Tuesday, March 20, 2012

Ramanee

అలో అలో అల్లో  నా పేరు కధ అండి. అదేం పేరు ? అనకండి. నాకు రాసే వారు పెట్టినన్ని పేర్లు ఉన్నాయి, చదివే వారు గుర్తెట్టుకునన్నిపేర్లు ఉన్నాయి. ఏ పేరు గల కధ ని ఐన ఆ కధ , ఈ కధ అంటారే కనీ, అదిగో ఆ 'బుడుగు' ఇదిగో ఈ 'మడుగు' అని అనరు కదా? ఎంటే కధా అర్ధం అయ్యే లా చెప్తేనే కదా ? అని అంటారు అని తెలుసు  సుమా! ఇప్పుడూ "ఓయీ పుల్లమ్మా! ఆ బుడుగు కధ చదివావా? ఈ మడుగు కధ తెలుసునా?" అని అంటారు కదా? అది అన్న మాట కధ!

     ఇంతకీ కధ లోకి వస్తే, అనగనగా ఒక ఊర్లో కధలు రాసేసి బోలెడంత పేరు తెచ్చుకోవాలి  అనుకునే ఒక వెంకట సుబ్బమ్మ ఉందన్నమాట. దానికేమో కధలు రావాయే! ఏదో ఒక వ్యధ ని పెట్టి కధ రాసేది. పైగా వ్యధలు లేనిదే కధలు రావంటుంది. నిజమే అనుకోండి! కనీ ఈ పిల్ల ఒక రోజు వ్యధ లేని  కధ రాస్తాను అంది. అప్పుడు నేను  రాయలేవు అన్నాను. సుబ్బి కి బోలెడంత కోపం వచ్చి రాసి తీరుతాను  అంది. రాయలేవు గాక రాయలేవు అన్నాను నేను. ఇప్పుడే మొదలెడతాను అంది.. హా బ్రమ్హాండగా ... మొదలు పెట్టు, చూద్దాం అని అన్నాను నేను." అందరూ ఆనందం గా ఉన్న ఊరి లో , అందరూ ఆనందం గానే ఉన్నారు, ఎప్పటికీ ఆనందం గానే ఉన్నారు" ఇదే కధ, నేను పకా పకా నవ్వి.. నా ప్రేయసి వ్యధ లేనిదే నేను సంపూర్ణం కాను, అని చెప్పే సరికి సుబ్బి కి అర్ధం అయ్యింది. ఇంక నేను రాయలేను అని అది డీలా పడితే దాని తరపున నేను మీకు కధ చెప్తున్నాను.

      ఒక అందమైన పల్లెటూరు. కను చూపు మేర అంతా పచ్చని పొలాలు. సినిమాల్లో చూపించినట్టు, గబాలున గట్టు వెంట పరుగేట్టేరు! అడుగు  జారి అడుసు లో పాడేరు. అడుసు అయితే పోనీ కడిగెసుకోవచ్చు, అదే చేను నాశనం చేస్తున్నారు అని ఆ ఆసామి వచ్చి నాలుగు తగిలిస్తే , ఒళ్ళు చింతకాయ పులుసు అవ్వుతుంది.అందుకని చేను వదిలి ఊరి మధ్య ఉన్న చెరువు దగ్గరకు వచేద్దాం ఏమంటారు ? చెరువు చుట్టూతా ఇళ్ళు, చెరువుకు ఒక వైపున రామాలయం, రామాలయం ఎదురుగా బడి.

     బడి లో చాలా మంది పిల్లలే ఉన్నారు సుమండీ! అదిగదిగో అందరి లోను.. ఎర్ర గౌను లో కనిపిస్తోందే ఆ పిల్లే రమణీ, మన కధ కి కధా నాయకురాలు. చూడబోతే రమణీ ఎందుకో కస్సు బస్సు మంటున్నట్టు ఉంది, కనుక్కుందాం పదండి.

"రమణీ ! ఎలా ఉన్నావు?"

"ఏదో ఇలా  ఉన్నాను లే"

"ఎవరేమన్నారు నిన్ను ?"

" మా పంతులు గారు పరీక్షలకి ఎలా చదువుతున్నావు అని అడిగి.... ఎందుకు లే "

" చెప్పు.. పర్లేదు "

"ఏముందీ నీకు లెక్కలు సరిగ్గా రావు కదా, నీ ఎదురు రవి ఉంటాడు, పరిక్ష అప్పుడు సాయం చెయ్యమని చెప్పాను ఏదైనా ఇబ్బంది అయితే తను చూపిస్తాడు లే , నువ్వు ఈ పరీక్ష పాస్ అయితే నీ పై చదువులకు నేను సాయం చేస్తాను అని అన్నారు"

" మంచిదే కదా?"

"ఏంటి మంచిది? నీకు చేత కాదు కానీ ... అని అవమానిస్తేను... నీకు అర్ధం కాదు లే "

అని చర చరా వెళ్ళిపోయింది.

రమణీ పరీక్ష ఎలా రాసిందో కనుక్కుందామని ఇలా కాపు కాసి కూర్చున్నా, వాళ్ళ బడి బయట. అదిగో వస్తోంది రమణీ.

" పరీక్ష ఎలా రాశావు రమణీ? మనలో మన మాట రవి చూపించాడ? నువ్వు చూసి రాశావా?"

"వాడు చూపిస్తూనే ఉన్నాడు, కానీ  నేనే వాడి దాంట్లో చూసి రాసేది ఏంటి అని సొంత గా రాసేసాను...."

ఏమనుకుందాం అండీ ఈ పిల్లకి ? పొగరా? ఆత్మ విశ్వాశామా? ఏదో ఒకటి లెండి ...

ఒక పది రోజుల తరువాత నాకు రమణీ ఏడుస్తూ కనిపించింది..

"ఏం ఏడుస్తున్నావ్?"

"నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యాను , మిగతా  అన్ని ఫస్ట్ క్లాసు కానీ లేక్కలోక్కటే పోయింది.."

నేను చెప్పలేదటండి, ఈ పిల్ల కి పొగరే...

"అయ్యో రమణీ పరీక్ష పోతే పోయింది ఏడవకు..."

" ఇంక అంతే! నాన్నగారిని పై చదువుల గురించి అడగలేను..."

"అదెంత పని మల్లి రాసి పాస్ అయ్యి అడగచు లే .."

" లేదు లే పెళ్లి చేసేస్తాను అని అమ్మ తో అన్నారు ... నా తల రాత ఇదంతా..."

అని... పరిగెట్టుకుని  వెళ్ళిపోయింది . ఎప్పుడు నా మాట పూర్తి గా విన్నది కనుక?

ఆ తరువాత రెండేళ్ళు నాకు రమణీ ఎక్కడుందో తెలియలేదు... ఎవరో వైజాగ్ లో వాళ్ళ నాన్న

వాళ్ళు hotel  పెట్టుకున్నారు అని విని పలకరిద్దాం అని వెళ్ళాను ..

రమణీ ఏడుస్తోంది ... ఎవరికీ కనిపించకుండా..

వాళ్ళ అమ్మ నాన్న పెద్దగా వాదించుకుంటున్నారు ...

"ఇంతకముందు వద్దనుకున్నాం కదండీ?  పని ఉంది అని ఊరు వెళ్ళిన వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పకుండా

పెళ్లి కుదుర్చుకొని వచ్చాను అంటే?" అని అంది రమణీ వాళ్ళ అమ్మ

"అంటే పెళ్లి కుదిర్చినట్టు."

"బాగుంది నాకు చెప్పకపోతే చెప్పకపోయారు , పెళ్లి అనుకునే అప్పుడు అమ్మాయిని ఒక్క మాట అన్నా అడగాలి కదా..?"

"ఏమిటే దానిని అడిగేది  నిన్ను అడిగేది? అతనకి ఉన్నది చిన్న లోటు అంతే, దానిని ఎత్తి  చూపించకుండా,

అమ్మాయికి సర్ది చెప్పి పెళ్ళికి తయారు అవ్వండి" అని తీర్మానం చేసారు ఆయన.

రమణీ ని చూస్తే జాలి వేసింది.. పలకరించ బుద్ధి కాలేదు.

మళ్ళి ఒక ఐదు ఏళ్ళ తరువాత, తను ఎలా ఉందో చూడాలనిపించింది.

ఎలా ఉందో ఏంటో , ఏం చూడాల్సి వస్తుందో అని భయపడుతూనే వెళ్ళాను ....

కనీ తను ఎంచక్కా ఇంటి పనులు చేసుకుంటూ ఉంది... ప్రశాంతం గా ఉంది అనిపించింది

"రమణీ ... ఎలా వున్నావు?"

"కధా? నువ్వా ? ఎన్ని రోజులైంది  చూసి..? నేను బానే ఉన్నాను.."

"నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగింది కదా?"

" కొన్ని అల జరిగిపోతుంటాయి.."

"నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, నిన్ను పలకరించే ధైర్యం లేక తిరిగి వెళ్లి పోయాను.."

"పోనీ లే వదిలెయ్యి..."

"నువ్వు ఆనందం గానే ఉన్నావా?"

"బానే ఉన్నాను అని చెప్పాగా...  ఇద్దరు పిల్లలు ... బయట ఆడుకుంటున్నారు.."

"మీ ఆయన మంచి వాడేనా?"

"మంచో చెడో.. నువ్వు ఇప్పుడు ఆర్చేది తీర్చేది ఏం ఉంది చెప్పు? నేను చాలా ఆశలే పెట్టుకున్నా జీవితం లో, చదవాలి అని ఇంకోటి అని.. అన్ని అనుకున్నట్టు జరగవు గా, అల జరగలేదు అని ఎప్పటికీ ఏడుస్తూ ఉండి పోలేను గా ? నా పిల్లలు నేను బాధ పడినట్టు బాధ పడ కూడదు అని .. నా తాపత్రయం... అలానే పెంచుతున్నాను కూడా... ఈ సోది అంత ఎందుకు కానీ  ... ఉండు తినటానికి ఎమన్నా తీసుకొస్తాను"
అని చర చరా వంటింట్లోకి వెళ్ళిపోయింది.

ఆడ పిల్ల అనిపించుకుంది రమణీ.... పందిరి ఎలాంటిదైన...మల్లె తీగ మాత్రం ఘుబలించే పూలనే పూస్తుంది...
మన లో ఉన్నా రమణీ లకి అందరికీ... పాదాభి వందనం చేస్తూ ... నన్ను నేను అంకితం ఇస్తున్నాను అంటే...
ఈ కధ అంకితం చేస్తున్నాను..

ఇట్లు
మీ కధ.