Saturday, July 25, 2020

అమావాస్య సిరివెన్నెల

నిద్రలేమి. ఇది  చిన్నప్పుడు ఉండదు. ఎదిగే కొద్దీ వచ్చే జబ్బు. చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాముకష్టపడితే నిజం అయిపోతాయి  అని అనుకుంటాం. పెద్ద అయ్యాక ఎంత కష్టపడినా  తీరం కనపడదు.  ఒక వేళ కనిపించినా చేరుకోలేముచేరుకున్నా ఇది కాకుండా ఇంకేదో ఉంది అంటుంది సమాజం. కలలు ఒకలా ఉంటాయి. నిజాలు ఇంకొకలా ఉంటాయి.          ప్రపంచం అందంగా కనిపిస్తూనే  భయంకరంగా  ఉంటుంది . ప్రేమద్వేషంమనుషులని కోల్పోవటంఈ విశాల విశ్వంలో నేను ఏంటి  అని ఆలోచించటం వంటివి అన్నీ కలిసి  నిద్రపట్టకుండా చేస్తాయి. అలాంటి ఒక నిద్ర రాని రాత్రిచాలా కాలంగా నేను వినకుండా పక్కన పడేసిన ఎంపీత్రీ ప్లేయర్ ఆన్ చెయ్యగానే వినిపించిన మొదటి పాట ... 

 

అంతం సినిమాలోని 

 

 

"చలెక్కి ఉందనుకోఏ చలాకి రాచిలకో .. "

 

ఈ పాట వింటూనేఎన్నాళ్ళైందో ఇది  విని అనిపించింది.  కొన్ని  పాటలతో మనకు తెలియకుండానే  ఒక అనుబంధం ఏర్పడుతుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి. 

 

         నా చిన్నప్పుడు మేము అనంతపురంలో ఉండే వాళ్ళం. నాకు  పదేళ్ళు ఉంటాయి. మా నాన్న ఒక రోజు ఆఫీసు నుంచి రాగానే ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పారు. నాకు ఆ  వార్త ఎంత మాత్రమూ  నచ్చలేదు. ఇక్కడ అలవాటు పడిన స్కూలునిఇష్టమైన స్నేహితులని  వదిలేసి కొత్త ప్రదేశానికి వెళ్ళటం అంటే నాకు చాలా దిగులుగా అనిపించింది. 

 

     మేము అనంతపురం నుంచి నెల్లూరు వెళ్ళే రోజుమా సామాను ఉన్న లారీ లోనే మేమూ  బయలుదేరాము. సామానుకి కాపలాగా ఉంటూనే  మా ప్రయాణ ఖర్చులు కూడా కలిసివస్తాయి అని అలా లారీలో ప్రయాణించాము.  నాకు  ఊరు వదిలి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఏడుస్తూ ఉన్నాను. మా అమ్మానాన్న  నన్ను ఓదార్చటానికి ప్రయత్నించి నేను ఎంతకూ ఏడుపు ఆపకపోవటంతో ఓపిక లేక వదిలేసారు. ఆ డ్రైవర్ మాత్రం "పాపా  ఏడవటం ఆపవూ! ఇది  నాకు చాలు ఇష్టంచాలా కష్టపడి కొనుక్కున్నాపాటలు విందాము. ఏడవకూడదు మరి ! " అని చెప్పి  తన Walkman ఇచ్చారు.  నేను walkman చూడటం అదే మొదటిసారి. ఆయన ఆన్ చెయ్యగానే వినిపించిన మాట 

 

"చీకటి ఉందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగాకోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా  "

 

అసలైతే  అంత వివరంగా నాకు గుర్తుండకూడదుకానీ చీకట్లో లారీ క్యాబిన్ లో  కూర్చునిదాని లైట్లు  ఆ చీకటి  రాత్రిని చీల్చుకుంటూ  ముందుకు వెళ్తుండగా విన్న మాట ( పాట ) కాబట్టి గుర్తుండి పోయింది. అమ్మ నాన్న తమ్ముడు పడుకున్నా  నేనూ డ్రైవర్ మాత్రం నెల్లూరు చేరే  వరకూ పాటలు వింటూనే ఉన్నాం. 

 

         దిగులుగా నిద్ర పట్టని నాకుపదేళ్ళ వయసులో నాకు సాంత్వన ఇచ్చిన పాట వినగానేఎదో తెలియని ఉత్సాహంఎప్పుడో విడిపోయిన స్నేహితురాలిని చూసి పలకరించినట్టు అనిపించింది. బయటకు వెళ్ళి చుక్కల్ని చూస్తూనా బాధలని జోకొట్టే ఈ పాట...  

 

"నలు దిక్కులలో నలుపు ఉందనుకో చిరునవ్వులకేం పాపం!

వెలుగివ్వనని ముసుగేసుకుని మసి బారదు ఏ దీపం "

 

వేసవిలో మల్లెల గాలి ముఖానికి  తాకుతూ ఉంటేఈ మాటలు వినిచిరునవ్వు  విరిసింది నా పెదవులపై. నవ్వినంత మాత్రాన నా బాధలు తీరిపోతాయాకలలు నెరవేరుతాయా  అని నిట్టూర్చే లోపలే 

 

"కారు నల్లని దారిలో ఏ కలల కోసమో యాతనకాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా .. 

కలలన్నిటినీ వినిపించుకుని నిలవేసిన కళ్ళనీ వెలి వేసుకొని వెళ్ళిపోకు మరీ  విలువైన విలాసాన్ని .."

 

అని వింటూ తల పైకి ఎత్తి చూసిన నాకు  అమావాస్య నింగిలో తళుక్కుమనే కోటి చుక్కలు కనిపించాయి 

 

"చురుగ్గా చూస్తావోపరాగ్గా పోతావోవాలేస్తానంటావోఇలానే ఉంటావో.."

 

వెళ్ళి పడుకోకొత్త కలల్ని చూడు చురుగ్గా చూడు కానీ పరాగ్గా బాధ పడకు అన్ని కలల్ని చూపించే కళ్ళని ఇలా  పడుకోకుండా శిక్షించకు అని ఈ పాట చెప్పినట్టు అనిపించింది... 

 

లోపలకి వస్తూ మళ్ళీ ఒక్క సారి ఆ చుక్కల్ని చూడాలి అనిపించి చూశాను ... ఒక తోక చుక్క రాలుతోంది.. ఈ పాట రాసిన సీతారామశాస్త్రి గారిని నాకు ఈ పాట పరిచయం చేసిన ఆ డ్రైవర్ ని మరొక్కసారి  కలిస్తే బాగుండు అని కోరుకుని వచ్చి పడుకున్నాను . వెంటనే నిద్ర పట్టింది. 

 

https://www.youtube.com/watch?v=reP3euk2Vew