Sunday, May 20, 2018

ఆకాశ వీధి లో అందాల జాబిలి

ఇది నిజం అండి. నిజం ఎప్పుడూ అందం గానే ఉంటుంది.

         ఆకాశ వీధి లో అందాల జాబిలి అని మధురవాణి తన కథ కు పేరు పెట్టుకుంది. జాబిలి కి పౌర్ణమి ఉంది , అమావాశ్య ఉంది . రెండిటికీ  మధ్యన కృష్ణ  , శుక్ల పక్షాలు ఉన్నాయ్ . ఒక వ్యక్తి జీవితాన్ని కథగా  తీసే అప్పుడు అన్ని నిజాలు చూపిస్తారా? తన ఎదుగుదల చూపినంత గొప్పగా పతనం చూపిస్తారా? అన్న అనుమానం తోనే  వెళ్ళి చూసిన నాకు , తను కొడిగట్టే ముందు కూడా ఆ దీపం మినుకు మినుకు మనలేదు , దేదీప్యంగా వెలుగుతూనే ఉంది , వెలుతురు ఇస్తూనే ఉంది అని తెలిసింది. తాను తారా లోకం చేరే వరకు తార లానే జీవించింది అని తెలిసింది.

                  మొన్నీమధ్యనే ఒక స్నేహితుడు అన్నారు , మనకు కళను ఆదరించటం  రాదు అని. నిజమేనేమో అనిపించింది , నిజం అవ్వుతుందేమో అని భయమేసింది. సావిత్రి గారిని ఆదరించిన మనకు కళ గురించి తెలియదు అంటే నమ్మేదెలా ? సావిత్రి గారి కథని ఆదరించిన మనకు కళ తెలియదు అంటే ఎలా!

        సినిమా బాగుంది, ఇక్కడ బాగుంది , ఇలా బాగుంది, ఇంత బాగా చేశారు , ఇంత బాగా చూపించారు అని చెప్పలేనేమో కానీ .. ఇది నిజం కాబట్టే బాగుంది.. నిజాయతి ఉంది కాబట్టే హృద్యంగా ఉంది అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే జీవితం కంటే గొప్ప కథ ఎక్కడ ఉంటుంది ?

             సినిమా లో ఒక dailogue  ఉంది "ప్రతిభ ఇంటి పట్టునుంటే, ప్రపంచానికి పుట్టగతులు ఉండవు " అని . మధురవాణి ఏమి నేర్చుకున్నారో , తెలుసుకున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం భయపడకుండా రాద్దాం అని నిర్ణయించుకున్నాను . భయం దేనికి  అని అనచ్చు మీరు, రాయటం అంటే మన మనసుకు బట్టలు లేకుండా అందరి ముందు నిలబెట్టటం. ఆ ధైర్యం ఉందా  నాకు? ఏమో , ఈ రోజు మాత్రం మాహానటి చూసాక ఉందనే  అనిపించి రాస్తున్నాను. ఎందుకంటే ఇది నిజం, నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది.

- ఆ జాబిలి పంచిన వెలుగులో, వెలుగుతున్న ఒక చిన్న దివిటీ





No comments:

Post a Comment