Thursday, February 16, 2012

నీటి బుడగ


నా పేరూ ... హా అప్పుడే ఎందుకు లేండి కధ ముగించే అప్పుడు చెప్తాను. నన్ను అయితే అందరూ 'చిన్నా' అని కానీ 'బాబు' అని కానీ పిలిచే వాళ్ళు. మరేమోనండి, నాకేమోనండి చిన్నప్పటి నుండి చిన్న పిల్లలు అన్నా, కోతి పిల్లలు అన్నా యమా చిరాకు. మా ఇంటి పెరట్లో ఉన్నజామ చెట్టు ఎక్కి మేము లేకుండా చూసి పళ్ళు కోసుకునే పిల్ల మూకలు అంటే మహా అక్కసు నాకు. నాకు దొరికారో వెధవల్ని రాళ్ళ గడ్డలు పెట్టి కోట్టే వాడిని. మా అమ్మామ్మ ఏమో నాకు ముక్కు మీద కోపం అనేది.పిల్లలే కాదు పెరటి గంగాళం లో నీళ్ళు తాగే కాకుల్ని చూసినా అన్నం తినే వాడిని సైతం లేచి వాటిని తరిమేసే వాడిని. సాయంత్రం మాట్లు చక్కగా స్నానం చేసి అరుగు మీద కూర్చునే వాడిని , దారిన పోయే వాళ్ళని చూస్తూ.మా నాన్న ఎప్పుడన్నా డబ్బులు ఇస్తే కోమటి కొట్లో ఇచ్చి బిస్కత్తో, మిట్టాయో కొనుక్కునే వాడిని. ఎవరికీ పెట్టె వాడిని కాదు! పెట్ట బుద్ధి అయ్యేది కాదు. మా అమ్మమ్మ మా నాన్న తో గొడవ పడి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక మా నాన్న కి నేనే వండి పెట్టె వాడిని. వంట అన్నా, రుచిగా తినటం అన్నా మహా ఇష్టం నాకు. మా అమ్మమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడన్నా ఏదన్నా అన్నారో నాకు చాలా కోపం వచ్చేసేది , కిటికీ తలుపులు అవి విరిగిపోతాయేమో అని అనిపించేంత శబ్దం వచ్చేలా వేసే వాడిని. మరి నేను అంటే అంతే మరి ! ఏమనుకున్నారో !




అందరూ నన్ను తిక్క శంకరయ్య, అనే వాళ్ళు. మా నాన్న కూడా నన్ను ఇంకో పేరు తో పిలిచే వారు, అది కూడా చివర్లోనే చెప్తాను.అన్నట్టు నేను ఆరు అడుగుల ఎత్తు, సన్నగా సువ్వ లాగ , ఆజాను బాహుణ్ణి, ఎర్రగా కూడా వుండే వాడిని, నా కళ్ళు కూడా చాలా బాగుంటాయి, కానీ ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కారు. అందరూ నా మొఖం చూస్తారేంటి? నా కళ్ళు చూడరెంటి అని అడుగుదామా అని అనుకునే వాడిని. కానీ వాళ్లకు కళ్ళు లేవా ? అవి కనపడవా? మనం ఎందుకు చెప్పాలి అని అనుకోని ఊరుకునే వాడిని.



నాకు ఆరవ ఏట "పాపక్క పోయిందంట" అని అందరూ పరుగేతుకొని పొలానికి వెళ్లారు. నాకు కూడా పరిగెత్తాలి అనిపించింది, కానీ పరిగేత్తలేను, ఎందుకంటే నాకు పుట్టుక తోనే గుండె జబ్బు ఉంది, ఒక సారి మా నాన్న ఆపరేషన్ చేయించారు కానీ లాభం లేదు అనేసారు డాక్టర్లు. అయినా పోవటం ఏంటో నాకు అర్ధం కాలేదు.కాసేపటికి అమ్మ ఇంటికి వచ్చింది, కానీ పడుకునే ఉంది. అన్నయ్య ఏమో ఏడుస్తున్నాడు. మళ్లీ కొంత సేపటికి అమ్మ నిద్దరోతూ నే వెళ్ళిపోయింది, ఎంత సేపు ఎదురు చూసినా రాలేదు. ఇహ అప్పటి నుండి ఆకలి అనిపిస్తే అమ్మమ్మ నే అడిగే వాడిని. నా మొహం నిండా స్పోటకం మచ్చలు ఉండేవి. పుట్టినప్పుడే నా పై పెదం రెండుగా చీలిపోయింది. మాట్లాడగలను, కానీ అవతల వాళ్లకి అర్ధం కాదు, గ్రహణ మొర్రి అంటారుట, మా మావయ్య వాళ్ళ అబ్బాయి రవి చెప్పాడు నాకు.



మంచేదో చెడేదో నాకు అస్సల తెలియదు అని అనే వారు అంతా. నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా దగ్గటమే! బడికి వెళ్ళే వాడినా పది అంగల దూరానికి నాలుగు సార్లు ఆగే వాడిని. దగ్గు రాలేదంటే రెండో పిరియడ్ కి అంతా బడికి వెళ్ళే వాడిని. దగ్గు వచ్చిందా ... ఇహ చూసుకోండి రక్తం పడటం అది తుడుచుకోవటం , నన్ను చూసి బడికి వెళ్ళే పిల్లలకి అదో వేడుక.కొంత మంది అయితే రాళ్ళూ విసిరే వారు కూడా! నేను తిరిగి విసురుదమనుకునే వాడికి కానీ ఓపిక ఉండేది కాదు, మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణం. అందుకే నాకు అల్లరి పిల్లలు అంటే అంతెందుకు మామూలు పిల్లలు అన్నా నిక్కచ్చిగా కచ్చే! నాకు నా పేరు రాయటం తెలుసు తెలుసా? కొంచం కొంచం ఆలస్యం ఐనా చదవగలను కూడా ఏమనుకున్నారో!



నాకు ఎవ్వరికి ఇవ్వటం రాదు , ఇష్టం లేదు కూడా.కానీ ఇవ్వటం నేర్చుకున్నా. మా అన్నకొడుకు తెలుసా మీకు? అచ్చం నా లాగే సన్నగా, సువ్వ లాగ , ఎర్రగా, అందమైన కళ్ళు , కానీ కానీ బాగున్నాడు! మచ్చలు లేవు , పెదం అంతా ఒకటే లాగ ఉంది. లేత తమలపాకు లాంటి మొహం మీద ఆల్చిప్పలాంటి కళ్ళు.నేను ఇలానే ఉండే వాడినేమో! అందరూ నా పోలికలే అంటున్నారు, కానీ వీడు బాగున్నాడు, నాలానే వున్నాడు, కానీ బాగున్నాడు. అందుకే నాకు వాడంటే ఇష్టం. వాడికి పెట్టె వాడిని నా తాయిలాలు. వాడి తో పాటుగా వాడి పిన్ని పిల్లలూ అలవాటయ్యారు. నేను చిన్నప్పుడు దాచుకున్న బంతి వాళ్లకి ఇచ్చి , వాళ్ళు ఆడుతుంటే చూస్తూ కూర్చునే వాడిని. నేను ఆడలేను కదా మరి! కానీ బంతి నాకు తగిలితే యమా కోపం వచ్చేది నాకు.



చాన్నాళ్ళ తరువాత పిల్లలు ఊరు నుండి వచ్చారు నన్ను చూడటానికి, వాళ్లకి పునుగులు పెట్టాను , అవి తిని , కాసేపు ఆడుకొని, వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు. వెళ్ళిన కాసేపటికి, ఎప్పటి లాగే గుండెల్లో నొప్పి , బాధ, పాత నేస్తమే కానీ ఏదో కొత్తగా పిలుస్తున్నట్టు తోచింది. నాకు అర్ధమవ్వుతోంది, నేను కలలు కన్నా రోజు ఇదే అని, నాన్న పాపం ఎప్పటి లాటి నొప్పే అనుకోని , మందులు వేస్తున్నాడు. నాకు మాత్రం నొప్పి, ఆనందం తెలుస్తూనే ఉన్నాయి. అమ్మ పోయినప్పుడు పోవటం అంటే తెలియదు , ఇప్పుడు తెలుస్తోంది విముక్తి చెందటం అని. 'వాడు నా లానే ఉన్నాడు, కానీ బాగున్నాడు , నేను అలానే ఉండే వాడినేమో' అనుకుంటూనే నా శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది. మా నాన్న అనగా నేను విన్న చివరి మాట "హయ్యో అల్పాయుషు వెధవా" అని బిగ్గరగా ఏడ్చాడు . "నాన్న! నా పేరు "విశ్వేశ్వరం" " అనాలి అని ఉన్నా అన లేక చక్కా నిద్దరోయాను కళ్ళు మూసుకొని.

P.S: This post is a tribute to the person who actually knows that this is his own story.