Tuesday, March 25, 2014

1950,ఒక ప్రేమ కధ

"తెలవారుతుంది అని ఎవరు ఎవరికీ చెప్తారు ? పల్లెటూరు సూరిడుకా? సూరిడుకి పల్లెటురా ?లేదంటే  వీరిరువురికి కలిపి కోడి పుంజు మహాసేయుడా? ఎవరైతేనేం.. కావిళ్ళతో పాలు మోసుకొని పాల కేంద్రానికి వెళ్ళే రైతులు, ఇంకా వెలుగు రాకుండానే పక్షులు అన్నీ గూళ్ళు  వదిలి గుంపులు గుంపులుగా రాబోయే రోజు మీద దండయాత్రకి బయలుదేరాయి! సంక్రాంతి రోజులు కావటం తో ఎప్పుడూ తొందరగా లేచే పల్లెటూరు ఇంకా ముందుగానే మేల్కొంది, అలాగే సీతాలు కుడా .. స్నానం అదీ  చేసి, అవులకు పాలు తీసి, ఇంట్లోకి కొన్ని పాలు అట్టే పెట్టి .. ఎదురింట్లో పాలు పోయ్యటానికి  బయలుదేరింది... సీతాలు ఇంటి బయట ఉన్న కుళాయి లో ఎడమ చెయ్యి తడి చేసుకొని .. ఎదురింటికి వెళ్ళింది.

                              ఎదురింటి రామ చంద్రం వాళ్ళది పొరుగూరు.. అక్కడ ఆర్ధికంగా దెబ్బ తిన్న తరువాత పొలం  అంతా అమ్మేసుకొని ..  అక్కడ ఉండటానికి మనస్కరించక .. ఈ ఊరు వచ్చి స్థిరపడ్డారు రెండు ఏళ్ళ క్రితం. ఇక్కడ అతను, అన్న , తండ్రి ముగ్గురు కాస్త పొలం కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తూ రోజులు గడుపుతున్నారు. రామ చంద్రం  తల్లి కూడా చాలా మంచి వ్యక్తీ.. సహజంగా  పల్లెటూరి అప్పలమ్మలా కాకుండా .. నిజమైన అమ్మ లా అందరితో ఆప్యాయంగా ఉండేది. ఈ కుటుంబానికి పెద్దగా డబ్బు లేకున్నా బాగా కస్టపడి బ్రతకుతారు కాబట్టి  ఈ ఊరిలో మంచి పేరే ఉంది.

                              రెండేళ్ళ క్రితం .. ఈ రోజుల్లో రామ చంద్రం వాళ్ళు  ఊరు వచ్చిన కొత్తల్లో .. సీతాలు పాలు పోయటానికి వచ్చిన మొదటి రోజు .. తల స్నానం చేసి జుట్టు విడుల్చుకుంటూ వచ్చింది .. ఆ జుట్టులోంచి  జారే నీటి  తుంపరలు బయట పెరట్లో .. నవ్వారు మంచం మీద పడుకుని ఉన్న చంద్రం మీద పడి  ఉలిక్కిపడి లేచి చూశాడు .. అప్పటికే ఆమె ఇంటి గుమ్మం దాటి లోపలి వెళ్ళింది.. "అమ్మా ! ఎవరోచ్చారు?" అని అడిగాడు .. ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం తో..  "ఎదురింటి సీతాలు నాన్న .. పాలు ఇవ్వటానికి .." అని అంది. అతని గొంతు విన్న సీతాలు .. మాములుగా ఉన్నది కాస్త .. ఎవరో గమనిస్తున్నారు అన్న స్పృహతో  .. చెంబు అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది .. చంద్రం అమ్మ లోపలికి వెళ్ళగానే ..  పరికిణీలొ.. వదులైన జుట్టు తో .. నాజుగ్గా ఉన్న తను అల తెల తెల వారని పొగ మంచు లో జింక పిల్లలా .. పరిగెడుతూ ఉంటే .. తన గుండెలు కూడా ఆమె గజ్జేలకు ఉన్న మువ్వల లాగ కొట్టుకున్నాయి..  ఆ రోజు .. చంద్రం పళ్ళు అరగంట సేపు పెరట్లో ఉండే తోమాడు, కాఫీ కూడా బయటే తాగాడు .. ఏది ఆమె బయటకి రాదే అని .. చివరికి ,, విసుగు పుట్టి .. లోపలికి పోయి .. బయటకు వెళ్ళటానికి తయారు అయ్యి .. చివరగా .. ఒక సారి అనుకోని .. సైకిల్ తో గుమ్మం ముందు నుంచొని "అమ్మ ! వెళ్లొస్తాను" అని గట్టిగా  అరిచాడు.. అతనికి ఏదో గజ్జెల చప్పుడు వినపడింది కాని .. మనిషి కనిపించలేదు.. కొంచెం ఎదరకు వెళ్ళాక .. వెనక్కి తిరిగి  చూసాడు .. అతను ఆగిన వెంటనే .. ఒక పరికిణి వేసుకున్న రూపం స్థంబానికి అటు వైపు తిరిగి నుంచుంది ... చంద్రం నవ్వుకున్నాడు .. అటు వైపు తిరిగి నుంచున్న సీతాలు పెదవుల పై కూడా ... చిరునవ్వు విరిసింది...

                               ఇంక ఆ తరువాత రోజు నుంచి .. సీతాలు పాలు తీసుకెళ్ళే ముందు .. తన ఎడమ చెయ్యి తడి చేసుకొని పెరట్లో పడుకొని ఉన్న చంద్రం మీద చిలకరించి అతను లేచే లోపల ఇంట్లోకి వెళ్ళటం ... అదే అతనికి మేలు కొలుపు... ఒక్కో సారి ఏదన్నా వాన  తుంపర పడిందా .. తనను నిద్ర లేపినందుకు .. తన దేవి దర్శనం కానందుకు ప్రకృతిని మనసులోనే తిట్టుకునే వాడు ... సీతాలు కూడా ఇంట్లోకి వెళ్ళి .. తిరిగి వచ్చే అప్పుడు మాత్రం .. అతని చూపులు పలకరిస్తుంటే ..  సిగ్గుల ... మొగ్గై .. నెమ్మదిగా నడుచుకుంటూ .. వాళ్ళ ఇంటికి వెళ్ళేది ..  ఆమె రోజూ ముగ్గు పెట్టే వేళకి  చంద్రం కాఫీ గ్లాసు తో అరుగు మీదకి వచ్చే  వాడు... ఒక్కో సారి సీతాలు ముగ్గు ఆలస్యం ఐన ,
చంద్రానికి కాఫీ కుదరకపోయినా .. ఇద్దరికీ ఏమీ  తోచేది కాదు .. రోజులో ఈ కొన్ని క్షణాల కోసం వారిద్దరూ రోజంతా ఎదురు చూసే వారు.

                  ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో ... ఒక్క అడుగు ముందుకు వేసి చెప్పుకోవాలన్న  ఆలోచన  ఇద్దరికీ  రాలేదు ... ఇద్దరి లో ఏ  ఒక్కరూ  పూనుకోలేదు!  బహుశా ఇలాగే  జీవితాంతం ఉంటుంది అనుకున్నారేమో!
                   
 ఒక రోజు చంద్రం ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి... సీతాలుకి

"ఎవర్రా  ఆ అమ్మాయి ? కులం తక్కువ పిల్లను ప్రేమించింది కాక నాకే వచ్చి చెప్తావా?"
"నాన్న నా మాట కాదనకండి .. కాంతానికి నాకు పెళ్ళి జరగకపోతే .. నేను బ్రతకను " అని బ్రతిమలాడాడు చంద్రం వాళ్ళ అన్నయ్య.

ఈ లోపల ఏదో అరవబోయిన చంద్రం నాన్న గుండె పట్టుకుని కుప్ప కూలి పోయాడు. .. సీతాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు .. చంద్రం వాళ్ళు ఊర్లో అంతా కంగారు పడ్డారు కానీ  గండం గడిచి ఆయన బయట పడ్డాడు..  డాక్టర్ గారు  అయన ఉద్రేకపదకూడదని చెప్పి వెళ్ళారు ... చంద్రం వాళ్ళ అన్నయ్యకి .. కాంతానికి వాళ్ళ నాన్న దగ్గరుండి పెళ్ళి  జరిపించాడు.. పెద్ద వాడేమో కానీ  చిన్న వాడు మాత్రం తను చూసిన పిల్లనే చేసుకుంటాడు అని ఆయన అందరికి చేపుకునేవారు .. దాంతో చంద్రం సీతాలు వంక చూడటం మానేసాడు ..అతని  చూపులు ఎప్పుడైతే  ఆమెను వెతకటం మానేశాయో  అప్పటి నుంచి ఆమె తల ఎత్తి ప్రశ్నల చూపు సంధించటం మొదలు పెట్టింది .. ఆమె వైపు చూడాలి అని ఉన్నా ... ఆమె ప్రశ్న  కి సమాధానం చెప్పాలి అని ఉన్నా  తల ఎత్తలేదు అతను.. అతని ప్రాణమంతా .. ఆమెని చూడమని పోరు పెట్టినా .. అతని సంకల్పాన్ని జయించలేక ఓడిపోయింది.

       మరి కొన్నాళ్ళకి సితాలుకి  పెళ్ళి  నిశ్చయం అయ్యింది. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి అనగా .. సీతాలు .. ఇంతక ముందు లా  పాలకోసం వచ్చి .. నీళ్ళు చిలకరించి చంద్రాన్ని నిద్ర లేపింది .. ఈ సారి మాత్రం అక్కడే నుంచొని ఉంది ..
 అతని వైపు సూటి గా చూస్తూ  "నాలుగు రోజుల్లో నాకు పెళ్ళి " అని అంది ..
అతను ఆమే వైపు కాకుండా వేరొక వైపు చూస్తూ  "తెలుసు , అమ్మ చెప్పింది " అన్నాడు

ఆమె వెళ్ళిపోయింది .. అతను మళ్ళ  ఆమె వైపు చూడలేదు ఆ రోజు.

   పెళ్ళి రోజు  సీతాలు వాళ్ళింట్లో  చాలా  కోలాహలం గా ఉంది .. రాత్రి 10:00 కి ముహూర్తం . సీతాలు వాళ్ళ అమ్మ , నాన్న అంత ఎంతో ఆనందంగా ఉన్నారు. పెళ్ళి  చూడటానికి వచ్చిన వాళ్ళు కూర్చోటానికి  వేసిన కుర్చీల్లో  చివరి వరుసలో కూర్చున్నాడు రామచంద్రం .. అంత వరకూ తల దించుకొని కూర్చున్న సీతాలు ... సూటిగా ఎవరో చెప్పినట్టే అతని వైపు చూసింది! అతను కూడా ఆమె వైపే చూశాడు. భజంత్రీలు గట్టిగా మ్రోగాయి .. అదే సమయానికి తాళి ఆమె మేడలో పడే వేళ పీటల మీద కూర్చున్న సీతాలు .. ఒరిగి కింద పడిపోయింది .. సరిగ్గా అదే సమయానికి కుర్చీలో కూర్చున్న చంద్రం కింద పడిపోయాడు .. ఇద్దరి గుండెలు .. ఆమె పెళ్లి ముహూర్తాన ఆగిపోయాయి .."
అని ముగించింది స్పందన

"తరువాత ఏమయ్యింది" అని అడిగాడు .. కన్నీళ్ళు  తుడుచుకుంటూ  చాణక్య

"చనిపోయాక ఏమవ్వుతుంది  నీ మొహం" అని అంది రమ్య.

"ఇంతకీ ఈ కధ ఇప్పుడెందుకు చెప్పావ్? నీకెలా తెలుసు ఈ కధ?" అడిగాడు  సురేష్ ..

"అరె నువ్వేనా ... ఇప్పటి వరకు ఎవ్వరినీ love చెయ్యలేదా అని అడిగావ్? చేశాను ! ఇది నా కధే ..  నన్ను పలకరించే ఆ చూపులకోసమే మల్లి 1987 లో పుట్టాను స్పందన లాగా! కాకపొతే అతనే ఇంకా నన్ను వెతుక్కుంటూ  రాలేదు " అని దీర్ఘంగా నిట్టూర్చింది స్పందన.


"చాల్లే ఊరుకో ఏదో చెత్త కధ  చెప్పి నన్ను emotional చేశావ్ " అన్నాడు చాణక్య చిరాకుగా చూస్తూ ..


"చెత్త కధా ? ఇదే కధ  రాజమౌళి చెప్తే ఎగేసుకుంటూ చూస్తావ్ ఎన్ని సార్లైనా .. పోయి పని చూసుకో .." అని విసుక్కుంది స్పందన ..

అందరూ నవ్వుకుంటూ .. ఎవరి డెస్క్ దగ్గరకు వాళ్ళు వెళ్లి పోయారు!



P .S : Tragedy  అని నన్ను తిట్టుకోవద్దు .. కసురుకోవద్దు .. నాకు వేటూరి గారు రాసిన "ఓ ప్రియా  ప్రియా " పాట  చాలా ఇష్టం .. ఆ చరణాలకు తగ్గ కధ  రాయాలని నా ప్రయత్నం .. మరి result మీరే  చెప్పాలి

No comments:

Post a Comment