Sunday, March 16, 2014

వెన్నెల్లో సప్తపది

                                  నాకు మా Classmate చంద్రిక  అంటే  చాలా ఇష్టం! ఆమెని చూసినప్పుడల్లా .. ఏదో తెలియని ఒక ఉత్సాహం  నాలో నిండిపోయేది .. ఆమెతో చాలా సార్లు మాట్లాడినా, తన పై  నాకున్న అభిమానం ఎప్పుడూ  చెప్పలేకపోయాను. తను కూడా  చాలా విచిత్రమైన వ్యక్తి . నాకు ఒక పట్టాన అర్ధం అయ్యేది కాదు. నేను మనస్తత్వ నిపుణుడిని కాకున్నా.. మనుషుల మాటల బట్టి చాలా వరకు అంచనా వెయ్యగలను.. ఈ పిల్ల మాత్రం నాకు అంతు చిక్కని ప్రశ్నే!

                               చదువు పూర్తి అయ్యి ఎవ్వరి దారిన వాళ్ళు  వెళ్ళిపోయే రోజు ధైర్యంచేసి చెప్పాలి అని అనుకున్న.. ఇంతలో తనే నన్ను వెతుక్కుంటూ క్యాంటీన్ లో ఉన్న నా దగ్గరకి వచ్చింది. 

"శశి, నీతో కొంచెం మాట్లాడాలి !"

ఏదో తింటున్న వాడిని తల పైకి ఎత్తి చంద్రికను చూసి .. గొంతు పొరబోయి దగ్గసాగాను .. తను కంగారుగా .. వచ్చి  నీళ్ళ గ్లాస్ అందించింది .. నాకు చందు 4 ఏళ్లగా తెలుసు, తను ఎవ్వరితోనూ  ఈ మాత్రం చనువు ప్రదర్శించలేదు.  చంద్రిక ఒక అబ్బాయి కి తల మీద తట్టి  అతనికి గ్లాస్ తో  నీళ్ళు నోటికి  అందించటం అంటే ప్రపంచ వింతలకన్నా పెద్ద వింత. నేను ఎప్పుడన్నా  నోరు జారి చందూ అంటేనే  "చంద్రిక" అని సరిదిద్దేది.  
  
"ఇక్కడే మాట్లడదామా?" అని అడిగాను 
"అలా గార్డెన్ లోకి వెళ్దాం " అంది  
ఇద్దరం మా కాలేజీ ని ఆనుకొని ఉన్న కొబ్బరి తోటలో  నడుస్తున్నాం .. తను ఏదో చెప్పాలి అని అనుకుంటోంది, అదేంటో  నేను ఊహించలేకపోతున్నాను. కొంపతీసి  నన్ను ప్రేమిస్తోందా ? ఒరే  శశి నీ పిచ్చిగానీ  చంద్రిక ఎక్కడన్న ప్రేమిస్తుందా? ఒక వేళ ప్రేమించినా  చెప్తుందా ? అసలు ఎంత సేపు .. సిద్దాంతాలు , పుస్తకాలూ , విప్లవాలు అని మాట్లాడే చంద్రికకు  ప్రేమ అనేది ఒకటి ఉంది అని  అన్నా  తెలుసంటావా ? అని నా మనసు నన్ను ఆశ పెట్టినట్టే పెట్టి వెక్కిరిస్తోంది. ఇంత ఆలోచనా సమరం నాలో జరుగుతున్నా తను మాత్రం చాల ప్రశాంతం గా  నడుస్తోంది. తనని ఎప్పుడు అడగాలి అని అనిపిస్తుంది ..నిన్ను ఏ  ఆలోచనలూ  బాధించవా? అని అంత నిర్మలంగా ఎలా ఉంటుంది నీ మొహం అని . ఏ  విషయంలోనూ తను తొణికినట్టు, తడబడినట్టు  నాకు ఎప్పుడూ అనిపించలేదు .. ఎలా వస్తుందో తనకు అంత clarity? పోల్చి చూస్తే తనకన్నా నేనే బాగా చదువుతాను .. నేనే ఎక్కువ పుస్తకాలు చదువుతాను .. బయటకు చెప్పను కాని, తనతో ఏదో తెలియని పోటీ  నాకు .. కానీ తానెప్పుడు  అలా అనిపించదు. Looks  like  is  always  at peace  with  herself. నాకు మాత్రం తను ఒక తెలియని మిస్టరీ .. అదే నన్ను తన వైపు ఆకర్షిస్తోంది!

  నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగా  తను తల పైకి ఎత్తి  నన్ను చూసింది .. నడిచే వాళ్ళం ఆగిపోయాం. తన చూపు నాలోని ఆలోచనలను తెరచిన పుస్తకం లా చదివేస్తుందేమో అని అనిపించింది. 

" నువ్వంటే నాకు ఇష్టం .. నీకు కూడా నేనంటే ఇష్టమైతే ..." అని అంటూ నా చెయ్యి తీసుకొని .. ఫోన్ నెంబర్ రాసి .. "Bangalore  number .. ఎల్లుండి వెళ్తున్నాను .. కాల్ చెయ్యి " అని  దగ్గరకు వచ్చి వాటేసుకొని , చెంపపై చిన్నగా ముద్దు పెట్టి  అంతే ధైర్యంగా నడచుకుంటూ వెళ్ళిపోయింది. 

                               నా చుట్టూ ఏమి  జరుగుతుందో నాకు అర్ధం కాలేదు.. ఇది కలా ? నిజామా? ఇలా చేసింది నిజంగా  చంద్రికేనా ? కనీసం చనువుగా పిలిస్తేనే ఊరుకునేది కాదు .. అలాంటిది, ఇష్టం అని చెప్పి , number  ఇచ్చి,
హత్తుకొని , ముద్దు పెట్టుకొని .. వామ్మో .. నేను ధభేల్ అని అక్కడే కూలబడిపోయి .. కూర్చుండి పోయాను. 

                   ఒక గంట తరువాత సత్య గాడు  నన్ను వెతుక్కుంటూ  వచ్చే వరకు నాకు స్పృహ లేదు ఏమిటిది  4 ఇయర్స్ నుంచి నాకు తెలిసిన చంద్రిక ఈ పిల్ల కాదు .. తనకు ఇంత ధైర్యం ఉందా? నాకు చంద్ర్రిక అంటే ఇష్టమున్నా  ఈ రోజు జరిగిన సంఘటనకు భయం వేసింది. అమ్మో అనిపించింది . తనని నేను ఇష్టపడటం సబబేనా? అనిపించింది .. లేదంటే నేను జీవితం లో చేసే పెద్ద పొరపాటు ఇదా ?  ఇన్ని ఆలోచనలు కమ్ముతున్నా .. అంత  అందమైన అమ్మాయిని  వదులుకోవటం ఇష్టం లేక ఫోన్ చేశాను. అంతగా పెళ్ళి  వరకూ  వస్తే అప్పుడే  చూద్దాం లే  అని అనుకున్నా . అయినా  మాట్లాడటం లో తప్పేముంది  చెప్పండి ?

                             నేను హైదరాబాదు లో  తను బెంగుళూరు  లో ఫోన్ లో మాటలు, అప్పుడప్పుడూ  కలుసుకోటాలు, చాలా  అందంగా ఒక సంవత్సరం గడిచిపోయింది. మొదట్లో తన మీదున్న సంకోచాలు నాకు ఇప్పుడూ  ఉన్నాయి .. ఐన తనలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. తన నుంచి దూరంగా వెళ్ళాలి అనుకునే కొద్ది నాకు తెలియకుండానే .. నేను దగ్గర అయ్యాను .. తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే .. తన దగ్గర మొదట నేనే పెళ్ళి ప్రస్థావన తెచ్చాను .. అబ్బా! అలా చిరాగ్గా చూడకండి .. తనతో ఎవరున్న అంతకన్నా ఏమీ చెయ్యలేరు ! మనసులో ఏదో ఒక మూల చిన్న స్వరం సన్నాయి నొక్కులు నొక్కుతునే  ఉంటుంది...  జాగర్త రా పెళ్ళి  అంటే కూరుకుపోతావ్ .. అసలే ఆ పిల్ల చిచ్చర పిడుగు  అని.. కానీ  చందూని చూసినా, మాట్లాడినా .. ఆ స్వరం కూడా కుక్కపిల్లలా  తోక ముడుచుకొని .. ఒక మూల నక్కి ఉండి పోతుంది. చందూ  నాకెప్పుడూ  తన నుంచి దూరంగా వెళ్ళటానికి కారణాలు .. ఉండేలా  చెయ్యలేదు!
              
                            మా పెద్ద వాళ్ళు , వాళ్ళ పెద్ద వాళ్ళు పెళ్ళి  ముహూర్తం  పెట్టారు  మే 20 న. మా వాళ్ళు AC ఫంక్షన్ హాల్  అన్నారు - వాళ్ళు బస్సు  పురమాయిస్తాం  బంధు మిత్రులతో మా ఊరు రండి .. పెళ్ళి  మా ఇంట్లో ఇది మా ఆనవాయితీ అన్నారు .. మా వాళ్ళు buffet  ప్లేట్  కి 1000 రూపాయలు తగ్గకుండా పెట్టాలి అన్నారు -- వాళ్ళు పంక్తి భోజనాలు రుచిగా చేయిస్తాం అన్నారు. మా వాళ్ళు మాకున్నది ఒక్కడే పెళ్ళి  ఏ  లోటూ లేకుండా  చెయ్యాలి అన్నారు -- వాళ్ళు సరే అన్నారు కానీ  నాకు  అనుమానం గానే ఉంది. నేను చందూ ని  తప్ప ఎవ్వరినీ చేసుకోను అని పట్టుబట్టటంతో మా వాళ్ళు నా వైపు చుర చుర చూస్తూ ఒప్పుకున్నారు! వాళ్ళ బాధ ఏంటి అంటే పెళ్ళి  అనేది జీవితం లో ఒక్క సారి వచ్చే పండగ ఆ మాత్రం లేకపోతే ఎలా అని .. చందూ వాళ్ళేమో .. అనవసరమైన ఆర్భాటాలు ఎందుకు అని .. నేను అడ్డ కత్తెరలో పోక చెక్కల ఉండిపోయాను!

                           పెళ్ళి రోజు చందూ  వాళ్ళ విడిదింటి దగ్గర బస్సు దిగిన వెంటనే పెద్ద షాకే తగిలింది. మా అమ్మ చెప్పినట్టు పెద్ద పెద్ద బ్యాండ్  మేళాలు  ఏమీ లేవు, చిన్న సన్నాయి మేళం ఉంది .. తంతులన్నీ బానే సంప్రదాయం గానే జరుగుతున్నాయి కానీ  ఎక్కడా  ఆర్భాటం లేదు .. ఇది మా వాళ్ళకు నచ్చలేదు .. నేను కొంత చిన్నబుచ్చుకున్నాను ... నా ఫ్రెండ్స్  పెళ్ళిళ్ళు  అంత వైభవంగా  నాది జరగటం లేదే అని.. మా వాళ్ళలో కొంత మంది పెళ్లి మానుకొని పోదామా అని కూడా అన్నారు ... కానీ  దేవుడి దయవల్ల .. ఎవరో మా వాళ్లలోనే సర్ది చెప్పి తమాయించారు. 

                              విడిది ఇంటి నుంచి పెళ్ళి  పందిరికి వచ్చే సరికి  మాలో చాలా మంది కోపం చప్ప పడిపోయింది.  చందూ  వాళ్ళింటి ముందు ఉన్న జొన్న తోటని శుభ్రం చేసి అందులో topless  మండపం వేయించారు. పందిరిని అరిటి బోదెలతో నాలుగు వైపులా స్థంబాల లా  అలంకరించారు.. పందిరి ని సన్న జాజులు ,
కనకాంబరాలు  తో అలంకరించారు. అక్కడక్కడా  మొగలి రేకులు కూడా గుచ్చి నట్టు ఉన్నారు .. సువాసన వేద జల్లుతున్నాయి .. అత్తరు వాసన కాదు పూల ఘుమఘుమలు ... చందు వాళ్ళ ఇంటికి అనుకుని ఉన్న రోడ్ అవతల చరువులో తామర పువ్వులు... ఎంతో అందం గా కనిపిస్తున్నాయి  వెన్నెల్లో ... నేను పీటల  మీద కూర్చొని, తల పైకి ఎత్తి చూస్తే విరగ కాసిన వెన్నెల చిరునవ్వులు చిందుతోంది.. పెద్ద హడావుడి lighting ఏమి లేకపోవటం తో చంద్రుడే హైలైట్  గా నిలిచాడు .. పెళ్ళికి వచ్చిన వాళ్ళు .. హాయిగా వెన్నెల్లో కూర్చుని పెళ్లి చూడ వచ్చు. పచ్చి పూల మండపం అని వినటమే  కానీ ఇంత అందంగా ఉంటుంది అని అనుకోలేదు!! విస్తర్లలో భోజనాలు, వాటి సువాసనలతో పాటుగా .. పూల పరిమళాలు ... అబ్బా! వైభవం అంటే ఇది కదా అనిపించింది!
 ఇలా అనుకుంటూ ఉండగానే చందూ  కొబ్బరి కాయ రెండు చేతులతో పట్టుకుని ఎప్పటి లాగానే ఎంతో ఆత్మ విశ్వాసంతో నడచి వస్తోంది .. అదేంటో తను తల దించుకొని ఉన్న confident గానే అనిపిస్తుంది నాకు ! వదులుగా వేసుకున్న జడ .. తన ముంగురుల మీది నుంచి బాసికం కట్టారు ..తన కురులు గాలికి లేలగా ఎగురుతుంటే ..  బాపు గారి హీరోయిన్ లా అనిపించింది! ఏ  మాటకి ఆ మాట , మన స్టేటస్ కి తగ్గ చీర కాదు చాలా  తక్కువలో తేల్చేసింది  అని మా అమ్మ పెదవి విరిచిన చీరలో తను దేవ కన్యలా  ఉంది! చీకటికి దిష్టి చుక్క పెట్టినట్టు ఆకాశంలో చందమామ ఉంటే ...  ఆ చీకటిని చందమామకి దిష్టి చుక్క పెట్టినట్టు ఉంది ... నా చందూ!..  ఒకే ఒక్క నిముషం అందరూ  మాయమయ్యి పోయి మేమిద్దరమే ఉంటే  ఎంత బాగుండు  అని అనిపించింది. 

                           మొత్తానికి పెళ్ళి  అంతా  అయ్యే సరికి మా వాళ్ళందరూ చాలా  ఆనందంగా ఉన్నారు. నాకేమో చందూ  తో ఒంటరిగా ఎప్పుడెప్పుడు మాట్లడతనా అని ఒకటే ఆత్రుత.. చివరికి రెండు రోజుల తరువాత వాళ్ళ పెరటి లో ఇద్దరం .. ఒకళ్ళకి ఒక్కళ్ళం వీపులు జారబడి కూర్చొని ముందుకు వెనక్కు ఊగిసలాడుతూ ... మాట్లాడుకున్నాం .. పెళ్లి సంగతులు అన్నీ ... 

 "చందూ .."
"ఊ "
" ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలి అనుకున్న .. "
"అడగండి "
"నువ్వు కాలేజీ లో నాకు propose చేసినప్పుడు  అంట ధైర్యంగా  అల ఎలా ?  I  mean  నువ్వు అంతక ముందెప్పుడూ  అలా  లేవు "
"శశి , నాకు మీరంటే ఇష్టం .. మీక్కూడా నేనంటే ఇష్టం అనే అనిపించింది! 4 ఇయర్స్ నుంచి మీరు నాకు తెలుసు . ఒక వేళ  ఇష్టం లేకపోయినా .. మీరు advantage  తీసుకోరు అని నా నమ్మకం. ఈ వేళ  పెళ్ళి  అయ్యింది కానీ  ఒక వేళ ఏదీ కుదరలేదనుకోండి .. లైఫ్ లో నాన్న గారి తరువాత అంత  నచ్చిన మొదటి  వ్యక్తిని కనీసం హత్తుకోలేదు అనే బాధ ఉండకూడదు కదా! అలా అని మిమ్మల్ని కాకుండా వేరే ఎవరినన్నాపెళ్ళాడిన ఏదో పాపం చేశాను అని ఫీల్ అవ్వను.. ఎందుకంటే హత్తుకుంది ప్రేమతో కానీ కోరిక తో కాదు!" అంటూ లెచి.. మంచం చుట్టూ తిరిగి నా ముందుకు వచ్చి ... నా ముందు కింద కూర్చుని ..  " అసల  అదంతా  కాదండి  what's  life  without  a little adventure in  love ?" అని కనుబొమ్మలు ఎగరేసి నవ్వింది. 

నా మనసులోని అన్ని స్వరాలూ ఏకమై , నా గుండె ఒకే ఒక్క మౌన రాగం ఆలపించింది .. 

"Damn! I  Just  Love  Her !!!"