నేను చిన్నప్పుడు అంటే నాకు ఒక ఏడూ , ఎనిమిది వయసు లో చిత్రలహరి దూరదర్శన్ లో ప్రతి శుక్రవారం వచ్చేది . రోజూ లోపలకి పోయి హోమ్ వర్క్ చేసుకోమనే మా అమ్మ, శుక్రవారం మాత్రం టీవీ ముందర, చిత్రలహరి కోసం కూర్చోనిచ్చేది. నేనూ, మా తమ్ముడు హోమ్ వర్క్ ఉంటే, నేల మీద బోర్లా పడుకొని మరీ హోమ్ వర్క్ చేసుకుంటూ పాటలు వినే వాళ్ళం. మా అమ్మ మిషన్ కుట్టటం ఆపేసి, చిత్రలహరి వచ్చే టైం కి, ఫాల్స్ కుట్టేది, లేదా తను కుట్టేసిన బ్లౌస్స్ కి హెమ్మింగ్ చేసుకునేది, సౌండ్ రాకూడదు ( పాటలు వినాలి కదా!) అలానే పని ఆగకూడదు ( మల్టీ టాస్కింగ్ అన్న మాట). మా నాన్నకి శుక్రవారం శెలవు. మాములుగా పాపం పేపర్ ప్రింటింగ్ కాబట్టి రోజూ నైట్ డ్యూటీ చేసే నాన్న , శుక్రవారం మాత్రం, హాయిగా బజారు లో షికారు చేసి వచ్చి, చిత్రలహరి వచ్చే టైం కి, మిరపకాయ బజ్జీలు , అరటికాయ బజీలు తెచ్చే వారు. నాకు అరటికాయ బజ్జీ నుంచి మిరపకాయ బజ్జీ కి 8th క్లాస్ లో ప్రమోషన్ వచ్చింది. మా తమ్ముడు చిన్నవాడు అవ్వటం వల్ల వాడికి ఇప్పటికీ ఆ ప్రమోషన్ రాలేదు ( మొన్న US నుంచి వచ్చినప్పుడు ప్రమోషన్ పొందుదాం అని చూశాడు కానీ చాలా ఇబ్బంది పడ్డాడు తరువాత :) )
మన అందరికీ ఒక గర్వం ఉంటుంది, మంచి అలవాట్లు అయితే నేనే సొంతగా నేర్చుకున్నాను అని. సొంతగా నేర్చుకోటానికి అయినా ఎదో ఒక చోట మనకు ఆసక్తి అనే “భీజం” పడకుంటే ఏమీ చెయ్యలేం కదా... మేము చిత్రాలహరి వింటూ హోమ్ వర్క్ చేస్తున్న ఒక శుక్రవారం , ఈ పాట వినిపించింది... "సా గా మా పా నీ సా " నేను తల పైకి ఎత్తి టీవీ వైపు చూశాను, ఎవరో ఒక ఆవిడ హార్మొనీ వాయిస్తుంది, ఆమె ముందు ఒక అమ్మాయి "నాకు ఇష్టం లేదు మొర్రో!" అన్నట్టు చూస్తుంది, నేను తల దించుకొని రాయటం మొదలు పెట్టాను.. పాట సాగుతూనే ఉంది.. చివరి లో ఒక లైన్ వచ్చింది .. " నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా, ఆ కట్టుబడి తరించేను పట్టు పురుగు జన్మ" అని, అది విని మా అమ్మ "వాహ్" అంది. నేను ఠక్కున తల పైకి ఎత్తి చూసాను .. సాగర తీరాన, సూర్యాస్తమయం లో ఒక అమ్మాయి, అబ్బాయి కూర్చొని ఉన్నారు .. " నా పుత్తడి బొమ్మ" అంటూ పాట ముగిసింది. నేను తల తిప్పి మా అమ్మ వైపు చూసాను. మా అమ్మ నా చిన్న గుండెలో మొదలైన ఎన్నో ప్రశ్నల్ని పట్టించుకోకుండా హెమ్మింగ్ వర్క్ చేసుకుంటూ, మరో పాట విన సాగింది. అప్పటి నుంచి నేను పాటల్లో ఏమి మాటలున్నయ్యో వినటానికి చూసేదానిని. అసల అప్పటి నుంచే పాటలు ఇష్టం ఏమో అనిపిస్తుంది ఒక్కో సారి.
అప్పటి వరకు అమ్మ అన్నా , నాన్న అన్నా నాకు ఒక abstraction, ఇప్పటికీ చాలా మందికి అంతే అనిపిస్తుంది. అమ్మ అంటే ఇష్టం అంటే " నన్ను కన్నది , నన్ను బాగా చూసుకున్నది , నాకు ముద్దులు పెట్టింది , నాకు ముద్దలు పెటింది " అనే తప్పితే , ఒక వ్యక్తిగా తాను ఏంటి ? తనకున్న ఇష్టాలూ , అయిష్టాలు ఏంటి అని పెద్దగా చాలామందికి తోచదు. అమ్మలు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి నాకు ఆ రంగు ఇష్టం , ఈ కవిత ఇష్టం అని చెప్పరు పాపం. మా అమ్మ కూడా ఎప్పుడూ తనకు ఇది ఇష్టం, అది ఇష్టం లేదు అని ఎప్పుడూ చేప్పలేదు. అలాంటి అమ్మ "వాహ్" అన్న పాట నాకు గుర్తుండిపోయింది. మా అమ్మ ఎవ్వరికి తెలియకుండా ఎన్నో కంచెలు మధ్యన దాచేసిన తన మనసును చూసేందుకు నేను ఒక కంచె ఆ రోజు దాటగలిగాను.
ఇది జరిగిన కొన్నాళ్ళకే , మా ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్న సమయం లో ప్యూన్ వచ్చి , నా పేరు పిలిచి, బ్యాగ్ తీసుకొని తనతో రమ్మన్నాడు. టీచర్ కి నాకు వినపడకుండా ఎదో చెప్పాడు. బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చిన నేను "ఏంటి శీనూ , మంచి కథ చెప్తుంటే .. " ( ట్రోజన్ వార్ చెప్తోంది మా ఇంగ్లీష్ టీచర్ )
"ష్ ! ఆఫీస్ లో పిలుచుకొని రమ్మన్నారు .. విసిగించకు " అన్నాడు. నేను ఆఫీస్ కి వెళ్ళేసరికి మా తమ్ముడు ఉన్నాడు. అక్కడ ఉన్న క్లర్క్ , " నువ్వూ మీ తమ్ముడూ ఇంటికి వెళ్ళండి అంది." నాకు కంగారు పుట్టింది.. అమ్మ వాళ్ళు ఫీజు కట్టలేదా ? మొన్ననే డబ్బులు తక్కువ అనుకుంటున్నారు ... కానీ డబ్బులు లేకపోయినా, ఫీజు ముందే కట్టేస్తారే. ఫీజు .. బుక్స్ మాత్రం వదలరే అనుకుంటూ అక్కడే నుంచున్నా .. "తొందరగా !" అని అంది ఆమె " ఎందుకు మేడం పంపించేస్తున్నారు? " అని అడిగా .. " అదిగో మీ మమ్మీ వచ్చారు " అంది. నేను వెనక్కి తిరిగి చూసా .. మా అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.. తను గబగబా లోపలి వచ్చి, మా తమ్ముడిని ఎత్తుకొని , నా చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది.
ఇంటికి వెళ్ళాక , మంచం మీద అంతా బట్టలు, సూట్ కేసు సర్ది ఉంది. మా తమ్ముడి యూనిఫామ్ విప్పేసి, వాడికి స్నానం చేయించటానికి తీసుకెళ్లింది. ఎప్పుడూ లేనిది , మా నాన్న పగలు లేచే ఉన్నారు. నాకు కంగారు పుట్టుకొచ్చింది, ఇలా ఎప్పుడూ జరగలేదు.. నేను మా నాన్న దగ్గరకి వెళ్ళి , " ఏంటి నాన్న , ఏమయ్యింది ?" అంటే " ఏమి లేదు పప్పులూ .. నువ్వు , తమ్ముడూ , అమ్మా ఊరెళుతున్నారు" అన్నారు.. అది సమ్మర్ కాదు , దసరా కాదు , సంక్రాతి కాదు ... మరి ఇప్పుడు ఊరేంటో నాకు అర్థం కాలేదు .."ఎందుకు ?" అని నేను అడిగి మా నాన్న సమాధానం చెప్పే లోపలే మా అమ్మ, తమ్ముడి స్నానం అయ్యి బయటకు వచ్చి, "పప్పీ , రా " అంది . "నేనే చేస్తా " అని నేను అన్నాను.. "విసిగించకే రా !" అని అంది. నేను లోపాలకి వెళ్ళి మా అమ్మ నాకు స్నానం చేయిస్తోందే కానీ పాపం ఏడుపు ఆపుకుంటోంది. ఇది కూడా నాకు కొత్తనే , అమ్మ అరవటం తెలుసు , కొట్టటం తెలుసు , చిరాకు పడటం తెలుసు .. ముద్దాడటం తెలుసు .. కానీ అమ్మ ఏడవటం తెలియదు నాకు.. " ఏమైంది అమ్మ ? ఎందుకు ఊరు వెళ్తున్నాం ? నాన్న తో గొడవా ?" అని అడిగా .. అంత ఏడుపులోనూ తను చిన్నగా, దీనంగా నవ్వి.. "నాన్నతో గొడవ అయితే ఊరు వెళ్లాలా ? " అని అడిగింది.. వెళ్లాలో లేదో నాకు తెలియదు ... అందుకే "ఏమో " అన్నాను. అప్పుడు తల అడ్డంగా ఊపి .. వచ్చే కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తూ, ఒణుకుతున్న పెదాలతో .. " పెద్దమ్మ తెలుసుగా ? రాణీ పెద్దమ్మ .. తను చనిపోయింది , ఏలూరు వెళ్తున్నాం " అని అంది. నాకు చనిపోటం అంటే ఏంటో తెలియదు .. తెలిసినా, అప్పటి వరకు నన్ను చావు పలకరించలేదు.. ఇప్పుడు పలకరించింది .. అమ్మా , నాన్న లాగానే చావు కూడా ఒక abstraction నాకు. కానీ అమ్మ బాధపడుతుంటే, తనని మా పెద్దమ్మ పోవటం ఎంత బాధపెడుతోందో చూస్తుంటే... మనకు ఇష్టం అయిన వాళ్ళు బాధ పడుతుంటే, ఆ బాధని ఎలా తగ్గించాలో తెలియని నిస్సహాయత ఎంత దారుణంగా ఉంటుందో నాకు అప్పుడు తెలిసింది. "ఎలా చనిపోయింది అమ్మ ?" అని అడిగాను. ఇది చెప్పటానికి మా అమ్మ ఆలోచించింది.. కానీ ఏమనుకుందో ఏమో నిజమే చెప్పింది " ఫ్యాన్ కి తాడు కట్టుకొని తనంత తానే చనిపోయింది. దానికి ఏమి కష్టం వచ్చిందో" అంటూ మా అమ్మ.. బోరుమంది ..
ఇప్పటికీ మా పెద్దమ్మ ఎందుకు చనిపోయారో నాకు తెలియదు, కానీ ఆమె వెళ్తూ వెళ్తూ నాకు ఒక విషయం నేర్పించారు .. చాలా ఖరీదైన పాఠామే .. అమ్మ అంటే దేవత అనే వారు చాలామంది ఉన్నారు. కానీ తనకూ బాధ ఉంటుంది, తనకూ ఇష్టం ఉంటుంది , తనకూ వ్యక్తిగా ఒక హృదయం ఉంటుంది అని. ఈ రెండు సంఘటనల తరువాత, పెద్దయ్యే కొద్దీ నేను నేర్చుకున్నదీ .. మా అమ్మ లోనూ ఓ అమ్మాయి ఉంది అని.. మా అమ్మ నాకు దేవత కాదు .. తను పట్టుచీర కట్టుకున్నా .. కట్టుకోకున్నా .. తను నా పుత్తడిబొమ్మ అని.
మా అమ్మకి ఇష్టం అయ్యి నాకు ఇష్టం అయ్యేలా చేసిన పాట:
అలలు కల లు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ..
పగలూ రేయి ఒరిసీ మెరిసే సంధ్యా రాగంలో ..
ప్రాణం ప్రాణం కలిసీ మురిసే జీవన రాగంలో ..
అలలు కల లు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ..
నీ చిరునవ్వుల సిరి మువ్వల సవ్వడి వింటే ..
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే ..
నీ కీలుకు మనే కులుకులకే కలికి వెన్నెల చిలికే ..
నీ జడలో గులాబి కని మల్లెల్లు ఎర్రబడి అలిగే ..
నువ్వు పట్టు చీర కడితే .. ఓ పుత్తడి బొమ్మా .. ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ ..
నోట్: I absolutely love this song. It's written by Veturi.
An emotional post!
ReplyDeleteVery well written.
బజ్జీల పార్ట్, టైలరింగ్ మెషిన్ - ముచ్చట గొల్పే చిన్ననాటి జ్ఞాపకాలు.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని పాటలు వారి జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇస్తాయన్నవి ఆత్మీయమైన కధల్లా ఉంటాయి. మీకు ఈ పాట పరిచయమైన కథ, పాటలోని మాటను అమ్మకు ఆపాదించడం - అద్భుతం. Very poetic!!
Keep writing on songs please.