ఇల్లు, హాస్టలు తప్ప వేరే ప్రపంచం తెలియని అమృతకి పచ్చదనం నిండిపోయి ఉన్న నగరాన్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఆటోలోంచి తల కొంచెం బయటకి పెట్టి పైకి చూస్తే, ఆకాశం కనపడకుండా కప్పేసిన చెట్ల కొమ్మలతో మొత్తం పచ్చగా ఉంది. తను అంతకుముందు హైదరాబాదుని చూసింది కానీ బెంగళూరు సొగసు వేరు, ఆ అందం వేరు అనుకుంది. మార్పు అంటే సహజంగా ఉండే బెరుకు, భయం ఉన్నాయి కానీ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కన్న కల - ఉద్యోగం, సొంత కాళ్ళ పైన నిలబడడం, రేపు నిజమవుతాయి అనుకుంది. బెంగళూరు నగరం మొత్తం పచ్చని పందిరితో తనని ఆహ్వానించినట్టు అనిపించింది.
తనతో పాటు కాలేజీలో చదివిన వారెవ్వరూ బెంగళూరులో చేరడం లేదని బెంగగా ఉంది. తన టేబుల్ దగ్గర కూర్చున్నవారు ఆంధ్రా నుంచి వచ్చినవారైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే తప్ప తనని పలకరించడం లేదు. ఎవరైనా తెలిసినవారు ఉంటే బాగుండు అనుకుంటుండగా "అమృతా గోగినేని" అని అంత పెద్ద ఆడిటోరియంలో తన పేరు వినగానే ఉలిక్కి పడింది. లేచి నిలబడి ఎక్కడో వెనకాల టేబుల్ నుంచి ముందు పోడియం దాక గబగబా నడిచే సరికి ఇంకో ముగ్గురి పేర్లు చదివేశారు. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి "All the best, welcome aboard" అని అందంగా నవ్వింది HR. అన్ని అగ్రీమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టి, బయటకు వచ్చేసరికి చీకటి పడింది. బయట తన కోసం తన తాతగారు పొద్దున్నుంచి వేచి ఉండడం చూసి తనకు ఏదో తెలియని దిగులుగా అనిపించింది. పెద్దగా ఏమీ మాట్లాడకుండానే హోటల్ వైపు నడవసాగారు. తాతయ్య అడిగాడు.
“ ఏరా ఎలా జరిగింది?”
“ బాగుంది తాత, కానీ చాలా భయం వేసింది, ఎవ్వరూ తెలియదు, నాకు ఏడుపు వచ్చేసింది”
“ ఎందుకురా భయం? రేపు తెలుగు వాళ్ళు ఉన్న హాస్టలు చూద్దాంలే, నిన్ను చేర్పించి నేను ఊరెళతా”
తాత వెళ్ళిపోతారు అన్న ఆలోచనతో ఇంకా బెంగగా అనిపించింది. పెద్ద ఊరు, ఊరినిండా హడావుడిగా తిరుగుతూ జనం, అయినా తనకు ఒంటరిగా అనిపించింది.
తాత పీజీ (PG) చూసారు, తన ట్రైనింగ్ సెంటరుకి దగ్గరే, నడిచి వెళ్ళే దూరమే. పీజీ వారు కూడా తెలుగు వారే. తనతో పాటు సోమవారం నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టేవారు చాలా మందే ఉన్నారు. కాకపోతే తన స్ట్రీమ్ వారు లేరు, పైగా అందరూ హైదరాబాదులో పుట్టి పెరిగి చదువుకున్నవారు. తన రూంమేట్స్ ఏమో ముంబై వారు. తనకు సహజంగానే జంకు ఎక్కువ, అది కాస్తా ఆత్మన్యూనతగా మారి “నేను ఒక్కదానినే ఎర్ర బస్ అన్నమాట“ అనుకుంది. కొత్త ప్రపంచంలోకి వెళుతున్నప్పుడు పాత నమ్మకాలు ఇక్కడ పనికిరావు అని తెలిసినప్పుడు వచ్చే దుఃఖం కలిగింది అమృతకు. అమ్మకు ఫోన్ చేసింది, ఫోన్ మ్రోగుతుంది , మనసులో “అమ్మూ! అమ్మ ఫోన్ ఎత్తగానే ఏడవకే, కంగారు పడుతుంది!“ అనుకుంది.
అవతలివాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి “అమ్మూ!” అనగానే
“అమ్మా...“ గొంతులో దుఃఖం ఆగలేదు.
“ఏం నాన్నా? ఏడుస్తున్నావా?”
“భయంగా ఉందమ్మా! వచ్చేస్తాను... హైదరాబదులో ఏదో ఒక చిన్న జాబ్ చూసుకుంటా”
“ ఊరుకో నాన్నా! ఈ జాబ్ పిలవడానికి లేట్ అయితేనే ఎంత కంగారు పడ్డావ్? వచ్చిన అవకాశం వదిలేస్తానంటావేంటి?“
“ఇక్కడ ఇలా ఉంటుందని అనుకోలేదమ్మా! ఎవ్వరూ తెలియదు”
“నువ్వు ఇంజనీరింగ్ హాస్టల్ చేరినప్పుడు నేను భయపడితే నువ్వే కదా హాస్టల్ లో ఉంటాను అని ధైర్యం చెప్పావు? ఇప్పుడు ఇలా భయపడితే ఎలా? నేను ఎలా ఉండగలను ఇక్కడ?“
“అప్పుడు నాకు తెలిసిన వారు ఉన్నారు”
“ఇప్పుడు తెలుసుకునే వారు ఉంటారు. ఒక పని చేద్దాం వెళ్ళినందుకు ఒక్క నెల పని చెయ్యి, జీతం తీసుకున్నాక వచ్చేద్దూగాని! ఏం అంటావు? “
“ఊ! సరే”
“భోజనం చేసావా?”
“లేదు! కిందకి వెళ్ళి తినాలి”
“సరే తిను పో, రేపు ఫోన్ చేస్తా! ఏడవకు నాన్నా!”
“లేదు కళ్ళు తుడిచేసుకున్నా”
“సరే ఉంటా”
“ bye”
ఫోన్ పెట్టేసి మంచం మీద అలానే కూర్చొని మౌనంగా జారుతున్న కన్నీళ్ళని తుడుచుకోబోతుంటే బయట వేరే రూములో నుంచి తెలుగు పాట వినపడసాగింది. అప్పటివరకూ ఏదో శబ్దంలా అనిపించినా ఎందుకో అప్పుడే పాట సరిగ్గా వినపడసాగింది
“అమ్మ కొంగులో చంటి పాపలా మబ్బుచాటునే ఉంటే ఎలా? పడిపోతానని పసి పాదాలకీ పరుగే నేర్పవా? ...”
లేచి కళ్ళు తుడుచుకుని, పాట వినిపిస్తున్న గదిలోకి వెళ్ళింది. అక్కడ ఒక అమ్మాయి బ్యాగులోని బట్టలు తీసి సర్దుకుంటోంది. అమృతని చూసి “హలో! Come in. I am ramya. కొంచెం lonelyగా అనిపించి పాటలు పైకి పెట్టా. సౌండ్ తగ్గించనా?“
“లేదు లేదు. బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ పాట. నా పేరు అమృత”
“భోజనం చేసారా?“
“లేదు తినబుద్ది కాలేదు”
“నాకు కూడా! కానీ రోజూ మానలేము కదా! ఈ రోజు వెళ్తే రేపు breakfastకి అలవాటు అవుతుంది. కలిసెళ్దామా?” మూడు రోజుల తరువాత అమృతకి మొదటిసారి పెదవులు విచ్చుకున్నాయి. తను అనుకున్నంత ఒంటరి కాదేమో అనిపించింది. “నా ప్లేట్ తెచ్చుకుంటా ఉండండి” అని అంది.
****
పొద్దున్నే లేచి రెడీ అయ్యింది. రమ్యతో కలిసి క్రిందకి వెళ్ళి టిఫిన్ చేసింది. వెళ్ళే ముందు తన మరాఠీ రూంమేట్స్ ని పరిచయం చేసుకుంది. వాళ్ళతో కలవడం పెద్ద కష్టం కాదనిపించింది. కానీ ఆఫీసుకి వెళ్ళాక తెలిసింది తనది, రమ్యది వేర్వేరు స్ట్రీములని. ట్రైనింగ్ రూంకి వెళ్ళే సరికి మళ్ళీ ఏదో బెరుకు. తన ప్రక్కన శిల్ప అనే కన్నడ అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి నవ్వు చాలా స్వచ్ఛంగా అనిపించి, ‘I can do this’ అనుకొని పలకరించింది. తరువాత తన సిస్టం ఓపెన్ చేసింది. కంపెనీ వారి మెసంజరులో తనకన్నా ఒక నెల ముందు గురుగ్రామ్ లో చేరిన తన క్లాస్ మేట్ అశోక్ పేరు వెతికింది. పచ్చరంగులో ఉంది. అతను తన సిస్టమ్ ముందు ఉన్నాడు అని తెలిసి “హాయ్ అశోక్!” అని పంపించింది.
“ ఓయ్! జాయిన్ అయ్యిపోయీవా? నేనే కాసేపటిలో పలకరిద్దాం అనుకున్నా!” అని జవాబిచ్చాడు అశోక్.
“అంతా కొత్తగా ఉంది”
“ఓ! BRB”
“అంటే?”
సమాధానం లేదు. రెండు నిమిషాల తరువాత “Be Right Back అని అర్ధం”
“అబ్బో! నెల రోజుల్లో బోలెడు నేర్చుకున్నావుగా?”
“హహ ఏదో”
“చాలా కొత్తగా ఉంది అశోక్! మన వాళ్ళు ఎవ్వరన్నా ఉంటే బాగుండేది”
“ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలంటే కష్టం కదా”
“భయనేసి ఇంటికి వెళ్ళిపోదామనుకున్నా”
“పడిపోతాననీ పసి పాదాలకు పరుగే నేర్పవా?”
“హేయ్!! నువ్వు పాటలు కూడా నేర్చుకున్నావా ఈ నెలలో?”
“ఆ! చెప్పు”
“నేనేమడుగుతున్నా? నువ్వు చెప్పు అంటావేంటి?”
“ ఏమి అడిగావు? ఉండు! ఓరినీ... నేను బయటకు వెళ్ళా BRB అని... నా పక్కన ఉంటాడులే సుధీర్ అని వాడు మాట్లాడాడు నీతో”
అమృతకి చిర్రెత్తుకొచ్చింది.
“వచ్చిన నెలలోనే BRBలు నేర్చుకున్నావు కానీ సిస్టమ్ లాక్ చెయ్యడం నేర్చుకోలేదా?”
“నీ గోల ఏంటే బాబు? ఉండు మా ట్రైనర్ వచ్చారు మళ్ళీ మాట్లాడతా” అని చాటింగ్ ఆపేశాడు. అమృతకి మళ్ళీ చిర్రేత్తుకొచ్చింది. ‘వీడు బయటకు పోవడమేమిటి, వాడెవడో మాట్లాడడమేమిటి?’ అనుకుంది. ఇంతలో తన ట్రైనర్ రావడంతో మొదటి రోజు ప్రారంభమైంది.
రెండో రోజు సిస్టమ్ ముందు కూర్చోగానే అశోక్ పింగ్ చేశాడు.. “వామ్మో! ఏంటి నువ్వే? నీ అంత నువ్వే పలకరించావా?“
“నేను మరీ అంత దుర్మార్గుడిని కాదు.. నిన్న భయమేస్తుందని అన్నావుగా ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుదామని...”
“నిన్న మీ friend ఎవరో కానీ మా గురూజీ (సీతా రామ శాస్త్రి గారు ) పాటలో లైన్ చెప్పాడు. భలే అనిపించింది నాకు!”
“సుధీర్ అని మంచి వాడే...”
“పాటలు వింటాడులా ఉంది!”
“బానే పాడతాడు కూడా”
“ఓ...“
“వాడినే direct గా పింగ్ చెయ్యమననా?”
“పిచ్చా నీకు ఏమన్నా? ఏదో పాటలో లైన్ చెప్తే అదీ పక్క వాళ్ళ సిస్టమ్ లోంచి... నేను మాటాడాలా? No way”
“ఉత్తినే అడిగాలే“
“ఎలా ఉంది నీ ట్రైనింగ్?”
“అశోక్ వచ్చాడు... తనతో మాట్లాడు” అమృత అదేదో టీవీ ad లో చెప్పినట్టు అవాక్కయ్యింది. వెంటనే తన ఫోన్ తీసుకొని ట్రైనింగ్ రూం నుంచి బయటకు వెళ్ళి, అశోక్ కి ఫోన్ చేసి “హలో అశోక్? నువ్వేనా? లేదా నీ
ఫోన్ కూడా అమ్మేశావా?“
“ఏంటే రాక్షసి? అరుస్తావే? నీ గొంతుకి ఫోన్ అక్కర్లేదు తెలుసా?”
“వాడెవడు అసల? నీ ఛాట్ నుంచి మాటాడతాడు? సిస్టమ్ లాక్ చెయ్యడం రాదా నీకు. సోది చెప్పమంటే ఎంతైనా చెప్తావు. ఎంత చిరాకుగా ఉంటుంది ఇలా చేస్తే? ఇంకోసారి ఇలా జరిగిందో, నీకు ఆడికి చెరొక దవడ పగలకపోతే నా పేరు వీర వెంకట అమృత వర్షిణి గోగినేనే కాదు"
"అబ్బ! ఊరి దానివి అనిపించావే బాబు పేరు చూడు సౌమ్యంగా అమృత వర్షిణి, నోరు తెరిస్తే రాక్షసి. అయినా నువ్వు గింజుకునే అంత ఎదవ ఏం కాదు ఆడు. నేను చెప్తాలే ఆ శీలి రాకాసితో ఏం పని రా నీకు, అది నోరు తెరిస్తే బూతులే వస్తాయి దానికి అని"
"చెప్పాడికి మగాడైతే డైరెక్ట్ గా మాటాడమని, తెలుస్తుంది నేను ఏంటి అని, ( కొంచెం గొంతు తగ్గించి ) సరే మా ట్రైనర్ వస్తున్నారు bye" అని ఫోన్ పెట్టేసి లోపలకి గబగబా వెళ్ళి కూర్చుంది. ఇంతలోనే ఎవరో కొత్త ఐడీ నుంచి పింగ్ చేశారు. "హలో అండీ! మగాడైతే పింగ్ చెయ్యమని అశోక్ చెవిలో చెప్పింది నా వరకు వినిపించింది. చేయకుంటే మీరు బాధపడతారేమో అని తప్పక పింగ్ చెయ్యాల్సి వచ్చింది"
అమృతకి ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఒక ప్రక్క ఈ అబ్బాయి మీద పీకల దాకా కోపంగా ఉంది. ఇంకో ప్రక్క చిన్నగా నవ్వు కూడా వస్తోంది. ఆ చాట్ విండో మూసేసి ట్రైనర్ lesson మొదలు పెడితే వినసాగింది.
మూడో రోజు సిస్టమ్ ముందుకి రాగానే ఆ సుధీర్ పింగ్ కనబడింది.
"హలో అండీ, అంటే నిన్న మీరు ఎదో కండిషన్ చెప్పి డైరెక్ట్ గా పింగ్ చెయ్యమన్నారు కదా, అది ఎన్ని రోజులకు వర్తిస్తుందో తెలియక ఈ రోజు కూడా పింగ్ చేశాను ఏం అనుకోకండే!"
అది చూసి చిన్నగా నవ్వుకొని వీడు మహా ముదురులా ఉన్నాడు అనుకొని చాట్ విండో క్లోజ్ చేసింది.
*****
అలా ప్రతి రోజూ ఎదో ఒకటి పింగ్ చేసేవాడు. అమృత చాట్ చదివి విండో క్లోజ్ చేసేది. ఒక రోజు Facebookలో రిక్వెస్ట్ పంపించాడు, అది డిక్లైన్ చేసింది. తరువాతి రోజు అశోక్ పింగ్ చేశాడు "హలో! ఎలా ఉన్నావ్?”
"బానే ఉన్న, నువ్వూ?"
"వీడు నా బుర్ర తినేస్తున్నాడు. నేను పోకిరి fellow అనుకుందా? నా Facebook రిక్వెస్ట్ డిక్లైన్ చేసింది అని"
"తను నాకు తెలియదు కదా అశోక్"
"తెలుసుకుంటే సరిపోతుంది కదా, నీకు interest లేదు అని చెప్పకు , నీకు లేకుంటే ఈ పాటికి వాడిని తిట్టి పొసే దానివి అని నేను అనుకుంటున్నాను"
"అతను పక్కన ఉండగానే మాట్లాడుతున్నావా?"
"వాడు నా screen లోకి తలకాయ పెట్టి మరీ చూసి ఇది అను అది అను అంటున్నాడు"
"hmmm అతన్నే పింగ్ చేసి అడగమను. ఎందుకు డిక్లైన్ చేశానో చెప్తాను"
వెంటనే వేరే విండో లో సుధీర్ పింగ్ చేశాడు.
"హలో అండీ! నా Facebook రిక్వెస్ట్ ఎందుకు డిక్లైన్ చేశారు?"
"మీరు పంపగానే accept చెయ్యాలా? ఎవరు మీరు అసలు?"
"నా పేరు సుధీర్. అందరూ సుధీ అంటారు. మీ అశోక్ friend ని, తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నా"
"అలాగే రోజూ రిప్లై ఇవ్వని అమ్మాయిలకి పింగ్ చేస్తుంటారు, అంతేనా?"
"మీరు విసిగించకు నన్ను అంటే మానేద్దాం అనుకున్నా... మీరు ఏం మాట్లాడలేదు అందుకే..."
"మౌనం అర్ధ అంగీకారం అనుకున్నారా? మీ ఇష్టమేనా అంతా?"
"పరిచయానికి ఇంత ఆలోచించాలా?"
"పరిచయంతో ఆపుతారా?"
"మీరు ఆపమంటే ఇప్పుడే ఆపేస్తా"
"Facebook రిక్వెస్ట్ పంపించండి"
"I knew that you wanted to know me"
"మీరు మొన్న quote చేసిన పాట నాకు చాలా ఇష్టం. అందుకే, మాట్లాడి చూద్దాం అనిపించింది"
"ఓ వెండి వెన్నెలా...? నాకు చాలా ఇష్టం ఆ పాట"
"అప్పుడే పంపించేసినట్టు ఉన్నారు? accept చేశా"
"Thanks"
"see You! talk to you tomorrow"
******************
ఒక వారం తరువాత... ఆరోజు సోమవారం...
"దారుణం అండీ ఇది! మీ ఆఫీస్ contactsలో మీ నెంబర్ పాత నెంబర్ ఉన్నట్టు ఉంది"
"అవును ఆంధ్రా నెంబరే, కర్ణాటకకి మార్చలేదు"
"నేను వీకెండ్ ఫోన్ చేసి దెబ్బైపోయా "
(అమృత కొంచెం నవ్వుకుంటూ) "మరి నన్ను అడగాలి కదా?"
"ఏదో surprise గా ఉంటుంది అని..."
"మీకు ఎదుట వారిని అడిగే అలవాటే లేనట్టుంది"
"అలా అని కాదు..."
"మరి?"
"సరే ఇప్పుడు ఇవ్వండి మీ నెంబర్"
"ఇవ్వను"
"అందుకే అడగలేదు"
"పోనీ లెండి, ఫీల్ అవ్వకండి. మీదే నాకు ఇవ్వండి నేనే ఫోన్ చేస్తా నాకు చేయాలి అనిపించినప్పుడు"
****************
ఒక నెల తరువాత ఫోనులో...
"ఇంతకూ మీ రింగ్ టోన్ ఏంటో చెప్పలేదు అమ్ము మీరు"
"అమ్ము నా? ఏంటండీ? అమ్ము ఏంటి?"
"అశోక్ అలాగే కదా పిలుస్తాడు. మీరు కూడా అదే మీ ముద్దు పేరని చెప్పారు "
"నా క్లోజ్ ఫ్రెండ్స్ పిలుస్తారు అలా"
"నేను కాదంటున్నారా?"
"నాకు మీరు మీ గురించి ఏమీ చెప్పలేదు అంటున్నా"
"నా గోత్రం చెప్పనా?"
"మీ ఇష్టాలు చెప్పండి"
"అంటే నా love story ఏ గా మీరు అడిగేది"
"అది మీ ఇష్టం అయితే అదే అనుకోండి"
"తనూ నేనూ classmates. మా ప్రిన్సిపాల్ గారి అమ్మాయి. బాగా డబ్బులున్నాయ్. బానే ఇష్టం ఒకరంటే ఒకరికి... తనే పాపం దాక్కొని దాక్కొని కలిసేది నన్ను. వాళ్ళ నాన్నకు తెలిసిన తరువాత నన్ను పిలిపించి, ‘బాబూ! మధ్యతరగతివాడివి. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. నీకు ఇటువంటి extra cirricular activities అవసరమా? ఇలాంటివి కొనసాగించావని తెలిస్తే placements అప్పుడు నీకు ఎంత ఇబ్బంది చెప్పు’ అని నా ఉద్యోగ అవకాశాల మీద దెబ్బ కొడతానని సున్నితంగా బెదిరించారు. తనని మాత్రం ఇంటి పరువు తీస్తే ప్రాణాలు తీస్తా అని బాగా బ్రతిమాలారు. నాకు ఉద్యోగం వచ్చిన తరువాత తనకు పెళ్ళి కుదిరిందని చెప్పింది. నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు తను ఆ ఇష్టం లేని పెళ్ళి వదిలేసి నన్ను పెళ్ళి చేసుకోవచ్చని అన్నాను. తను ఆ పెళ్ళికి ఒప్పుకుంది కాబట్టే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పింది. బాధపడ్డాను, బ్రతిమాలాను. ‘ఈ జన్మకి ఇంతే నేస్తం. మరు జన్మ ఉంటే కలుద్దాం’ అంది. ‘ఈ జన్మకే లేని హామీ మరో జన్మకి ఎందుకులే’ అన్నాను. తరువాత తన పెళ్ళికి వెళ్ళాను. గుమ్మంలో బ్యానర్ చూసి వెనక్కి వచ్చి తాగేసి పడుకొని లేచి, రెండు నెలల తరువాత ఉద్యోగంలో చేరాను"
"hmmm గుర్తుచేసి బాధ పెట్టినట్టున్నాను"
"ఓ ఆరు నెలలేగా అయ్యింది. కాస్త పచ్చిగానే ఉంది గాయం"
"సరేలే ఊరుకో... పరేషాన్ ఎందుకో... చలేసే ఊరిలో జనాలే ఉండరా... ఎడారి దారిలో ఒయాస్సిసుండదా .."
"భలే టైమింగ్ అండీ మీది. మీ గొంతు కూడా బాగుంది"
అమృత చిన్నగా నవ్వుకుంది.
"అంత గొప్ప గొంతు కాదులెండి"
"ఏమో! సందర్భానికి తగ్గ పాట నచ్చింది"
"ఇంతక ముందు మీరు అన్నారుగా... ‘పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా’ అని"
"మీతో మాట్లాడితే బాగుంటుందండీ. గాయాలు మానుతున్నట్టుగా అనిపిస్తోంది..."
"కొత్త గాయాలు అవుతాయి జాగ్రత్త"
"చూద్దాం...! అవునూ వచ్చే నెల నాలుగు రోజులు సెలవులు కదా, ఇంటికి వెళ్తున్నారా?"
"వెళ్ళాలి... బెంగగా ఉంది"
**********************
నెల రోజుల తరువాత... ఒక శుక్రవారం రాత్రి 6:30కి...
అమృత హడావుడిగా బస్సు ఎక్కింది. ఇదే మొదటి సారి ఇంటికి వెళ్ళడం ఉద్యోగంలో చేరాక. ఇదే మొదటి సారి ఒంటరిగా రాత్రి పూట బస్సు ప్రయాణం. చాలా భయంగా అనిపించింది. ఎక్కడో చివరిలో దొరికిన తన సీటులో కూర్చున్నాక ఫోన్ తీసి మెసేజ్ చేసింది "నేను ఫోన్ చేస్తే ఎత్తుతావా ఎంత లేట్ అయినా, నాకు కొంచెం దిగులుగా ఉంది"
"నేను గుంటూరు లో దిగే సరికి 10:30 అవ్వుద్ది. అప్పటి వరకూ ఫోను airplane మోడులోనే ఉంటుంది. ఆ తరువాత ఖచ్చితంగా ఎత్తుతాను. అయినా ఎందుకంత భయం? భయం కళ్ళలో కనిపిస్తే ప్రతి ఒక్కరూ భయపెట్టాలని చూస్తారు. నీ బెస్ట్ ఫ్రెండ్ MP3 ప్లేయర్ ఉంది గా... On చేసుకో, నీ ప్రపంచంలో నువ్వు విహరించుకో. purse మాత్రం జాగర్తగా పెట్టుకో"
అని తిరిగొచ్చిన సమాధానం చూసి చిన్నగా నవ్వుకుంది అమృత.
అదే రోజు రాత్రి 10:40కి అమృత ఫోన్ మ్రోగింది.
"హలో"
"పడుకుండి పోయావా?"
"లేదు పాటలు వింటున్నా..."
"సరే కానీ నీ బస్సు విజయవాడ ఎప్పుడొస్తుంది?"
"6కి అనుకుంటా"
"అంటే గుంటూరు 4:30-5 మధ్యలో వస్తుంది"
"ఏమో"
"సరే సూర్యాపేటలో టీ కోసం ఆపుతాడు, అప్పుడు నాకు ఫోన్ చెయ్యి"
"ఎందుకు?"
"చెయ్యి చెప్తాను"
తెల్లవారుఝామున 3:30కి బస్సువాడు సూర్యాపేట అని అరుస్తున్నాడు.
అమృత ఫోన్ చేద్దామనుకొని మళ్ళీ అతడి నిద్రను చెడగొట్టినది అవుతుందేమో అనుకొని మెసేజ్ చేసింది.
"సుధీ! సూర్యాపేటలో ఉంది బస్సు" అని.
ఒక గంట తరువాత గుంటూరు దరిదాపులలోకి బస్సు రాగానే అమృత ఫోన్ మోగింది.
"గుంటూరు బస్టాండులో ఒక 5-10 నిముషాలు ఆపుతాడు. నువ్వు ఒకసారి కిందకి దిగు... సరేనా?"
"నువ్వు వస్తున్నావా? ఎందుకు? ఇంత చలిలో తెల్లవారుఝామున?"
"ఉత్తినే... దేవి దర్శనం కోసం"
"ఇలా మాట్లాడితే పెట్టేస్తా నేను"
"అదేం లేదు. నేను అక్కడెక్కడో, నువ్వేమో బెంగుళూరులో. కలిసే వీలే లేదు. నువ్వు ఒకసారన్నా నన్ను చూస్తే మరీ అంత వెధవని కాదని నమ్ముతావేమోనని"
"సరే బస్టాండులోకి వస్తోంది"
అమృత గుండె వేగంగా కొట్టుకుంటోంది. పెద్దగా వెలుతురు లేదు. దట్టంగా పొగ మంచు. కిటికీలోంచి బయటకు చూస్తోంది. తన ఫోన్ మ్రోగింది కానీ ఎత్తే లోపలే ఆగిపోయింది. కిటికీ దగ్గరికి పొగమంచులోంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. చూడటానికి మామూలుగానే ఉన్నా తన నవ్వు స్వచ్ఛంగా అనిపించింది. తనకే తెలియకుండా తన పెదాల పైకి నవ్వు వచ్చింది అమృతకు.
"రాణి గారు కొంచెం కిందకు దిగితే...." అన్నాడతను. ‘దిగను’ అనాలి అనిపించలేదు. బెట్టు చెయ్యాలి అనిపించలేదు. ‘ఎందుకు దిగాలి?’ అనిపించలేదు. వెంటనే లేడిపిల్లలా లేచి గబగబా బస్సు దిగింది. తను దిగే సరికి బస్సు గుమ్మం దగ్గర అతడు ఉన్నాడు. ఇద్దరూ ఏమి చెయ్యాలో తెలియని అయోమయంతో, మొహమాటంతో shakehand ఇచ్చుకున్నారు.
"It’s so good to finally see you అమ్మాయి"
"same here"
"MP3 player ఆ? ఏం పాట?" అంటూ ఒక చెవ్వు నుంచి వచ్చేసిన ear plug పెట్టుకొని విన్నాడు.
‘చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది... పొగ మంచుని పో పొమ్మంటూ తరిమేస్తుంది...’ అంటూ ‘ఆనందం’ సినిమాలో ‘ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా’ అనే పాటలోని లైను వినిపించింది.
"అరే! చిత్రంగా ఎప్పుడూ నీ దగ్గర సందర్భానికి తగ్గ పాటలే ఉంటాయే!" అని అన్నాడతడు. అమృత తల దించుకొని నవ్వింది. నిజానికి సిగ్గు పడింది.
“రావాలమ్మా రావాలి బస్సు బయలుదేరుతుంది...” అని కండక్టర్ అరవడంతో బస్సు ఎక్కింది అమృత. ఎందుకో తెలియదు ఈ చిన్నపాటి పరిచయమే తనకు చాలా మధురంగా అనిపించింది. తాను సీటులో కూర్చొని అతడిని చూస్తోంది. అతడు కూడా ఆమెనే చూస్తూ, నవ్వుతూ టాటా చెప్పాడు. అలా పొగమంచు నుంచి వచ్చి తనకు చిన్న ఆనందాన్ని ఇచ్చి అలానే పొగమంచులోకి వెళ్ళిపోయాడు. తన మాములు ప్రయాణాన్ని మధురమైన జ్ఞాపకంగా మార్చేశాడు.
***********
నెల రోజుల తరువాత... ఒక బుధవారం సాయంత్రం...
అమృతకి ఫోన్ వచ్చింది...
"హలో"
"అమ్ము! ఒక surprise! ఏంటో చెప్పుకో?"
"నాకు బోలెడు పని ఉంది. ఇంకా ఆఫీసులోనే ఉన్నాను. చెబితే చెప్పు, లేదంటే లేదు. ఊహించే ఓపిక, తీరిక రెండూ లేవు"
"మొదటగా నీకే చెబుతున్నా చూడు... నన్ను అనుకోవాలి"
"బెంగుళూరు ప్రాజెక్ట్ ప్లేసెమెంట్ వచ్చిందా?" చాలా మామూలుగానే అడిగింది.
"bingo"
ఒక్క నిమిషం అమృతకి ఏం అర్ధం కాలేదు. నిజమేనా అనిపించి, సిస్టమ్ ముందు నుంచి లేచి వచ్చి
"are you sure? నిజామా? ఎంత బాగుంటుందో నువ్వు ఇక్కడికి వచ్చేస్తే"
అతడూ ఒక్క నిమిషం ఆగి కొంటెగా అడిగాడు. "నేనొస్తే నీకేంటి అమ్మాయి అంత ఆనందం?"
అమృత ఒక్క క్షణం ఆగింది కానీ సహజంగానే తనకున్న గడుసుతనంతో ఇలా అంది.
"అదేం లేదు. ఎవరూ తెలిసినవాళ్ళు లేరు అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే అందరూ తెలుస్తున్నారు. తెలిసున్న నువ్వు కూడా వస్తే బాగుండు అని... అంతే..."
తనేదో చెబుతుందని వేచిచూసి, ఆమె సమాధానానికి డీలా పడి గట్టిగా నిట్టూర్చాడు సుధీర్. అమృత ఆ నిట్టూర్పుని గమనించి ముసిముసిగా నవ్వుకుంది.
******************
సుధీర్ బెంగళూరుకి వచ్చిన 15 రోజుల తరువాత ఒక శుక్రవారం రాత్రి...
(టైం తెలియదు. చాలా సేపటి నుంచి ఫోనులో మాట్లాడుతున్నారు)
"ఓయ్! నేను చెప్పేది నీకు అర్ధం అవుతోందని నాకు తెలుసు. తెలియనట్టు నటించకే...! నువ్వంత అమాయకురాలివి కాదని నాకు తెలుసు"
"నువ్వు చెప్పేదేంటో విడమర్చి చెప్పు. అంతే కానీ నాకు పొడుపు కథలు వేసి విప్పమనకు. ఒక సరి ఇలాగే విప్పాను ఒకరి దగ్గర. తీరా చూస్తే జవాబు అది కాదు అన్నాడు. ఇక మళ్ళీ అలాంటివాటి జోలికి వెళ్ళదలచుకోలేదు"
"ఓహోహో... అమ్మాయి గారికి కూడా ఒక కథ ఉందా? చెప్పచ్చుగా"
"చెప్పేంత గొప్ప కథ ఏమి కాదు. కనీసం పెద్ద కథ కూడా కాదు"
"సరేలే పోనీ... కొత్త కథ మొదలు పెడతావా?"
"ఆ కథేంటో నాకు ధైర్యంగా చెప్పేవాడితోనే మొదలు పెడతా"
"ధైర్యం అంటే ఏంటో?"
"నా కోసం ఇతనేమైనా చేస్తాడు అనిపించాలి"
"ఏమైనా అంటే?"
"ఏమో..."
"సరే కానీ చాలా లేటయ్యింది. ఛార్జింగ్ కూడా అయుపోతోంది ఫోనులో... ఉండనా మరి?"
‘అనుకున్నా ధైర్యం అనగానే ఇలానే తప్పించుకుంటారని...’ అని మనసులో అనుకుంటూ తలగడ సరిచేసుకొని పడుకుంది అమృత.
********************
అమృత పడుకున్న 20 నిమిషాలకి తన ఫోన్ మళ్ళీ మ్రోగింది...
అమృత ఫోన్ ఎత్తి "పడుకుంటా అన్నావ్?" అంది.
"ధైర్యం కావాలన్నావ్?"
"ఫోనుకి ఛార్జింగ్ పెట్టడమా ధైర్యం అంటే?"
"కాదు... తెల్లవారుఝామున నాలుగున్నరకి నవంబరు చలిలో నీ మొహం చూడడం కోసం పదిహేను కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని రావడం..."
అమృత టక్కుమని లేచి కూర్చుంది.
"పిచ్చా నీకు?"
"ఒకసారి బాల్కనీలోకి రావా?"
"no way!"
"కిందకి కాదే... just బాల్కనీలోకి రా..."
"అమ్మో .."
"నా దగ్గర మౌత్ ఆర్గాన్ లేదు జస్ట్ పాటతో adjust అవ్వు..."
"ఓయ్!"
"ఓ ఓ ఓ వెండి వెన్నెలా... ఓ ఓ ఓ దిగిరా ఇలా... అమ్మ కొంగులో చంటి పాపలా... మబ్బు చాటునే ఉంటే ఎలా...? పడిపోతానని పసి పాదాలకు పరుగే నేర్పవా...? మదిలో కలిగిన మధుభావాలకు అడుగే చూపవా...? మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెల..." అని పాడాడు.
"ఆపు! ఎవరైనా వింటారు..."
"అంత గట్టిగా ఏమి పాడటంలేదు. ఒక్కసారి బయటకు రారా..."
అమృత బాల్కనీలోకి వచ్చింది. తనతో పాటు రమ్య కూడా వచ్చింది. రమ్య సుధీరుకి చేతులూపి మౌనంగానే పలకరించింది. సుధీర్ కూడా తనను మౌనంగానే పలకరించాడు.
ఫోన్ లో మాత్రం "అమ్మూ! నన్ను పెళ్ళి చేసుకుంటావా? నా చైత్రం అవుతావా?" అని అడిగాడు.
అమృత గుండె తన చెవ్వులు బద్దలు అయ్యే అంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రక్కనే ఉన్న రమ్య మాత్రం ‘ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు?’ అన్నట్టు చూసి లోపలి వెళ్ళింది. రెండుమూడు నిమిషాలు అటూ ఇటూ తిరిగి ఫోను చెవి దగ్గర పెట్టుకోమని అతనికి సైగ చేసి "ఓ ఓ ఓ సుప్రభాతమా... ఓ ఓ ఓ శుభమంత్రమా... మేలుకొమ్మనే ప్రేమ గీతామా... చేరుకున్న నా తోలి చైత్రమా... నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగా నది... ఈ క్షణాన నీ జత చేరాలని అలలవుతున్నది... వెల్లువలా చేరుకోవా వేచి ఉన్న సంద్రమా..." అంటూ పాడి వినిపించింది. అంతలో చీకటిని చీల్చి ఉదయించడానికి తూర్పున సూర్యుడు సిద్ధమవుతున్నాడు. కలిసున్నది కొంతసేపే అని తెలిసినా అస్తమిస్తున్న చంద్రుడు, ఉదయిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని అందంగా మార్చేశారు.
"నా గొంతే బాగుంది తెలుసా" అన్నాడతను.
"తెలుసు"
"మన కథ మొదలైనట్టేగా"
"నట్టే..."
"సరే మరి బయలుదేరనా? వెళ్ళి పడుకుంటా. సాయంత్రం డిన్నరుకి వెళ్దాం..."
"ఊఁ"
సశేషం ...