగా ఓణి తో  చెట్టు ఎక్కటమేంటి? చచ్చే కష్టం గా  ఉంది  అనుకుంటూ ఉండ గానే పరికిణి  చివర చెట్టు కొమ్మకు చిక్కుకొని... వెనక్కు లాగినట్టు అయ్యి కింద పడ్డాను. "త్వరగా ఎక్కవే! ఈ చెట్టు చాలా  గుబురుగా  ఉంది  ఎవరికీ  కనిపించము" అంది  రేణు. నేను మళ్ళి కష్ట పడి  చెట్టు ఎక్కి , రేణు ని ఎక్కమనే లోపల ఎవరో ఆకుల్లో కదలాడే శబ్దం, మనుషులు కనిపించలేదు కానీ , అడుగుల శబ్దం పెద్దగా వినిపించింది  నేను పైకి సర్దుకున్నాను రేణు  ఎక్కుతుందేమో అని .. కానీ  తను  అక్కడే ఉండు  అన్నట్టు  సైగ చేసి, ఎదురుగా  ఉన్న  పొదల్లోకి  వెళ్ళింది. కింద ఆ రెండు జతల కాళ్ళకి సంబందించిన శరీరాలు కనిపించాయి....  నాకు ఒక్క నిముషం  గుండె  కొట్టుకోటం ఆగిపోయింది.. ఒక్క నాలుగు అడుగులు వేస్తే రేణు కనిపిస్తుంది.. లేదా పైకి తల ఎత్తి  చూస్తే నేను కనిపిస్తాను.... ఛ ! రేణుని ముందు ఎక్క మనల్సింది, పాపం దాని చేతికి గాయం కూడా అయ్యింది..
"యాడకి  పొయ్యి   ఉండరు! ఈడనే  దాక్కున్నారు!  ఈ దిక్కునే  పహారా కాద్దాం బిడ్డా !" అని అన్నాడు శివ , విని తల ఊపింది ఆరుద్ర. ఇద్దరు కొంత దూరం నడిచారు, తరువాత కనిపించలేదు..  చెట్టు దిగటానికి నాకు, ఆ పొదల్లోంచి కదలటానికి రేణుకి ధైర్యం చాల లేదు... అక్కడే ఉండు  అన్నట్టు సైగ చేసింది..
ఈ లోపల అమాంతం  పున్నమి వెన్నెలని వెక్కిరిస్తూ  మబ్బులు కమ్మేశాయి! వెన్నెల కాంతి అంతా చీకటి మయం  అయ్యిపోయింది.. విపరీతమైన వర్షం, ఎంత సేపు పడిందో చెప్పలేను.. బహుశా  రెండు గంటలు పడిందేమో.. మధ్యలో రేణు. గట్టిగా కేకపెట్టింది! ఎంత ప్రయత్నించినా  నాకు తను ఉన్న  చోట చీకటి తప్ప ఏమి కనిపించలేదు, వర్షం  సూదుల్లా  కంట్లోకే కురుస్తోంది! చూడలేకపోతున్న! తను ఎందుకు అరిచిందో,కిందకు  దిగే ప్రయత్నం కూడా చెయ్యలేకపోయాను.. ఎందుకంటే  ఎవరో చాలా  దగ్గరగా  తిరుగుతున్నట్టున్నారు .. చీకటి, భయం ..  తనకు  సాయం  చేసేందుకు కిందకు  దిగాలేకపోయాను. వర్షం తెరిపిచ్చాక వెన్నెల అల్లుకుంది.. అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న  అడివి .. వర్షం  పడి  ఆగటంతో  అప్పుడే జీవం సంతరించుకున్నట్టు.. కీచురాళ్ళు , కప్పల  శబ్దాలతో, గుడ్లగూబల కూతలతో ...  నక్కల ఓలలతో  మారు  మోగిపోయింది.. ఇది కలే కదా! కల అయితే ఎంత బాగుణ్ణు!

                                                                 ****

ఏడనున్నారో ? ఎన్ని జన్మాలు  వేచాం సామి ..  ఈ యాల ... మా జీవితాలకి అర్ధం సెప్పె ఈ యాల గూడా  నీ పరీచ్చ ఆపవా సామి?...  నాకాడికొచ్చిన  ఈ వరాన్నిఇడిసి పెట్టా! ఈ యాల అడివంతా  జల్లెడ పట్టి అయినా  ఆళ్ళని  ఎతకాల... నానేమన్న  పొరపాటు సేసినానా?  నాను  సరిగా కలియజూడటం  లేదా? నా బిడ్డ! ... అని ఒక్క నిముషం కన్నపేగు కలుక్కు మన్నాది .. నా కంట్లో చివ్వున్న నీళ్ళు తిరిగినాయి.. ఆ ఎంటనే  మా అయ్య గుర్తోచినాడు.... ఆడేప్పుడు అనేటోడు ... "రుద్రయ్య బంటు అంటే... గుండె రాతి బండ లెక్క ఉండాలా" అని
ఈ యాల.. ఆడి  మాటల సారం బోధ పడతాంది! ఓ దిక్కు.. రుద్రయ్యకి మోచ్చం .. ఇంకో దిక్కు...
"బిడ్డా ! ఆ ఎదర  చూడు నువ్వు .. ఈ యెనక జూస్తా నేను !"
"అట్నే అయ్యా!"
నా బిడ్డ నా మాట దాటింది లేదు.. ఈ అయ్యా ఏది సెప్తే అది నమ్మినాది.. పసిగుడ్డుగా  ఉన్న  దినాం  మొదలు .. ఈ యాల  దాకా రుద్రయ్య కటాచ్చమే.. నా బిడ్డ అని నమ్మినా! ఈ యాల అది నిజం అయినాది .. అయినా నా  గుండె  బరువేక్కుతాందే... ఎతుకు శివయ్య  ఎతుకు .. ఆళ్ళు  కాన రావాల.. ఎన్ని జన్మాల... కాంచ  తీరాల..
ఎతికితే.. ఆళ్ళు  కానోస్తే... అయ్యా! నా గుండె గతి తప్పకుండా చూడు.. ఎనకడుగు ఎస్తానేమో  అనే  ఈ సమయాన మా అయ్య సెప్పిన పురాణం గుర్తుకు అస్తాంది!

                                                                 ****
"ఎయ్యి సంస్త్సరాల నాటి గుడి బిడ్డా ఇది.." నా సిన్న సిన్న కళ్ళు పెద్దవి సేసి సూసినాను.. నాను నమ్మలేక పోయినా..
"రుద్రయ్య బతికి  ఉండేటోడు  .. మనం తిరుగాడే నేల  మీదనే .. రుద్రయ్య నడిసిండు.... సెడు సేసే ఆళ్లంటే రుద్రయ్య
ఇడిసిపెట్టెటోడు   గాదు.. ఈడనే .. అప్పటి స్మశానం ఉండెడిది.. రుద్రయ్య.. ఈడనే .. ఉండేటోడు.. తప్పులు సేసినోళ్ళ  పుర్రెలు హారం  లెక్క  ఏసుకొని  తిరిగేటోడు...  అట్టాంటిది .. రుద్రయ్య  తరవాత..  అట్టా
సిచ్చించే  ఓళ్ళు  లేక నేల  అరాచకాలతో  ఇలా ఇలా లాడిపోనాది... మన పూర్వపుటోళ్ళు..  రుద్రయ్య నడిసిన  చోట గుడిగట్టి.. ఆ సామి ఏసిన సిచ్చలే ఏసేటోళ్ళు.. కానీ  రుద్రయ్యని శివయ్య అని పిలిసేటోళ్ళు  ఉండారు  గందా.. ఆళ్ళు .. గుడి కట్టేదానికి ఒప్పుకున్నరు గానీ.. సిచ్చలు  ఏసేది శివయ్య మాత్రమేనని   వాదులాటకు దిగినారు.. మన ఓళ్ళు ... ఆళ్ళ ఓళ్ళు .. గట్టిగ సమరాన పడినాక.. ఆ కోనేరు శివలింగం మెరవ సాగేనట.."
"అంతక ముందు మెరిసేడిది గాదా అయ్యా ?"
"లే  బిడ్డా... అప్పటి నుంచి ఇది రుద్రాలయమే బిడ్డా..  ఆల్లేమో  శివాలయం అంటారు .. రుద్రాలయం ఉండుట  మంచిది గాదు బిడ్డా...సామి  కోపంగానే ఉన్నాడు  అప్పటి సంది.. ఇది శివాలయం జెయ్యాలంటే.. మూడు ఆరుద్ర నక్షత్రం కన్నేలని బలి ఇవ్వాలి బిడ్డా.. ఒకటి మన బిడ్డ.. రెండు ఆళ్ళ బిడ్డలు.. కార్తిక  పున్నమి నాడు.. నీవు తేగూడదు... ఆల్లంత ఆళ్ళే  గుడి లోనికి రావాల  "
"బలి ఇస్తే సామి శాంతిస్తాడ? ఎవరంటిరి  అయ్యా  బాలి ఈయ్యాలని..?"
"అప్పటి గుడికి  సామి ... ఆ లింగం మేరవసాగానారంభించాక..  రుద్రయ్య కలలోకి వచ్చి చెప్పెనట!"
"బలి గోరే  సామి రుద్రయ్య అయ్యి ఉండడయ్య!"
మా అయ్యా మొఖాన క్రోధం జూసినా ..
"మీ యమ్మ  నీకు శివయ్య అని పేరు పెట్టినప్పుడే ..అడ్డు జెప్తావని అనుకుంటి రా.. "
"నాకు ముందు జెప్పినోళ్ళు.. ఏర్రి  యెదవలా  ఏమి?"
నాను ముడుసుకుంటిని...
"సూడు బిడ్డా... అందరూ  బతకతారు.. రుద్రయ్య కోసం సచ్చే దానికి రాసి ఉండాలి .. "
మా అయ్య జెప్పినదే నమ్మినా  నా బతుకంతా...  రుద్రయ్యను కొలిచినా.... నా బిడ్డకు  అదే జెప్పినా... నేను  నమ్మిందే  జెప్పినా... కాదు కాదు నాకు నమ్మమని జెప్పిందే జెప్పినా... మా పూర్వపుటోళ్ళు  అంతా ఏ  దేననికై ఎదురు జూసి సచ్చినారో .. ఆ రోజు వచ్చే... ఈ దినం రావలేనని... నేను మొక్కని క్షణం లెదు.. కానీ ... సామి.. సంతోసించాల్సిన .. రోజున ... ఈ రాతి గుండెన... కన్నీళ్ళు  ఏంది  సామి... ? ఎతుకు  శివ ఎతుకు ఆళ్ళు  దొరకాల!
కన్నీళ్ళు  తుడు ... నీ బిడ్డని జూసి నేర్చుకో...  రుద్రయ్య కోసం సచ్చేదానికి తాయారు అయ్యినాది...
 కళ్ళు  తుడుసుకుంటి! ఎతకనారంభించినా... రుద్రాలయం... శివాలయం గావల  రేపు .. సూరీడు పోదిచేలోపల.


 

4 comments:

  1. Not so convincing narration or may be I didn't understand better...what if it is rudralayam n not sivalayam..? Why shud he take the pain of killing 3 innocents and get it changed to sivalayam ?

    ReplyDelete
    Replies
    1. Well.. he was told to do so..that is what they beleived in.. that is what their tradition told them.. and... no one questioned it...we can decide on why is he taking pain to change it in next part :) I will try and work on it to make it convincing!

      Delete
  2. Entandi raayatame maanesaaru ? Inkonnaallu pothe,katha mottam marchipotaam...of course,,,u might be busy...but plz plz write this exciting series soon....

    ReplyDelete
    Replies
    1. Ayyo.. Nenu complete cheddamane vunnanu andi... I had problems with my net and...blogger translator tho problems. Will try and complete it tonight. :)

      Delete