Wednesday, September 18, 2013

కార్తిక పౌర్ణమి -III

నేను బయటకి  వచ్చిన  నిముషం నుంచి ఆగకుండా పరిగెడుతున్నా,నా చెయ్యి పట్టుకొని పరిగేడుతున్నది ఎవరు..? అయ్యా రేణు  అందులోనే ఉండి పోయిందే  అని చూస్తే...  నన్ను బయటకు లాగిందే రేణు! నేను గమనించలేదు.. నేను భయపడుతుంటే  అది బయటపడే మార్గం ఆలోచించినట్టు ఉంది ...  మా వెనకాల శబ్దమే లేదు!మమ్మల్ని వాళ్ళు, తరమటం  మానేశారా? ఆగకుండా చాలా దూరం పరిగెట్టి బహుశా ఒక  పావుగంట సేపు పరిగెత్తమేమో.. ఇంక పరిగెట్టే ఓపికలేక ఒక  గుబురుగా ఉన్న  చెట్టు దగ్గర ఆగాము. విపరీతం గా అలిసిపోయా, ఆయాసం వస్తోంది, రేణు  మాట్లాడలేక సైగ చేసింది.. పైకి ఎక్కమని, అతి కష్టం మీద నేను చెట్టు ఎక్కుతూ 'ఖర్మ కాకపోతే లంగా ఓణి తో  చెట్టు ఎక్కటమేంటి? చచ్చే కష్టం గా  ఉంది  అనుకుంటూ ఉండ గానే పరికిణి  చివర చెట్టు కొమ్మకు చిక్కుకొని... వెనక్కు లాగినట్టు అయ్యి కింద పడ్డాను. "త్వరగా ఎక్కవే! ఈ చెట్టు చాలా  గుబురుగా  ఉంది  ఎవరికీ  కనిపించము" అంది  రేణు. నేను మళ్ళి కష్ట పడి  చెట్టు ఎక్కి , రేణు ని ఎక్కమనే లోపల ఎవరో ఆకుల్లో కదలాడే శబ్దం, మనుషులు కనిపించలేదు కానీ , అడుగుల శబ్దం పెద్దగా వినిపించింది  నేను పైకి సర్దుకున్నాను రేణు  ఎక్కుతుందేమో అని .. కానీ  తను  అక్కడే ఉండు  అన్నట్టు  సైగ చేసి, ఎదురుగా  ఉన్న  పొదల్లోకి  వెళ్ళింది. కింద ఆ రెండు జతల కాళ్ళకి సంబందించిన శరీరాలు కనిపించాయి....  నాకు ఒక్క నిముషం  గుండె  కొట్టుకోటం ఆగిపోయింది.. ఒక్క నాలుగు అడుగులు వేస్తే రేణు కనిపిస్తుంది.. లేదా పైకి తల ఎత్తి  చూస్తే నేను కనిపిస్తాను.... ఛ ! రేణుని ముందు ఎక్క మనల్సింది, పాపం దాని చేతికి గాయం కూడా అయ్యింది..
"యాడకి  పొయ్యి   ఉండరు! ఈడనే  దాక్కున్నారు!  ఈ దిక్కునే  పహారా కాద్దాం బిడ్డా !" అని అన్నాడు శివ , విని తల ఊపింది ఆరుద్ర. ఇద్దరు కొంత దూరం నడిచారు, తరువాత కనిపించలేదు..  చెట్టు దిగటానికి నాకు, ఆ పొదల్లోంచి కదలటానికి రేణుకి ధైర్యం చాల లేదు... అక్కడే ఉండు  అన్నట్టు సైగ చేసింది..
ఈ లోపల అమాంతం  పున్నమి వెన్నెలని వెక్కిరిస్తూ  మబ్బులు కమ్మేశాయి! వెన్నెల కాంతి అంతా చీకటి మయం  అయ్యిపోయింది.. విపరీతమైన వర్షం, ఎంత సేపు పడిందో చెప్పలేను.. బహుశా  రెండు గంటలు పడిందేమో.. మధ్యలో రేణు. గట్టిగా కేకపెట్టింది! ఎంత ప్రయత్నించినా  నాకు తను ఉన్న  చోట చీకటి తప్ప ఏమి కనిపించలేదు, వర్షం  సూదుల్లా  కంట్లోకే కురుస్తోంది! చూడలేకపోతున్న! తను ఎందుకు అరిచిందో,కిందకు  దిగే ప్రయత్నం కూడా చెయ్యలేకపోయాను.. ఎందుకంటే  ఎవరో చాలా  దగ్గరగా  తిరుగుతున్నట్టున్నారు .. చీకటి, భయం ..  తనకు  సాయం  చేసేందుకు కిందకు  దిగాలేకపోయాను. వర్షం తెరిపిచ్చాక వెన్నెల అల్లుకుంది.. అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న  అడివి .. వర్షం  పడి  ఆగటంతో  అప్పుడే జీవం సంతరించుకున్నట్టు.. కీచురాళ్ళు , కప్పల  శబ్దాలతో, గుడ్లగూబల కూతలతో ...  నక్కల ఓలలతో  మారు  మోగిపోయింది.. ఇది కలే కదా! కల అయితే ఎంత బాగుణ్ణు!

                                                                 ****

ఏడనున్నారో ? ఎన్ని జన్మాలు  వేచాం సామి ..  ఈ యాల ... మా జీవితాలకి అర్ధం సెప్పె ఈ యాల గూడా  నీ పరీచ్చ ఆపవా సామి?...  నాకాడికొచ్చిన  ఈ వరాన్నిఇడిసి పెట్టా! ఈ యాల అడివంతా  జల్లెడ పట్టి అయినా  ఆళ్ళని  ఎతకాల... నానేమన్న  పొరపాటు సేసినానా?  నాను  సరిగా కలియజూడటం  లేదా? నా బిడ్డ! ... అని ఒక్క నిముషం కన్నపేగు కలుక్కు మన్నాది .. నా కంట్లో చివ్వున్న నీళ్ళు తిరిగినాయి.. ఆ ఎంటనే  మా అయ్య గుర్తోచినాడు.... ఆడేప్పుడు అనేటోడు ... "రుద్రయ్య బంటు అంటే... గుండె రాతి బండ లెక్క ఉండాలా" అని
ఈ యాల.. ఆడి  మాటల సారం బోధ పడతాంది! ఓ దిక్కు.. రుద్రయ్యకి మోచ్చం .. ఇంకో దిక్కు...
"బిడ్డా ! ఆ ఎదర  చూడు నువ్వు .. ఈ యెనక జూస్తా నేను !"
"అట్నే అయ్యా!"
నా బిడ్డ నా మాట దాటింది లేదు.. ఈ అయ్యా ఏది సెప్తే అది నమ్మినాది.. పసిగుడ్డుగా  ఉన్న  దినాం  మొదలు .. ఈ యాల  దాకా రుద్రయ్య కటాచ్చమే.. నా బిడ్డ అని నమ్మినా! ఈ యాల అది నిజం అయినాది .. అయినా నా  గుండె  బరువేక్కుతాందే... ఎతుకు శివయ్య  ఎతుకు .. ఆళ్ళు  కాన రావాల.. ఎన్ని జన్మాల... కాంచ  తీరాల..
ఎతికితే.. ఆళ్ళు  కానోస్తే... అయ్యా! నా గుండె గతి తప్పకుండా చూడు.. ఎనకడుగు ఎస్తానేమో  అనే  ఈ సమయాన మా అయ్య సెప్పిన పురాణం గుర్తుకు అస్తాంది!

                                                                 ****
"ఎయ్యి సంస్త్సరాల నాటి గుడి బిడ్డా ఇది.." నా సిన్న సిన్న కళ్ళు పెద్దవి సేసి సూసినాను.. నాను నమ్మలేక పోయినా..
"రుద్రయ్య బతికి  ఉండేటోడు  .. మనం తిరుగాడే నేల  మీదనే .. రుద్రయ్య నడిసిండు.... సెడు సేసే ఆళ్లంటే రుద్రయ్య
ఇడిసిపెట్టెటోడు   గాదు.. ఈడనే .. అప్పటి స్మశానం ఉండెడిది.. రుద్రయ్య.. ఈడనే .. ఉండేటోడు.. తప్పులు సేసినోళ్ళ  పుర్రెలు హారం  లెక్క  ఏసుకొని  తిరిగేటోడు...  అట్టాంటిది .. రుద్రయ్య  తరవాత..  అట్టా
సిచ్చించే  ఓళ్ళు  లేక నేల  అరాచకాలతో  ఇలా ఇలా లాడిపోనాది... మన పూర్వపుటోళ్ళు..  రుద్రయ్య నడిసిన  చోట గుడిగట్టి.. ఆ సామి ఏసిన సిచ్చలే ఏసేటోళ్ళు.. కానీ  రుద్రయ్యని శివయ్య అని పిలిసేటోళ్ళు  ఉండారు  గందా.. ఆళ్ళు .. గుడి కట్టేదానికి ఒప్పుకున్నరు గానీ.. సిచ్చలు  ఏసేది శివయ్య మాత్రమేనని   వాదులాటకు దిగినారు.. మన ఓళ్ళు ... ఆళ్ళ ఓళ్ళు .. గట్టిగ సమరాన పడినాక.. ఆ కోనేరు శివలింగం మెరవ సాగేనట.."
"అంతక ముందు మెరిసేడిది గాదా అయ్యా ?"
"లే  బిడ్డా... అప్పటి నుంచి ఇది రుద్రాలయమే బిడ్డా..  ఆల్లేమో  శివాలయం అంటారు .. రుద్రాలయం ఉండుట  మంచిది గాదు బిడ్డా...సామి  కోపంగానే ఉన్నాడు  అప్పటి సంది.. ఇది శివాలయం జెయ్యాలంటే.. మూడు ఆరుద్ర నక్షత్రం కన్నేలని బలి ఇవ్వాలి బిడ్డా.. ఒకటి మన బిడ్డ.. రెండు ఆళ్ళ బిడ్డలు.. కార్తిక  పున్నమి నాడు.. నీవు తేగూడదు... ఆల్లంత ఆళ్ళే  గుడి లోనికి రావాల  "
"బలి ఇస్తే సామి శాంతిస్తాడ? ఎవరంటిరి  అయ్యా  బాలి ఈయ్యాలని..?"
"అప్పటి గుడికి  సామి ... ఆ లింగం మేరవసాగానారంభించాక..  రుద్రయ్య కలలోకి వచ్చి చెప్పెనట!"
"బలి గోరే  సామి రుద్రయ్య అయ్యి ఉండడయ్య!"
మా అయ్యా మొఖాన క్రోధం జూసినా ..
"మీ యమ్మ  నీకు శివయ్య అని పేరు పెట్టినప్పుడే ..అడ్డు జెప్తావని అనుకుంటి రా.. "
"నాకు ముందు జెప్పినోళ్ళు.. ఏర్రి  యెదవలా  ఏమి?"
నాను ముడుసుకుంటిని...
"సూడు బిడ్డా... అందరూ  బతకతారు.. రుద్రయ్య కోసం సచ్చే దానికి రాసి ఉండాలి .. "
మా అయ్య జెప్పినదే నమ్మినా  నా బతుకంతా...  రుద్రయ్యను కొలిచినా.... నా బిడ్డకు  అదే జెప్పినా... నేను  నమ్మిందే  జెప్పినా... కాదు కాదు నాకు నమ్మమని జెప్పిందే జెప్పినా... మా పూర్వపుటోళ్ళు  అంతా ఏ  దేననికై ఎదురు జూసి సచ్చినారో .. ఆ రోజు వచ్చే... ఈ దినం రావలేనని... నేను మొక్కని క్షణం లెదు.. కానీ ... సామి.. సంతోసించాల్సిన .. రోజున ... ఈ రాతి గుండెన... కన్నీళ్ళు  ఏంది  సామి... ? ఎతుకు  శివ ఎతుకు ఆళ్ళు  దొరకాల!
కన్నీళ్ళు  తుడు ... నీ బిడ్డని జూసి నేర్చుకో...  రుద్రయ్య కోసం సచ్చేదానికి తాయారు అయ్యినాది...
 కళ్ళు  తుడుసుకుంటి! ఎతకనారంభించినా... రుద్రాలయం... శివాలయం గావల  రేపు .. సూరీడు పోదిచేలోపల.


 

Tuesday, September 17, 2013

కార్తిక పౌర్ణమి --II

నేను... తలుపు మూస్తుండగా  రేణు .. ఆ గుమ్మం  ముందు  ఉన్న మెట్టు మీద కూర్చొని, కత్తి  నెమ్మది గా  తీసి  తన వోణి  తో  కట్టు కట్టుకుంది. పాపం చాలా లోతుకు దిగినట్టు ఉంది, ఎంతో రక్తం కారుతోంది.. కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి  తనకు .. బహుశా నొప్పికి ఏమో...
"ఏమయ్యిందే  తనకు? ఎందుకు అలా చేసింది?"
"ఏమో నాకు మాత్రం ఎం తెలుసు, చాలా విచిత్రం గా ఉంది... అస్సల అర్ధం కాలేదు నాకు ..." తను మాట్లడుతుందే కానీ, శరీరం   వణుకుతోంది... నాకు తన పక్కన కూర్చోవాలి అని ఉన్నా... మావయ్యని వెతికి .. ఇంటికి వెళ్ళాలి కాబట్టి మెట్లు దిగుదాం అని.. చూసే సరికి  మావయ్య లేరు .. గేటు  దగ్గర  పడిపోయి ఉన్నారు...  రక్తం కారుతోంది .. ఆయన తలకి గాయం  అయ్యినట్టు  ఉంది, నేను  వెంటనే  ఆయన  దగ్గరకు వెళ్ళాను.  నాకు  ఒక్క నిముషం ఎం జరుగుతోందో అర్ధం కాలేదు, మమ్మల్ని అంటే  ఆరుద్ర  అలా చేసింది.. మరి మావయ్యని?... ఆరుద్ర  కొట్టిన గంట విని ఎవరో  వచ్చారు ఐతే... వెన్నులో వణుకు  పుట్టింది. ఇంతలో  రేణు  కూడా అక్కడికి వచ్చింది.  అప్పటి వరకు లేని భయం, ఎవరో ఉన్నారు.. ఇక్కడే ఉన్నారు .. ఎటు ఉన్నారో  తెలియదు..
                                                                        ***


"రేణు..  ఎవరో ఉన్నారే .."
 నా గొంతు  నాకే  వినపడలేదు .. భయం తో పూడుకు పోయింది, కానీ ఆశ్చర్యంగా రేణుకి వినపడినట్టు ఉంది, తను తల ఊపింది... ఆ కత్తి గాయం  అయ్యాక ఇదే తన ముఖం చూడటం.. చాలా నిస్సారం గా ఉంది, కానీ  తన కళ్ళు మాత్రం  చాలా చురుకు గా  పని చేస్తున్నాయి.. ఆ ప్రదేశం  అంతా..  పరికించి చూస్తూ, చుట్టూ  చీకటి  గుడి ద్వారం  దగ్గర వెలిగించిన దీపాలు,కోనేరు  దగ్గర ఉన్న శివలింగం  దగ్గర ఉన్న దీపాలు, చంద్రుని కాంతి తప్ప వేరే వెలుగు లేదు.. ఒక్క పది నిముషాల క్రితం( పది నిముషాలేనా ? అప్పుడే ఎన్నో రోజుల క్రితం  అన్నట్టు అనిపిస్తోంది ) చూసినంత అందం గా ఈ ప్రదేశం ఇప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు ఆనందం కంటే  భయం వేస్తోంది.. అంత చలి లొనూ చెమటలు పట్టాయి.  "రేణు , నువ్వు చూస్తూ  ఉండు నేను  మావయ్యకి కట్టు కడతాను అని దిక్కులలో  పొంచి ఉందేమో అని నేను అనుమానిస్తున్న ప్రమాదం కోసం వెతుకుతూ, కిందకి వంగి, మావయ్య  కండువా లా కప్పుకున్న, తుండును తీసుకొని చింపి  ఆయనకు కట్టు కట్టాను. ఆయన్ని కదిపినా లెవ లేదు...  రేణు  కిందకు వంగి, "నీళ్ళు తీసుకురానా?" అని అడిగింది....  బాడ్ ఐడియా, ఎవరో ఇక్కడే ఉన్నారు .. గుడి లోపల ఆరుద్ర ఇంకా తలుపులు బాదుతోంది .. ఇప్పుడు మాలో ఒకళ్ళు  నీళ్ళ కోసం  వెళ్ళటమా?...  నాకు ఎందుకో మంచిగా  అనిపించలేదు...
"ఇద్దరం వెళ్దాం"
 అని అన్నా, తను అదే అనుకున్నట్టు ఉంది..  మావయ్యను అక్కడే  విడిచి పెట్టి ఇద్దరం కోనేరు వైపు అడుగులు వేశాము. ఇంతక  ముందు చూడలేదో, లేదంటే  ఇప్పుడే  వచ్చిందో  ఒక వ్యక్తి  కోనేట్లోని శివలింగం  దగ్గర..  ఒళ్ళంతా  వీబుధి  పూసుకొని  ఏదో ధ్యానం లో ఉన్న వాడిలా(నిజంగానే  ఉన్నాడేమో) కూర్చున్నాడు. ఇద్దరం ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేదు, కోయ్యబారిపోయాం. ఆరుద్ర దగ్గర ఉన్న కత్తి లాంటిదే  శివలింగం  దగ్గర  పెట్టి  ఉంది.
                                                                         ***


 భయం  కమ్మేసింది  ఇద్దరం  మావయ్య దగ్గరకు పరిగేత్తి   ఆయన్ను  లేపే అందుకు ప్రయత్నించాము, అయన లేవ  లేదు.. ఎం చెయ్యాలో  తెలియటం  లేదు...  గుండె చప్పుడు, నా గుండె చప్పుడే  అనుకుంటా  చెవ్వుల్లొ మరణ మృదంగం  లా  వినబడుతోంది. రేణు  దీనంగా  బ్రతిమాలుతోంది
"ప్లీజ్ మావయ్య, లేగవ్వా ? నాకు భయమేస్తోంది  మావయ్య అని", గర్భ గుడి తలుపులు శబ్దం  ఆరుద్ర, తలుపులు  బాదుతోంది...   ఈ లోపల  ఆ శివలింగం  దగ్గర  ఉన్న  వ్యక్తి  కత్తి  పట్టుకొని నెమ్మది గా  లేవ సాగాడు. ఆరుద్ర కళ్ళలో  కనిపించిన అదే ఆనందం  అంత దూరం  నుంచి కూడా నాకు ఆయన కళ్ళలో కనిపించింది.
నాకు భయమేసింది  రేణు ని పట్టుకున్నా..  తను ఏడుస్తోంది .. తనకు దారి తెలుసు  కానీ  ...
 "రేణు .. ఇంటికి ఎలా  వెళ్లలే...  చెప్పు  రేణు!"  తనని  కుదుపుతూ అడిగాను
ఏమి  చెప్పలేదు .. ఇప్పుడు  గుర్తు తెచ్చుకునే  సమయమూ  లేదు...   గుడి  బయట నుంచి  చెట్లలోకి  పరిగెట్టాము.... చివరి గా  వెనక్కి తెరిగి చూసే సరికి ఆ కత్తి మా వైపు విసిరి, అతను గర్భ గుడి వైపు వెళ్తున్నాడు  ఇప్పుడు  ఇద్దరు  వెతుకుతారు, ఒక్కోళ్ళకి  ఒక్కో వేటగాడు గాడు అన్న మాట.  మావయ్యని  ఎం  చేస్తారో, ఆయన్ని  వదిలేసి  రావటం ఏంటి? నా మనసులో తిట్టుకున్నాను. సొంత ప్రాణం అంటే అంత తీపా మాకు? నా మీద నాకే అసహ్యం వేసింది.  కానీ  ఏ  మూలనో, ఆయనని ఏమీ  చెయ్యరు  వాళ్ళకి  కావాల్సింది నేనూ, రేణు  మాత్రమే  అనిపించింది ...  ఇంకా పరిగెడుతూనే ఉన్నాం.. ఇంత  భయం లొనూ  నా బుర్రకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయో  అర్ధం కాదు..  ఎవరన్నా  మేము  పరిగెట్టింది  రికార్డు చేసి ఉంటే, నేను రేణు ఏదో ఒక  వరల్డ్  రికార్డు  బ్రేక్ చేసి ఉండే  వాళ్ళమేమో  అనిపించింది. నా బుర్రకు  బుర్ర లేదు అని తిట్టుకొని, ఏదో  పంపు షెడ్డులా  ఉంది, అందులోకి వెళ్ళాం నేను రేణు. ఇద్దరం  ఆయాసం తో కింద కూర్చున్నాం, పరిగేట్టినంత సేపూ తెలియలేదు కానీ... కాళ్ళు లాగేస్తున్నాయి... కడుపులోని పేగులు మొత్తం ఎవరో  పట్టుకొని పిండేసినట్టు  అనిపిస్తోంది. మొదట కాళ్ళు  మాత్రమే  అనుకున్నా  కానీ, క్షణాలు  గడిచే  కొద్దీ, ఒళ్లంతా  తూట్లు పడిపోయినట్టు  ఒకటే  నొప్పి... ఇద్దరం ఒకరి  మొఖం లోకి  ఒక్కళ్ళు  చూస్తున్నాం కానీ  ఆయాసం  వల్ల  మాట్లాడుకోలేకపోయాం..  చివరకి  రేణు  నే మొదలు పెట్టింది....
"అతని పేరు శివ! ఆరుద్ర  వాళ్ళ నాన్న"
"అది సరేనే, వాళ్ళు ఎందుకు ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు?"
""ఏమో నే"
" దొరికితే చంపేసే లా ఉన్నారు!"
"నాకూ  అదే  అర్ధం కావటం లేదు...  ఎప్పుడు ఇలా ఉండటం  చూడలేదు నేను!...  చాలా  మంచి వాళ్ళు .."
" కత్తులు  పట్టుకొని  మీదకి  వస్తుంటే  మంచి వాళ్ళు అంటావేంటే?" కోపం లో  నా గొంతు  కాస్త  పెద్ద శబ్దం తోనీ  మాట్లాడింది.
 బయట ఏదో అలికిడి అయ్యినట్టు    అనిపించి , ఇద్దరం  బిక్క చచ్చిపోయాం..  ఏవో అడుగులు  ఈ
పంపు షెడ్డు వైపే  వస్తున్నట్టు ఆకుల అలికిడి  వినిపించింది...

ఇద్దరం రెండు చేతులు  నోటికి అడ్డంగా పెట్టుకొని వింటున్నాం  ఎవరో  వస్తున్నారు...   చప్పుడు ...   ముందర తలుపులు కొడుతున్నారు.. లోపల  నుంచి  గడి  పెట్టి ఉండటం  తో ..షెడ్డు లో ఉన్నది  మేమే  అని అర్ధం అయ్యిపోయింది అవతల  వాళ్ళకి...ఆ తలుపు ఏ  నిముషం లో అన్నా వచ్చేసేలా ఉంది... ఇంక దొరికిపోతాం , కాదు  చచ్చిపోతాం ! అనుకుంటూ ఉండగానే , పంపుసెట్టు కోసం గోడలో చేసిన రంద్రం లోంచి నన్ను ఎవరో బయటకు లాగారు..
అరవటానికి ,ప్రతిఘటించటానికి   వీలు లేకుండానే  అంతా.. ఒక్క క్షణం లో జరిగింది..  తలుపు  బద్దలు  అయ్యిపోయిన  నిముషం, ఆ షెడ్డు లోంచి పండు వెన్నెల్లో  తడుస్తున్న  అడివిలోకి  నేను వచ్చిన  నిముషం ఒక్కటే..



P .S: To  Be  Continued .. 

కార్తిక పౌర్ణమి -I

నేను కల కన్నది ఇదేనా ? పొద్దున్న ఉలిక్కి పడి, నిద్ర లేవక ముందు నాకొచ్చిన కల ఇదేనా? ఇది కలేనా? కల అయితే ఎంత బాగుండు, ఇప్పుడు నేను ఉలిక్కి పడి  లేచి, ఇంట్లో హాయిగా నా మంచం మీద వెచ్చని దుప్పట్లో ఉంటే ఎంత బాగుణ్ణు!  కానీ  నాకు నా కళ్ళ ఎదురుగా  ఉన్న  ఈ చీకటి,  చీకట్లో పౌర్ణమి వెన్నెల  కాంతి లో, ఇలా బిక్కు బిక్కు మంటూ , అదే ఈ పరిస్థితి లో కాకుండా ఉండి ఉంటే, మల్లె పూలు విరజిమ్ముతున్నట్టు ఉన్న  వెన్నెలని ఆస్వాదించే దానిని. చిన్న చినుకు చుక్క నీళ్ళలో పడిన శబ్దం, ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డాను, తీరా చూస్తే నా నుదుట చెమట ధారలా కారి, కిందనున్న మడుగులో పడిన శబ్దం  అది....

    ఇక్కడ  కూర్చుని ఈ సమయం లో ఇలా ఆలోచిస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక రెండు రోజుల క్రితం నా జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది!  ఎక్కడి  నుంచో, ఏదో ఒక మూలుగు వినిపించింది.. వెళ్ళనా? ఏమో ఇది నా కోసం పన్నిన వల అయితే?  అమ్మో అది తలచుకోవటానికి , చాలా భయంగా ఉంది. ఒక వేళ అది నిజంగానే  సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రాణి అయితే? ఇది ఇంకా భయం కలిగించింది. ఎప్పుడూ పెద్దగా, దేనికీ  ఏడ్చిన వ్యక్తిని కాను నేను, నిస్సహాయత ఇంత దారుణం గా ఉంటుంది అని మొదటి సారి అనిపించిన తరువాత, ఏడుపు వచ్చింది, ఈ  చీకట్లో..  వెన్నెల్లో..  అడవిలో, ఈ  చెట్టు మీద కూర్చోని  నిస్సహాయంగా  రాలుతున్న కనీళ్ళు  తుడుచుకుంటూ, ఈ పరిస్థితికి కారణాలు అన్వేషించ సాగాను..

                                                                      ***

"యశు, మనకు ఈ వారం రోజులు హాలిడేస్ కదా, నేను మా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా మా ఇంటికి రావే ప్లీజ్"

" మీ ఇంటికా? అమ్మో మా ఇంట్లో ఏమంటారో?" వెళ్ళాలి అనే ఉంది, ఎంత స్నేహితురాలు ఐనా, తను అడగ్గానే  ఎగిరి గంతేసి  ఒప్పుకుంటే ఏం  బాగుంటుంది అందుకే ఈ బెట్టు.
" అబ్బా ! మీ ఇంట్లో నేను అడుగుతాను. ఐన నేను ప్రతి హాలిడే కి మీ ఇంటికి రావటం  లేదా? ఈ సారి   నువ్వు  వచ్చి తీరాల్సిందే!"  తన పద్ధతి లో హడావుడి చేస్తోంది రేణు.

తను, నేను కలిసి నాన్నగారిని ఒప్పించాము. రేణు వాళ్ళ ఊరు చూడాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా,
యానం దగ్గర చిన్న పల్లెటూరు కనకాలపేట  తనది. చాలా పాత ఊరు, ఇండో  ఫ్రెంచ్  కల్చర్, చుట్టూ చిన్న చిన్న అడవులు, ఇవన్ని వినటానికే ఎంతో ఉత్సాహం గా అనిపించింది.  అందులోనూ , చిన్నప్పటి నుంచి యానం  చూడాలనే కోరిక  ఉంది. వీలు కానంత దూరం కాకపోయినా ,ఎందుకో ఎప్పుడూ  వీలు చేసుకోలేదు. ఇప్పుడు రేణు వల్ల  ఆ అవకాశం వచ్చింది. ఎంతో ఆనందంగా అన్నీ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరాము. యానాం లో దిగిన వెంటనే, మమ్మల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళటానికి రేణు వాళ్ళ నాన్న గారు, వాళ్ళ మావయ్య పాత  ambassedor  కారు లో వచ్చారు. హైదరాబాద్ నుంచి యానాం వచ్చిన నాకు 2013 నుంచి అమాంతం 1987 కి వచ్చినట్టు అనిపించింది. అక్కడ ఇళ్ళు, వీధులు మనకు  లానే ఉన్నాయి, కానీ  చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి, అవి ఏంటో  స్పష్టంగా తెలియటం లేదు, అయితే అందంగా మాత్రం అనిపించాయి.ఆ అందం ప్రదేశం వల్ల కాదేమో, బహుశా  ఇక్కడికి వచ్చాను అనే నా ఆనందం వల్లనేనేమో! యానాం  తరువాత, కొద్ది దూరం లోనే  కనకాలపేట అంట!
"ఎంత దూరం uncle  ఇక్కడి నుంచి మన ఊరు?"
"ఇక్కడి నుంచి 10 Km అమ్మ!"
"మధ్యలో అన్నీ  పోలలేనా?"
" కాదు రా, ఊళ్లకు చుట్టు పక్కల  పొలాలు ఉన్నాయి. ఊరు నుంచి దూరం వెళ్ళే కొద్దీ అంటే యానాం కి మన ఊరుకి మధ్యలో అడవి ఉంది."
"హయ్య ! అడివా? exciting !!"
"లేదమ్మా , ఇక్కడ అడివి  చాలా  ప్రమాదం, జంతువులు బానే ఉంటాయి! ఎలుగు బంటులు, నక్కలు, చిరుతలు, ఒకటో రెండో పులులు కూడా ఉన్నాయి అంటుంటారు"
"అవునే బాబు, ఇంక పాముల సంగతి సరే సరి! మా ఊర్లోకే చాలా వస్తాయి"
 అని పూర్తి చేసింది.
దూరంగా ఏదో ఆలయ గోపురం లా అనిపించింది... వెంటనే  "అది ఏంటి?" అని అడిగాను.
"అదా? శివాలయం. చాలా పాతది. ఒక 1000 సంవత్సరాల క్రితం గుడి. చాలా బాగుంటుంది. అసల ప్రతి కార్తిక పౌర్ణమికి ఆలయ గోపురం మీద నుంచి చందమామని చూస్తే, చాలా మంచిదంట! అక్కడే బయట, కోనేరు దగ్గర ఇంకో  పెద్ద శివలింగం ఉంటుంది, చీకట్లో కూడా చాలా తేజస్సు తో ఉంటుంది తెలుసా? కటిక అమావాస్య రోజున చూసినా, నల్ల రాతి తో చేసిన శివలింగమే అయినా ఏ దీపం లేకుండా  శివలింగం బాగా కనిపిస్తుంది."
"అవునా? ఎందుకలా? ఏదన్న ప్రత్యేకమైన రాయి తో చేసిందా?"
"ప్రత్యేకత రాయి లో కాదమ్మా, ఆ రాయిని దేవుని కింద మలచిన ఆయనలో ఉంది. ఆయనతో పాటు ఈ రోజు వరకు అదే గుడిలో సేవలు చేస్తున్న వాళ్ళ వంశం లో ఉంది. మా ఊరి లో ఉంది."
"మీరన్నది నిజమే అంకుల్  మనలో ప్రత్యేకత లేకుంటే దేవుని లోని ప్రత్యేకతను ఎలా గుర్తించగలం?"
అనుకుంటూ  ఉండగానే  ఇల్లు వచ్చేసింది.
"ఈ మధ్యనే నేను 10th  క్లాసు లో ఉన్నప్పుడు, మా పాత ఇల్లు  పడగొట్టి కట్టారు ఇది. ఎంతైనా  ఆ పాత ఇల్లే ఇష్టం నాకు. మా తాతగారు పోయాక కట్టారు నాన్న లేదంటే ఆయన అసల ఒప్పుకునే వారు కాదు". అంటూ కారు లోంచి దింగింది రేణు.
లోపల నుంచి రేణు  వాళ్ళ అమ్మ పళ్ళెం లో యెర్ర నీళ్ళు పట్టుకొని వచ్చి, గుమ్మం లోనే నన్నూ, రేణుని  నుంచో పెట్టి  దిష్టి తీసేశారు. రేణుకి చాలా చాలా  చిన్న తమ్ముడు  ఉన్నాడు. వాడు  5th  క్లాసు చదువుతున్నాడు అంట, అస్సలు మాట్లాడాడు చాలా  చాలా  సిగ్గు పడిపోయాడు, నన్ను చూసి, కొత్త మనిషిని కదా!
ఆ  రోజంతా, ఎంతో సందడి గా మా కాలేజీ కబుర్లు రేణు  వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్తూ  గడిపాము. ఆంటీ చేతి వంట, నాకు ఎప్పుడు తెలియని పల్లెటూరి వాతావరణం నాకు చాలా  నచ్చేశాయి. రేణు  తమ్ముడు సిగ్గుపడటం మాని చక్కగా చిరునవ్వు నవ్వే వరకు వచ్చాడు సాయంత్రానికి. ఆరు బయట పడుకోవాలి  అని అనిపించింది నాకు కానీ, పాములు ఎక్కువ తిరుగుతుంటాయి, కార్తిక మాసం చలి లో అది అంత మంచిది కాదు అని అంకుల్ అనటం తో మారు మాట్లాడకుండా ఇంట్లోనే పడుకున్నాం. ప్రయాణం వల్ల  అలిసి  పోయాం ఏమో, ఇద్దరం పడుకున్న వెంటనే నిద్రపోయాము.

                                                              ****
ఎవరో నన్ను తరుముతున్నారు, చీకటి ... వెన్నెల వల్ల  ఉండే  కాంతి పరిగెడుతున్నాను...  ఎక్కడికో  దూరం గా  పరిగెడుతున్నాను... ఇంత లోపల ఏదో తగిలి కింద పడిపోతున్నాను..... ఎక్కడ పడుతున్నాను? చీకటి ఏమి  కనిపించటం లేదు.. అనుకుంటూనే కింద పడిపోయాను...  ఉలిక్కి పడి లేచాను ... ఒళ్ళంతా  చెమటలు పట్టాయి.. నా పక్కన రేణు నోరు తెరుచుకొని మరీ నిద్ర పోతోంది. నవ్వు వచ్చింది. ఇంతకూ  నాకు ఇంత భయం కలిగించిన కల ఎంటబ్బా అని ఆలోచించాను, నాకు ఏమి గుర్తు రాలేదు. నాకు అంతక ముందు ఎన్నడూ  కల వచ్చిన గుర్తు కూడా లేదు, ఇదే మొదటి సారి నేను ఉలిక్కి పడి  లేవటం అప్పుడే తెల్ల వారు ఝామున 5:30 అవ్వటం తో ఇంక పడుకున్నా  నిద్ర పట్టదని లేచాను.  పొద్దున్నే  ఇంటి పెరటి లో ఆంటీ పూజ చేస్తున్నారు, రేణు  వాళ్ళ మావయ్య పొలానికి అనుకుంట బయలుదేరుతున్నారు. ఆయన పాపం  వినలేరు, మాట్లాడలేరు  అందుకే ఆయనకు కనిపించే ల సెల్యూట్  చేశాను "గుడ్ మార్నింగ్" అన్నట్టు, ఆయనా అందంగా, హుందాగా ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆరు అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, అందమైన నవ్వు ఇన్ని ఉన్నా ఆయనకు ఉన్న  వినికిడి లోపం వల్ల ఆయనకు పెళ్లి కాలేదు, రేణు  వాళ్ళతోనే ఉంటారు.

                                                              ****

"ఆంటీ మీ దగ్గర ఉన్న  ఈ నాలుగు రోజుల్లోనే  నేను  బాగా ఒళ్ళు చేసేలా ఉన్నాను!"
"నువ్వు మరీను, ఈ మాత్రానికే ! ఇప్పుడు భోజనాల తరువాత ఊరు చూసి రండి"
"సరే. అమ్మా , ఈ రోజు కార్తిక పౌర్ణమి కదా, శివాలయం కి వెళ్లి వద్దామే  సాయంత్రం, యశు కూడా చూసినట్టు  ఉంటుంది "
"అయ్యో! సాయంత్రం నేను నాన్న గారు యానం లో పెళ్ళికి వెళ్తున్నాం, పొద్దున్నకి అంతా వచ్చేస్తాం, మీరు మావయ్యని  తీసుకొని వెళ్లి రండి.కాకపోతే త్వరగా వచ్చేయండి. వచ్చే దారి అంతా అడవి కదా, ఎక్కువ రాత్రి వేళ తిరిగి రావటం అంత మంచిది కాదు!"
"అబ్బా ! నాకు తెలియదా అమ్మా?అయినా  మావయ్య ఉంటాడు గా మాతోటి"
"సరే  లేవే  కనీసం జాగర్త కూడా చెప్ప కూడదా?"

                                                              ****
మాములు అప్పుడు గుర్తు రాదు కానీ, గుడి అనగానే లంగా వోణి  వేసుకోవాలి అనిపిస్తుంది, నేను రేణు  తయారు అయ్యాం! చక్కగా ముచ్చటగా. ఆరింటికి బయలుదేరాం, ఏడింటికి కి అంతా  తిరిగి వచ్చేద్దాం అని మాతో పాటు ఆంటీ వాళ్ళు బయలుదేరి యానం వెళ్లారు. వెళ్ళే ముందు రేణు  తమ్ముడు మాత్రం వెనక్కి  వచ్చి నన్ను,రేణు  ని ముద్దు పెట్టుకొని "జాగర్త అక్క" అని చెప్పి వెళ్ళాడు, వాడు అల చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, కానీ  వాడి చిట్టి చిట్టి చేతుల్ని ముద్దు పెట్టుకోకుండా ఉండలేక పోయాను.

                                                            ****

నేను కూర్చున్న చెట్టు కింద ఏదో అలికిడి అయ్యినట్టుగా ఉంది. గుండె దడ దడ లాడింది. కింద నుండి ఎవరైనా పైకి చూస్తే కనిపించకుండా గుబురుగా ఉన్న కొమ్మ పై కూర్చున్నా, నాకే తెలియకుండా చలికో , భయానికో  నా శరీరం వణక   సాగింది. కంట్లోంచి నాతో సంబంధం లేకుండా నీళ్ళు  రా సాగాయి. బుజ్జి గాడి చేతిని ముద్దు పెట్టుకుంది ఈ రోజు సాయంత్రమేనా? ఎన్నో సంవత్సరాలు , ఎన్నో యుగాలు గడచినట్టుగా ఉంది.
నేను, రేణు , మావయ్య  కలిసి గుడికి వచ్చాం.  ఎంతో  అందమైన గుడి, కట్టి వెయ్యి సంవత్సరాలు అయినా, ఏ  మాత్రం చెక్కు చెదరలేదు. పాత  గుడి అని తెలుస్తోంది, అందరూ  నడచి, నడచి ఉండటం  చేత బండలు నునుపు తేలాయి. దీపాల కాంతి తప్ప లైట్స్ ఏమి లేని ఆలయం సహజమైన శోభతో వెలిగిపోతోంది, ఆలయం ముందు ఉన్న కోనేరు అందులోని కలువ పువ్వులు , కోనేరు వద్దనున్న శివలింగం  అబ్బా! ఎవ్వరన్న ఇలాంటి ఒక అందమైన దృశ్యం చూడకుండా చనిపోతే ఆ జీవితం వ్యర్ధం అన్నట్టే .. నాకైతే ఆ గుడి ప్రాంగణం లోనే  కూర్చొని రోజంతా పెన్సిల్ స్కెచ్ వేసుకోవాలి అనిపించింది. మావయ్య కోనేరు దగ్గర ఉన్నారు .. నేను, రేణు కలువ పూలు కోసాము. గుడిలోకి వెళ్ళే అప్పుడు ఆలయ శిఖరం నుంచి చంద్రుణ్ణి  చూసిన ఆ దృశ్యం ఆహా! ఇది ఎలాగైనా స్కెచ్ గీయాలి  గుర్తు పెట్టుకొని అని అనుకున్నాను ..
                                                           ****

గుడి లోపల ఒక చిన్న నంది విగ్రహం ఉంది. గర్బః గుడి లో ఒక శివలింగం ఉంది. అంతా  దీపపు కాంతి లోనే కనిపిస్తోంది..  ఎంతో అందంగా ఉంది, పూలు పూజారికి ఇస్తాము  ఏమో అనుకున్నా, కానీ  గుడి లోంచి ఒక అందమైన అమ్మాయి , సుమారు నా వయసు అంత ఉండే  అమ్మాయి వచ్చి , పూలు తీసుకొనింది.
"ఎలా ఉన్నావ్ రేణు ?" అని అడిగింది
"ఆరుద్ర! నేను బాగున్నాను .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
"బాగున్నాను . ఈమె నీ స్నేహితురాలా ?"
"అవును ! నా  స్నేహితురాలు యశస్విని ..  యశు తిను ఆరుద్ర , ఈ గుడి అర్చకుల కూతురు , రోజు మాములుగా తనే ఉంటుంది ఇక్కడ , తనకు కుదరనప్పుడు, వాళ్ళ నాన్న వుంటారు " . నేను  ఆరుద్ర వైపు చూసి చిన్నగా నవ్వాను, తను కూడా తిరిగి ఒక చిరునవ్వు  విసిరి  మా నక్షత్రాలు అడిగింది.. నేను కొంచెం ఆశ్చర్యపోయాను... మాములుగా అయితే, గోత్రాలు కదా అడగాలి అని .. నేను ఆరుద్ర నక్షత్రం అని చెప్పను, రేణు దీ  అదే నక్షత్రం, ఇద్దరి జన్మ ఘడియలు అడిగింది చెప్పాము ..
అప్పుడు అంత వరకూ ప్రశాంతంగా అందంగా ఉన్నతన  కళ్ళలో ఏదో తెలియని ఒక ఆనందం... అది మాములు మనుషులు పడే ఆనందం లా అనిపించలేదు. ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్నది  దొరికితే కలిగే ఆనందం లా అనిపించింది.. ఏమిటో అర్ధం కాక  తననే చూస్తున్న నేను కొంచెం ఆశ్చర్య పోయాను. అప్పటి వరకు, ఆ గది పైకప్పు లా ఉన్న దగ్గర ఇప్పుడో చిన్న సొరుగు లా కనిపించింది అందులోంచి ఒక పెద్ద గంట బయటకు వచ్చింది.. ఈ అమ్మాయి ఆ గంటను మూడు సార్లు కొట్టింది, అదే గంట నుంచి ఒక పెద్ద కత్తి  ని తీసి రేణు  మీదకు విసిరింది, అంతా  రెప్ప పాటు లో జరిగింది.. రేణు  చేతి కి కత్తి  తగిలి రక్తం రా సాగింది, ఆరుద్ర కళ్ళలో అదే క్రూరం తో  రేణు  వైపుకి రా సాగింది నేను ఆమెను నెట్టేసి, రేణు  రెండో చెయ్యి పట్టుకొని,బయటకు  లాగి గుడి తలుపులు ముయ్యబోయాను... పెద్దవి కావటం తో అవి మూసుకోటానికి చాలా సమయం పట్టింది.