Sunday, October 11, 2020

సత్యం తాత 💖

  నా పేరు బేబీ సరోజ, ముద్దు పేరు పప్పి. ఈ రెండు పేర్లని పట్టుకుని నన్ను చిన్నప్పటి నుంచి, చాలా మంది ఏడిపించేవారు. నేను కూడా బాగానే ఉడుక్కునేదానిని. నా వయసు ఒక పదేళ్ళు ఉండి ఉంటాయి. వేసవి కాలం సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరో గుర్తులేదు కానీ నన్ను బాగా ఉడికించారు. నాకు మాములుగా అయితే ఏడుపు రాదు కానీ అప్పుడు వచ్చింది. నేను మా అమ్మ దగ్గరకి కోపంగా వెళ్ళి "తమ్ముడికేమో కార్తీక్ అని అంత మంచి పేరు పెట్టావ్! నాకేమో పిచ్చి పేరు పెట్టావ్ !" అని అరిచేశాను. మా అమ్మ తాపీగా "నువ్వు పెళ్ళైన మొదటి సంవత్సరం లోనే పుట్టావ్, వాడు నాలుగేళ్లకు పుట్టాడు. నా మాట నెగ్గించుకోటానికి నాకు అంత సమయం పట్టింది" అని నా బుగ్గ గిల్లి నవ్వేసింది. 


         నేను వరండాలో మా తాతమ్మ పక్కనే ఆమె మంచంలో కూర్చొని బుంగ మూతి పెట్టుకొని,  దీర్ఘంగా ఆలోచిస్తున్నా, ఈ పేరు సమస్యని ఎలా పరిష్కరించాలా అని. మా తాత సిగెరెట్  చివరి పఫ్ పీల్చేసి, సిగరేట్ పక్కన పడేసి, హాల్స్ బిళ్ళ వేసుకొని వరండాలోకి వచ్చి, ఇంట్లోకి వెళ్ళబోతూ నన్ను చూసి "పప్పులుగా ! ఏంటి రా అట్టా ఉండా ?"  అని అడిగాడు. "నా పేరు నాకు ఇష్టం లేదు తాత! మార్చేసుకుందాం అనుకుంటున్నా, ఎట్టా మార్చాలా, ఏమని మార్చాలా అని అలోచిత్తన్న"  "ఎందుకూ ? నీ పేరుకే? మీ నాయనమ్మ పేరని మీ కృష్ణం తాత కోరి మరీ పెట్టుకుంటే !" " అందరూ బేబీ అంటే చిన్న పిల్లా ? పప్పీ అంటే కుక్క పిల్లా ?  అని అంటన్నారు తాత 😒" "ఓస్ అదా ! అంటే అననివ్వు , నువ్వు ఇట్టా ఏడుత్తా ఉంటే ఇంకా ఎక్కువ అంటారు" "అదొక్కటే కాదు తాత, పేరు కూడా బాలేదుగా!" " ఆసి పిచ్చ మొహమా ! పేరులో ఏముందే ? పుచ్చలపల్లి సుందరయ్య, ఇదేమన్నా గొప్ప పేరా? మరి ఆయన సైకిల్ మీద అసెంబ్లీకి ఎల్లే వాడు. నేను అప్పట్లో పార్టీలో ఉన్నప్పుడు మన ఊరు కూడా వచ్చాడు. జనం అంతా ఎగబడి చూశారు! ఆళ్ళ సమస్యలు జెప్పుకున్నారు! అది ఆయన పేరు జూసి కాదు, మనిషిని జూసి. మనిషి వల్ల పేరుకి పేరొస్తది.  ఫ్రూటీ తాగుతావా?" అని అనగానే, నా మొహం మతాబులా వెలిగిపోయి, తాత చెయ్యి పట్టుకొని, మా తాతమ్మకి ఒక ముద్దు పెట్టి, బజారుకి వెళ్ళి ఫ్రూటీ తాగాను. 


    చిన్నప్పటి నుంచి తాత అంటే చాలా ఇష్టం. చాకోలెట్లు కొనిస్తాడు అని, ఫ్రూటీ కొనిస్తాడు అని, ఇలా ఎన్నో కారణాలు. అమ్మ వాళ్ళ దగ్గర చెల్లని అల్లరి, తాత దగ్గర చెల్లేది. ఒక రోజు నేను తాత, నెల్లూరులో ఎస్టీడీ బూత్ దగ్గరకు, ఫోన్ చెయ్యాలి అని వెళ్ళాం. ఆ షాప్ అంకుల్ నాకు అంతక ముందు తెలుసు కాబట్టి "ఎవరు పప్పీ ? మీ మావయ్యా ? "అని అడిగారు.  నేను ఫక్కున నవ్వేసి "కాదు అంకుల్ మా తాత" అని చెప్పా. "మీ అమ్మ పోలికలు ఉంటే మీ మావయ్య అనుకున్నా" అన్నారు. తాత ఫోన్ మాట్లాడి బయటకు వచ్చి నాకు, తమ్ముడికి అని చెప్పి రెండు చాకోలెట్లు కొని, నా చెయ్యి పట్టుకొని ఇంటికి నడిచాడు. ఆ వెళ్ళే దారిలో " తాతా ! నీకు ఎన్ని ఇయర్స్ ?" అని అడిగా "ఎందుకు రా ? 49" అని అన్నాడు. నేను నవ్వాపుకుంటూ " ఆ కొట్టు అంకుల్ నువ్వు నా మావయ్య అంటున్నాడు తాత " . చిన్నగా నవ్వుకొని " ఉఁ మరి! ఏవనుకుంటన్నా? నేను ANR కాలేజీ లో PUC చదువుకునే అప్పుడు అందరూ నన్ను జూసి, కాస్తా సాయి తక్కువగానీ  నాయేశ్వరరావులా ఉంటాడు సత్తిం అనేవారు." నేను పెద్దగా నవ్వేసాను. ఇప్పటికీ, ఎప్పటికీ నాకు తాత అంటే గుర్తొచ్చేది, ఆ వీధిలో నేను తన చెయ్యి పట్టుకొని నడవటం, అక్కడక్కడా రాయిని తన్నడం, నేను ANR లాగా ఉండేవాడిని అని తను అన్నప్పుడు తన ముఖం అలా నా హృదయంలో ముద్రించుకుని పోయాయి. అంతకు మించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా, ఇది నా సొంతం. నాకు, తాతకి సొంతం. ఆ నిముషంలో ఎప్పటికీ నేను, తాతే ఉంటాం. ఆ నిముషంలో నేను అత్యంత సంతోషంగా ఉన్నాను, అందుకే అది నాకెప్పటికీ గుర్తుండిపోయింది.


     ఏళ్ళు గడిచే కొద్దీ నాకు తాతకి చిన్నప్పుడు ఉన్నంత మాటలు లేకున్నా, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, చనువుగానే ఉండేదానిని, కాకపోతే ఫోన్ చేసి మాట్లాడటం తక్కువ. నేను ఉద్యోగంలో చేరి, ఒక నిర్ణయం తీసుకోటానికి సతమతమవుతూ ఉన్న సమయంలో ఒకసారి ఎందుకో తాతకి ఫోన్ చేసి " తాతా, ప్రపంచం అంతా ఇది నీకు మంచిది అంటున్నారు, కానీ నీకు అది మంచిది కాదు అనిపిస్తుంది, ఏమి చేస్తావ్? " అని అడిగాను. మా తాత " నాకు ఏది రైట్ అనిపిస్తే అదే చేస్తా " అని అన్నాడు. "సరే తాత " అని పెట్టేసా. అలా ఒక అర నిముషం ఫోన్ కాల్ నాకు జీవితంలో ఎంత ఉపయోగపడిందో చెప్పలేను. తన అన్న ఆ ఒక్క మాటకి నేను ఎప్పటికీ వెల కట్టలేను. 


     మా తాత అంతా మంచే చేశాడు , తప్పులు ఏమీ చెయ్యలేదు అని ఏమీ లేదు. తన జీవితంలో తను పొరపాట్లు చేసినా కానీ తనని తాను ఎప్పుడూ అనుమానించుకోలేదు, చిన్నబుచ్చుకోలేదు, అవమానించుకోలేదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. అందరి జీవితాల్లో ఒక భాగంగా ఉన్నాడు. ముఖ్యంగా తన చివరి  పాతికేళ్లలో, అందరికీ తను ఉన్నాడు అనే ధైర్యం ఉండేది. అలా అని తన అభిప్రాయాలతో ఎవరి జీవితాలని తీర్చిదిద్దెయ్యాలని అనుకోలేదు, ప్రయత్నించలేదు. తన పిల్లలు ఎదిగిన వారు, వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి అనే స్పృహ కలిగి ఉండేవాడు. తన అవసరం ఉంది అని అనిపిస్తే పక్కన మౌనంగా, ఒక కొండంత బలంగా నిలబడేవాడు, లేదు అని అనిపిస్తే, అంతే మర్యాదగా వెళ్ళిపోయేవాడు. అందుకే మా తాత నాకు హీరో. నాలా నేను ఉండటానికి ఆయన ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. He proved to me that you can make mistakes, be human, be very normal  and still be a hero in your own right. 


   తనకు కాన్సర్ అని తెలిసినప్పుడు, ఇంకో రెండు ఏళ్ళు అన్నా ఉంటారేమో అనుకున్నా, ఎందుకంటే తాతకి బాలేదు అనేది కొత్త నాకు. తాతకి ఒంట్లో బాగాలేకపోవడం చాలా తక్కువ. కానీ, చివరి రోజుల్లో, తనతో ఉండగలిగాను, తనకి goodnight kiss పెట్టగలిగాను. తను వెళ్ళిపోయిన రోజు చాలా ఏడ్చాను, నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు తను ఉంటే బాగుండు అనిపించింది, అది అత్యాశలా కూడా అనిపించలేదు. నా మనసుకి శాంతి లేకపోయింది. చాలా రోజుల తరువాత "The Good Place" అనే ఒక సీరీస్ చూస్తుంటే, అందులో ఒక బుద్దిస్ట్ తత్త్వచింతన గురించి చెప్పారు..


 " నువ్వు ఒక సముద్రంలో అలని చూస్తున్నావ్ అనుకో, నువ్వు దానిని చూడగలుగుతావు, దాని పొడవు ఎంత అని చూడగలుగుతావు, దాని మీద సూర్యకాంతి ఎలా నాట్యం చేస్తుందో చూడగలుగుతావు, క్షణం ఆగిన తరువాత అది ఒడ్డుకి చేరి, అల పోయి, నీళ్ళు మిగులుతాయి. కాకపోతే వేరే రూపంలో .. అల అన్నది ఆ నీటికి ఒక రూపు మాత్రమే .. "


"Picture a wave, in the ocean.. you can see it, measure it, the way light refracts when it passes through, it's there , you can see it, you know what it is.. It's a wave. And then it crashes on the shore.. it's gone, but the water is still there.. the wave is just a different way for the water to be, for a little while. The wave returns to the ocean, where it came from, where it's supposed to be.


ఇది చూసిన తరువాత... తను లేరు అనే బాధను వదిలెయ్యగలిగాను.. తను ఇక్కడ ఉన్నందుకు, నా జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండడం నేర్చుకుంటున్నా.. 


 తను వచ్చిన చోటికి తనువెళ్లిపోయారు. తనవి, నావి జ్ఞాపకాలు మోసుకుంటూ..  ఏదో ఒక రోజు నేనూ వెళ్తాను. అందరం వెళతాం.. అల విడిచి...  నీటి రూపంలో...  సముద్రంలోకి .. తిరిగి మనం ఉండవలసిన చోటికి.. మన చోటికి..

No comments:

Post a Comment