Thursday, September 13, 2012

NIjam

అవనిగడ్డ  గ్రామంలో, రాములయ్య అంటే తేలియని వారు ఉండరు. ఆయన  ఎవరో కాదు , మా నాన్న. నా పేరు రఘు. ఇప్పుడు నేను చెప్పబోయేది నా కధే.

1986  ఆగష్టు 10:

మా నాన్నకి  గత కొద్ది రోజులుగా అస్సలు బాగుండటం లేదు. పరిస్థితి చేయిదాటిపోయింది, ఇంట్లో ఉంచటమే నయం అని డాక్టర్ గారు చెప్తే,ఇంట్లోనే నేను,బామ్మా నాన్నని చూసుకుంటూ ఉన్నాం.  నాన్న  వారం రోజుల నుంచి ,   మూసిన కన్ను తెరవకుండా  ఉన్నారు.  నాకు ఏదో చెప్పాలి అని చూస్తున్నారు కానీ  చెప్పలేకపోతున్నారు. ఆయన  బాధ చూస్తుంటే  నాకు అన్నీ తనే అయ్యి, పెంచిన నాన్నకి ఇప్పుడు నేను ఏమీ  చెయ్యలేకపోతున్నానే  అని దుఖంతో నాకు చాలా చాలా దిగులుగా ఉంటోంది.  నా నిస్సహాయత మీద నాకు ఎనలేని, ఎడతెగని కోపం వస్తోంది.

"ఊరుకో రఘు, నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు చెప్పు?" నా స్నేహితుడు, రంగా పరామర్శతో ఉలిక్కిపడి చూశాను. వాడు నా ఆలోచనలని చదవగలడేమో! లేదంటే.. ఇలా ఎలా అనగలడు?

"నీకు తెలియదు రా .. నాన్న ఏదో చెప్పాలి అని చూస్తున్నారు కానీ,  చెప్పలేకపోతున్నారు . ఆరోగ్యం బాలేదు అని కాదు, ఆయన  మానసికంగా కూడా ఏదో మధన  పడుతున్నారు.అది చూస్తూ నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను"

"నేను అంటున్నదీ అదే. చెయ్యగలిగేది అయితే చేస్తావుగా ,ఇప్పుడు చెయ్యలేని దాని గురించి బాధ పడతావెందుకు ?"

"అమ్మ పోయినప్పటి నుంచి  నాన్న ఎంత అపురూపంగా పెంచారంటే ,అమ్మ ఉన్నా అలా చూసుకునేది కాదేమో!  నా కోసం  ఆయన  పెళ్ళి చేసుకోలేదు . నాకు అన్నీ సమకూర్చటం కోసం ఆయన  తన కనీస అవసరాలని కూడా వదిలేసుకున్నారు."

"నువ్వు కూడా ఆయనకు దగ్గరగా ఉండాలనే కదా డిగ్రీ చదివినా, పట్టణంలో ఉద్యోగం వచ్చినా, వదులుకున్నావ్ ? రెండు నెలల నుంచి చంటి పిల్లాడిని చూసుకున్నట్లు చూసుకుంటున్నావు.ఇప్పుడు నువ్వు ఇలా బాధ పడటంలో అర్ధం లేదు "

రంగా  ఎప్పుడూ  ఇంతే! చెయ్యగలిగింది  చేశావ్, ఇంక ఫలితం గురించి ఆలోచించటం నీ భాద్యత కాదు,
వదిలెయ్యాలి అంటాడు. అలాగే ఉంటాడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా , ఏ పరిస్థితిలో ఐనా  నిబ్బరంగా ఉండటం నాకు అలవడలేదు.  వాడికున్న తెగువ, ధైర్యం కూడా నాకు లేవనే చెప్పాలి.  వాడికి సబబు అనిపిస్తే ఏదైనా చేస్తాడు.. నా ఆలోచనలు మా నాన్న మీద నుండి రంగా మీదకు మళ్ళాయి .....

1984 ఏప్రిల్ 5

రంగాని ఎవరో కొట్టి , చెరువు గట్టున పడేశారు అన్న మాట విని నేను గబగబా వాడింటికి బయలుదేరాను.  వాడింట అడుగు పెట్టగానే ఝాన్సీ .. ఏడుస్తూ ఎదురొచ్చింది. ఝాన్సీ  మా పిన్ని గారి అమ్మాయి, రంగా మంచి వాడు అని మా పిన్ని వాళ్ళు .. నా చేతనే సంబంధం మాటాడించి పెళ్ళి చేశారు . రెండు ఏళ్ళ బాబు కూడాను వాళ్ళకి.
"చూడన్నయ్య, ఎవరో  కొట్టి కాలవ  గట్టున పడేస్తే, అటుగా వెళ్ళే కూలీలు తీసుకొచ్చారు. ఎవరు కొట్టరంటే? నోరు తెరచి చెప్పటం లేదు. గుర్తులేదు అంటున్నారు. కాస్త నువ్వైనా అడుగు."

లోపలకు వెళ్ళి చూశాను గదా, ఎవరో చాలా దారుణంగా కొట్టారు!

 "ఏమయింది రా .. ఏంటి ఈ దెబ్బలు?"

"ఏం లేదురా బాబూ .. ఝాన్సీ ఖంగారు  అంతే !" 

"ఆ మాట  అనద్దు  మీరు. నా కంగారు వల్లనే దెబ్బలు తగిలాయా మీకు? నాకు చెప్పక్కర్లేదు, కనీసం అన్నయ్యకు అన్నా చెప్పుకోండి ,మీ బాధ ఏంటి అని. అన్నయ్యా ! నేను మీకు ఏదన్నా తినటానికి తీసుకొస్తాను  ఉండండి " అని విస విసా  వెళ్ళిపోయింది ....

రంగా ఎంతైనా అదృష్టవంతుడు  ఎంత మందికి దొరుకుతుంది ? ఇంత అర్ధం చేసుకొనే  భార్య..!

" ఇప్పుడు చేప్పరా అబ్బాయ్ ... ఈ దేబ్బలేంటి? ఈ గోల ఏమిటి ?"

" ఏం లేదు రా నీకు గీత తెలుసు కదా?"

"జమిందారు గారి అమ్మాయి ..."

"హా నేను పొలం కౌలుకి చేసే జమిందారు గారి అమ్మాయి.."

"తెలిస్తే ?!!"

"అబ్బా .. చెప్పనివ్వరా ... తను చిన్న పిల్ల, నిండా 15 ఏళ్ళు లేవు. నేను అంటే ఇష్టం అంటుంది, ప్రేమ అంటుంది. ఇది ప్రేమ కాదు  బంగారు తల్లీ , నేను నీకు రెండింతలు వయసు ఉన్నవాడిని, పెళ్లి అయ్యి,నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇది ఆకర్షణ అని చెప్పాను చాలా మార్లు ... ఏమనుకుందో  ఏమో... జమిందారు గారు రమ్మన్నారు అంటూ కబురు పెట్టించింది ...  నేను నిజమే అనుకొని  వెళ్ళాను ... వెళ్ళిన మరు క్షణం అర్ధం అయ్యింది విషయం!  నేను తనకు నచ్చ చెప్తుండగానే ... అందరూ  నిద్ర లేచారు... ఆ పిల్ల.. ఎంతో భయపడింది పాపం.."

"అందుకని?" అని నేను కాస్త బిగ్గరగా అరిచాను..

" కోపగించుకోకురా ... చిన్న పిల్ల తెలియక చేసినదానికి.. అదే నీ కూతురు అయితే, తనకు ఒక  అవకాశం ఇస్తావు కదా... అందుకే.. నేనే ఏదో దొంగిలించటానికి  వచ్చాను, మీ అమ్మాయి నన్ను  చూసేసింది అని  చెప్పాను.
 దొంగోడికి దేహ శుద్ది  చేసి పంపించారు."

" ఆ పిల్ల తప్పుకి, నువ్వు శిక్ష అనుభవించటం ఏమిటి రా?"

" అంటే ఎం చెయ్యమంటావు ?"

"నిజం .. చెప్పి ఉండాల్సింది."

" చెప్పి ఆ పిల్ల జీవితం నాశనం చెయ్యమంటావా ?"

"నువ్వు తన్నులు తినటం బాగుందా? రేపు వాళ్ళ పొలం  ఏ మొహం పెట్టుకొని కౌలు చేస్తావ్? నీ గురించి ఆలోచించావా?  "

" నాకు ఈ ఊరిలో  సొంత పోలమా ? ఇల్లా?  ఆ మాత్రం కౌలు వేరే ఊరిలో కూడా దొరుకుతుంది.  అదే ఆ పిల్లకు తల్లి తండ్రుల ముందు, అయిన వాళ్ళ ముందు అల్లరి అయితే.. జీవితాంతం ఆ  మచ్చ ఉంటుంది ..."

"అలా అని నిజాన్ని  దాచేస్తావా ?"

"కొన్ని సందర్భాల్లో నిజం చెప్పకపోటమే మంచిది రా . ."

ఇదే మాట విన్నాను నేను. ఎక్కడో విన్నాను ??!ఎప్పుడో  విన్నాను! అసలు ఈ నిజం అనే మాటే నన్ను
ఎప్పుడూ తికమక పెడుతుంటుంది.... ఎక్కడ విన్నాను అంటే... నా ఆలోచనలు... రంగా మీద నుంచి మా నాన్న మీదకు మళ్ళాయి .....

1970 మార్చ్ 8

నాన్న నాకు అన్నం తినిపించకుండా ఉన్న రోజు లేదు. నాకు 15 ఏళ్ళు వచ్చిన  తరువాత కూడా నాన్న తినిపిస్తూనే  ఉన్నారు. హాయిగా రాత్రి పూట నాన్న చేతి  ముద్దలు తిని,ఆయనతో కబుర్లు చెప్తూ నిద్రపోటం అంటే ఎంత ఇష్టమో నాకు!నాన్నకు రాముడు ఆరాధ్య  దైవం. రాముడి  కధ ఒక్కటన్నా, చెప్పనిదే  మా కబుర్లు పూర్తి అయ్యేవి కావు. నాకు మాత్రం మా నాన్నే రాముడు.  ఎప్పుడు పడుకున్నామో  తెలియదు కానీ,నిద్దర్లో లీలగా ఏవో అరుపులు వినిపించాయి.  రానురానూ ... పెద్దవి అయ్యాయి... నేను ఉలిక్కిపడి లేచాను. నాన్న అప్పటికే లేచారు.. మా వీధి గుమ్మం ముందే ఆ చప్పుడు.. ఎవరో ఎవరినో ప్రాధేయపడుతున్నారు ...

" నీకు దణ్ణం పెడతాను నన్ను వదిలెయ్యి.. "

" ఈ  బుధి ముందు ఉండాల్సింది ... నీ మూలాన నేను జైలు కూడు తిన్నాను.. 4 ఏళ్ళు  ఈ పూట నిన్ను ఒదిలేది నేదు అబ్బయ్యా ..."

"గంగా ... నీకు పుణ్యం ఉంటుందిరా ...."

"నేను పాపమే చేస్తా..."

అంటూ  మాట పూర్తి కాకముందే..  నెత్తురు చింది మేము ఓరగా తెరచి చూస్తున్న కిటికీ మీద పడింది. నా కాళ్ళు మొద్దుబారిపోయాయి. నాన్న మాత్రం జాగర్తగా  తలుపేసి,ఏం మాట్లాడకుండా... నా భుజం మీద చెయ్యి వేశారు. నేనూ ఆయనతో పాటే నడిచాను. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. కళ్ళు మూసినా,తెరిచినా  అదే దృశ్యం. చంపేశాడు నిలువునా... బాధ .. కోపం .. ఏదన్నా  చేసి బ్రతికించగలమా ?లేచి వెళ్ళి తలుపు తీసి కొన  ఊపిరితో ఉన్న అతనిని కాపాడాలి కదా!కానీ  నేను నిద్రపోతున్నాను..  పిరికితనం... నాన్న .. నా రాముడు.. రాముడు కూడా భయపడ్డాడా ? ఆలోచిస్తూనే పడుకుండిపోయినట్టు ఉన్నాను ..  మా నట్టింట్లో ఎవరో నుంచొని పెద్దగా అరుస్తున్నట్టు అనిపించింది... కళ్ళు తెరచి గడియారం వంక చూశాను .... 11 కావస్తోంది ...

"ఇంటి ఎదురుగా జరిగిన ఘోరాన్ని  చూడలేదంటావేమయ్య ?"

"చెప్పా కదండీ.. రాత్రి పడుకొని ఉన్నాం .. మాకు ఎలా తెలుస్తుంది..?"

"నువ్వెమీ  వినలేదు ... చూడలేదు అంటావు?"

"అవును !"

"constable ... హిట్ అండ్ రన్ అని రాసేయవయ్య.. ఇక్కడ సాక్ష్యం చెప్పే మగాడు ఎవడు లేడు  గాని .."

అని గుట్కా నములుతూ మా నాన్నని ఏహ్య భావంతో ఆ ఇన్స్పెక్టర్ చూస్తుంటే బాధ వేసింది...
అతను వెళ్ళిపోయే దాకా ఘడియలు లెక్కపెట్టి మరీ నుంచొని .... మా నాన్నని నిలదీశాను ..
 "నిజం చెప్పలేదేం నాన్న..?"

"నాకు ప్రాణం మీద తీపి లేదు రా.. నువ్వు అనాధవి అవ్వుతావు అనే భయం తప్ప ... ఆ భయమే లేకుంటే,రాత్రి కొన  ప్రాణం తో ఉన్న అతని గొంతులో కాసిని నీళ్ళు అన్నా పోసేవాడిని ..."

"నిజం చెప్పాల్సింది నాన్న.. " నా గొంతు పొడి బారిపోయింది..

నేను .. నా పిరికితనమే కాదు... మా నాన్న కి కూడా బలహీనతని .... నా మీద నాకే కోపం వచ్చింది ...

"కొన్ని సందర్భాల్లో నిజం చెప్పకపోటమే మంచిది రా.."

అని మా నాన్న వెళ్ళిపోయారు.. 

1986 ఆగష్టు 21

నిజం .. నిజం ... ఏ సందర్భం లోనూ చెప్పకూడదా? నాకు ఈ నిజం ఎప్పుడూ చిక్కు ప్రశ్నే ... నాన్న నా కోసం అబద్దం చెప్పారు ..రంగా .. అవతల వాళ్లకి సాయం చెయ్యటం కోసం అబద్దం చెప్పాడు.. ఎప్పుడు అబద్దమే జీవితాలను కాపడుతుంటే.. ఇంకా ఆ నిజం తో పని ఏముంది.. నాన్న పరిస్థితి ఏం బాగుండటం లేదు ..ఆయన అవస్థ చూస్తే జాలి వేస్తోంది. దేవుడు ఆయనను ఎందుకింత వేదనకు గురి చేస్తున్నాడో అర్ధం కావటం లేదు.
ఏదో చెప్పాలి అని తాపత్రయ పడుతున్నారు.. చెప్పలేకపోతున్నారు .. నన్ను మంచం దగ్గరే కూర్చోమంటున్నారు.... నాన్నగారు పోవాలి అని నాకు లేకపోయినా,ఆయనకు ఈ వేదన నుంచి ముక్తి వస్తే బాగుండు అనిపిస్తోంది.. గత కొద్ది రోజులుగా.  ఈ రోజు నుంచి రంగా,ఝాన్సీ నాకు సాయంగా ఉండటానికి ఇక్కడికి వస్తాం అన్నారు... గుమ్మం దగ్గర చప్పుడు చూస్తే.. వచినట్టే  ఉన్నారు ... వాళ్ళ సామాను లోపలికి తెస్తుండగా... బామ్మ అరుపు పెద్దగా ...

" ఒరే  రఘూ .!!!!".. నాకు భయం కమ్మేసింది.. పరుగెత్తుకెళ్ళి చూద్దును కదా..  నేను భయపడింది ఏమీ జరగలేదు.. నాలుగు రోజుల నుంచి కళ్ళు కూడా తెరవని నాన్న,చేతితో నన్ను పిలుస్తున్నారు ....  నాకు కన్నీళ్ళు ఆగలేదు ... ఆనందమో,బాధో కూడా నాకే అర్ధం కాటం లేదు.

 "నాన్న  ఏమిటి నాన్న..?" ... ...

"ఇలా రా.." అసలా ఎక్కడో నూతి లోంచి ఎవరో మాటాడుతున్నట్టు వినిపిస్తోంది ఆ గొంతు..
"ఇక్కడే ఉన్నాను నాన్నా .. చెప్పు..." మా నాన్న గారి మంచం మీద కూర్చున్నాను ,ఆయన చెయ్యి పట్టుకొని..
మంచి నీళ్ళు అన్నట్టు సైగ చేశారు .. ఝాన్సీ  ఎప్పుడు తెచ్చిందో  తెలియదు.. చటుక్కున నాకు నీళ్ళ చెంబు అందించింది .. నాన్న గారు నీళ్ళు తాగి ..

" నీకో విషయం చెప్పాలి నాన్నా .."

ఆయన గొంతు ఎంతో తేట పడింది నీళ్ళు తాగిన తరువాత....

" ఏమిటి నాన్న అది.?"

" ప్రతి ఒక్కరి జీవితం లో ఒక సత్యం ఉంటుంది రా ... అది కనుక తెలుసుకొని ఉంటే .. దానిని మోస్తూ బ్రతకాల్సిన పని లేదు. ఆ సత్యమే నిన్ను నడిపిస్తుంది. నా జీవితం మొత్తం  నేను ఒక నిజాన్ని మోస్తూ బ్రతికాను రా. దాని భారం ఎంత అంటే.. ఈ రెండు నేలలు అనుభవించింది..  చాలా తక్కువ... నీకు చెప్పకూడదు అనే అనుకున్నా ... నీకు చెప్పకుండా నేను ఆ భారం నుంచి.. విముక్తి పొందటం అసాధ్యం అని అర్ధమయ్యింది రా ! మీ అమ్మ గుమ్మం తగిలి.. ఆ అదురుకి రోటి మీద పడి తలకు గాయం అయ్యి చనిపోయింది కదా.. తనంత తానూ గా ... పడలేదు రా.. మీ అమ్మ పోకముందు వరకు నాకు విపరీతమైన కోపం ఉండేది... అయిన దానికి కాని దానికి కోపం వచ్చేది ... ఆ రోజు కూడా దేనికో  వాదులాట జరిగింది... మీ అమ్మ ఎప్పుడూ ఓపికగానే  ఉండేది .. ఆ రోజు నేను మరీ.. మితి మీరి అరవటం తో తను నాకు ఎదురు సమాధానం చెప్పింది... నాకు ఎదురు సమాధానం చెప్తుందా,అనే ఉక్రోషం తో .. చెయ్యి చేసుకున్నాను. ఆ అదురుకి .. గుమ్మం తగిలి రోటి మీద పడింది .. తలకు బలమైన గాయం అయ్యింది.. ఆసుపత్రి కి తీసుకు పోయాం. అది మాత్రం అందరిని బయటకు పంపి,తన పరిస్థితికి కారణం నేను కాదు,నేను అలా కొయ్యబారి పోయి దిగులుగా ఉండటం తనకు నచ్చదు... అని చెప్పింది.. జరిగింది ఎవరికీ చెప్పకూడదని ఒట్టు వేయించుకుంది.. నిన్ను జాగ్రతగా పెంచమని నాకు అప్పచెప్పింది... రెండు రోజులు  పోయాక.. చనిపోయింది.. నిజానికి మీ అమ్మ దేవత రా.. కాదు నా భార్య దేవత ... దేని గురించి ఆ రోజు ఘర్షణ అని మటుకు అడగకు.. నేను చెప్పను.. అది కోపగించుకోటానికే చిన్న విషయం .. ఇంక మనుషుల్ని దూరం చేసుకునే విషయమే కాదు.. ఈ నాన్నని అసహ్యించుకోవు కదరా నాన్నా ..."

అంటూ నా వైపు మా నాన్న చూసే వరకు నాకు తెలియలేదు.. నేను ఎప్పడు దూరంగా జరిగానో.. అసహ్యించుకోకూడదా ? ఎందుకని? ఒక్క  కారణం చెప్పండి ?హంతకులు మీరు !మీకు గంగా కి తేడ ఏమిటి నాన్న? అని పెద్దగా అరవాలి అని ఉంది. అయన ఎప్పుడు ఆఖరి శ్వాశ వదిలారో నాకు తెలియదు.ఝాన్సీ ఏడుపు మాత్రం వినిపిస్తోంది,మా నాన్న హృదయం ఆగిపోయింది. పోతే పోనీ ఇక్కడ నీ ప్రపంచమే ఆగిపోయింది. అంతా మోసం. చిన్నప్పటి నుంచి.. అయన ప్రేమ,ఆదరణ అంతా మోసం!అయన పాపాన్ని కడిగేసుకోవాలి అని చేసిన ప్రయత్నాలే .... నా దేవుడు... నా రాముడు.. మా అమ్మని చంపేసిన రాక్షసుడు ఒక్కడే .... నా నమ్మకం, నా ప్రపంచం,నా జీవితం అంతా మోసం!పెద్దగా అరవాలి అని ఉంది. ఏటన్నా .. పరిగెత్తి పారిపోవాలి అని ఉంది ... చీకట్లోకి... ఆగకుండా పరిగెత్తాలి అని ఉంది ... గుండె కొట్టుకోటం  ఆగిపోవచ్చు కదా... నేను పగలు,రాత్రి తేడ లేకుండా ఇదే ఆలోచనలతో.. గడిపెస్తున్నాను.. ఈ ఆలోచనలు నన్ను వీడటం లేదు.. నాన్న గారి అంత్యక్రియలు కూడా అయ్యిపోయాయి... కానీ ...

1986 సెప్టెంబర్ 2

అయినా ... నా పిచ్చి గాని ... ఆయనేదో మహాను భావుడు అన్నట్టు.. సత్యం.. నిజం... వెతుకు.. వెతికితే... జీవితం భారంగా గడవదు అని.. నాకు సుద్దులు చెప్పాడే  ... ఆయనేదో.. ... నాకు రోజు రోజుకి... కోపం ... కోపం తో రగిలిపోతున్నా... నాన్న గారికి అంత కోపం ఉండేదా ? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి... నేను ఎప్పుడు ఆయనని.. కోపం గా  చూడలేదు.. అంత మాత్రానా ఆయన చేసిన పాపం పోతుందా? నిజాన్ని వెతకాలంట. ఎక్కడ?.. ఇప్పుడు నేను ఏ అడవి లొకో వెళ్ళి వెతకాలా?.. .. అంతా మోసం .....

చీకటి లో ఎటో నడుస్తున్నా నేను.. నాకు అర్ధం కాటం లేదు ఏదో అడవి లా ఉందే .. ఇక్కడికి ఎలా వచ్చాను నేను?
నా చేతిలో లాంతరు... కాలి కింద నేల  చల్లగా తగులుతోంది.. ఎక్కడ ఉన్నాను రా భగవంతుడా.?చల్లగా ...గాలి వీస్తోంటే అర్ధం అయ్యింది... నాకు చెమటలు పడుతున్నాయని ... వెళ్దాం అని అడుగు ముందుకేసేసరికి .. ఎవరో... పట్టి కుదుపుతున్నారు నన్ను....

ఉలిక్కి పడి ... లేచి చూసేసరికి... ఇంట్లో.... కుర్చీ ..లో.. హమ్మయ్య!!కలా !?

"ఏంటి నాన్న.. పట్ట పగలు పీడ కలలు కంటున్నావా?" అని అడిగింది మా బామ్మ.
"అబ్బే అదేమీ లేదు బామ్మ.... "

"ఇదిగో... నీకు ధైర్యం వచ్చినట్టు ఉంటుంది ... నాకు పారాయణం అయ్యినట్టు ఉంటుంది ... కాస్తా సుందరాకాండ .. చదివి పెట్టు నాన్నా ..."

నాకు కోపం  వచ్చింది ఎందుకోస్తోందో.. ఏమో తెలియదు..."రాముడు!రాముడంటేనే.. మోసం..."నా మొఖం ఎర్రగా అవ్వటం నాకే తెలుస్తోంది....

" ఆలి ని అడవుల పాలు చేసిన ఆ రాముడి కధ  నేను చదవను బామ్మా "

"పోనీ రావణుడి కధ అనుకోని చదువు నాన్న ... ఎలా చదివినా పుణ్యమే "

నాకు కోపం అవధులు దాటుతోంది....

" పరాయి స్త్రీ ని చేర పట్టిన ఆ నీచుడి కధ నేను చదవను బామ్మ.."

మా బామ్మ నెమ్మది గా లేచి వచ్చి.. నా జుట్టు నిమురుతూ...

"చూడు నాన్న.. రావణుడు కూడా.. గొప్ప శివ భక్తుడు.. రాముడు ధర్మానికి కట్టుబడి భార్యని దూరం చేసుకున్నాడు... వెతికితే.. రాముడి లో లోపాలు కనిపిస్తాయి.. అలానే ... రావణుడి లో మంచి కనిపిస్తుంది ..ఏమి  వెతుకుతున్నవో... అదే దొరుకుతుంది నీకు.. నువ్వు ఏమి వెతుకుతున్నావు అన్నది.. నీ సంస్కారం కానీ అవతల వాళ్ళది కాదు.." అని అంది...

ఎవరో... చెంప మీద చెళ్ళున కొట్టినట్టు అనిపించింది.... మా నాన్న వెతకమన్న సత్యం ఇదేనేమో.. నా జీవితం లోని భారం దించిన సత్యం ఇదేనేమో.. నాన్న ని ఎలా... ద్వేషించాను నేను?!ఎంత .. తెలివి తక్కువ వాడిని నేను?!
ఈ సత్యం అర్ధం అయ్యాక.. మా బామ్మకి పారాయణం పైకి చదివి వినిపిద్దామని లేచాను...