Sunday, October 11, 2020

సత్యం తాత 💖

  నా పేరు బేబీ సరోజ, ముద్దు పేరు పప్పి. ఈ రెండు పేర్లని పట్టుకుని నన్ను చిన్నప్పటి నుంచి, చాలా మంది ఏడిపించేవారు. నేను కూడా బాగానే ఉడుక్కునేదానిని. నా వయసు ఒక పదేళ్ళు ఉండి ఉంటాయి. వేసవి కాలం సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరో గుర్తులేదు కానీ నన్ను బాగా ఉడికించారు. నాకు మాములుగా అయితే ఏడుపు రాదు కానీ అప్పుడు వచ్చింది. నేను మా అమ్మ దగ్గరకి కోపంగా వెళ్ళి "తమ్ముడికేమో కార్తీక్ అని అంత మంచి పేరు పెట్టావ్! నాకేమో పిచ్చి పేరు పెట్టావ్ !" అని అరిచేశాను. మా అమ్మ తాపీగా "నువ్వు పెళ్ళైన మొదటి సంవత్సరం లోనే పుట్టావ్, వాడు నాలుగేళ్లకు పుట్టాడు. నా మాట నెగ్గించుకోటానికి నాకు అంత సమయం పట్టింది" అని నా బుగ్గ గిల్లి నవ్వేసింది. 


         నేను వరండాలో మా తాతమ్మ పక్కనే ఆమె మంచంలో కూర్చొని బుంగ మూతి పెట్టుకొని,  దీర్ఘంగా ఆలోచిస్తున్నా, ఈ పేరు సమస్యని ఎలా పరిష్కరించాలా అని. మా తాత సిగెరెట్  చివరి పఫ్ పీల్చేసి, సిగరేట్ పక్కన పడేసి, హాల్స్ బిళ్ళ వేసుకొని వరండాలోకి వచ్చి, ఇంట్లోకి వెళ్ళబోతూ నన్ను చూసి "పప్పులుగా ! ఏంటి రా అట్టా ఉండా ?"  అని అడిగాడు. "నా పేరు నాకు ఇష్టం లేదు తాత! మార్చేసుకుందాం అనుకుంటున్నా, ఎట్టా మార్చాలా, ఏమని మార్చాలా అని అలోచిత్తన్న"  "ఎందుకూ ? నీ పేరుకే? మీ నాయనమ్మ పేరని మీ కృష్ణం తాత కోరి మరీ పెట్టుకుంటే !" " అందరూ బేబీ అంటే చిన్న పిల్లా ? పప్పీ అంటే కుక్క పిల్లా ?  అని అంటన్నారు తాత 😒" "ఓస్ అదా ! అంటే అననివ్వు , నువ్వు ఇట్టా ఏడుత్తా ఉంటే ఇంకా ఎక్కువ అంటారు" "అదొక్కటే కాదు తాత, పేరు కూడా బాలేదుగా!" " ఆసి పిచ్చ మొహమా ! పేరులో ఏముందే ? పుచ్చలపల్లి సుందరయ్య, ఇదేమన్నా గొప్ప పేరా? మరి ఆయన సైకిల్ మీద అసెంబ్లీకి ఎల్లే వాడు. నేను అప్పట్లో పార్టీలో ఉన్నప్పుడు మన ఊరు కూడా వచ్చాడు. జనం అంతా ఎగబడి చూశారు! ఆళ్ళ సమస్యలు జెప్పుకున్నారు! అది ఆయన పేరు జూసి కాదు, మనిషిని జూసి. మనిషి వల్ల పేరుకి పేరొస్తది.  ఫ్రూటీ తాగుతావా?" అని అనగానే, నా మొహం మతాబులా వెలిగిపోయి, తాత చెయ్యి పట్టుకొని, మా తాతమ్మకి ఒక ముద్దు పెట్టి, బజారుకి వెళ్ళి ఫ్రూటీ తాగాను. 


    చిన్నప్పటి నుంచి తాత అంటే చాలా ఇష్టం. చాకోలెట్లు కొనిస్తాడు అని, ఫ్రూటీ కొనిస్తాడు అని, ఇలా ఎన్నో కారణాలు. అమ్మ వాళ్ళ దగ్గర చెల్లని అల్లరి, తాత దగ్గర చెల్లేది. ఒక రోజు నేను తాత, నెల్లూరులో ఎస్టీడీ బూత్ దగ్గరకు, ఫోన్ చెయ్యాలి అని వెళ్ళాం. ఆ షాప్ అంకుల్ నాకు అంతక ముందు తెలుసు కాబట్టి "ఎవరు పప్పీ ? మీ మావయ్యా ? "అని అడిగారు.  నేను ఫక్కున నవ్వేసి "కాదు అంకుల్ మా తాత" అని చెప్పా. "మీ అమ్మ పోలికలు ఉంటే మీ మావయ్య అనుకున్నా" అన్నారు. తాత ఫోన్ మాట్లాడి బయటకు వచ్చి నాకు, తమ్ముడికి అని చెప్పి రెండు చాకోలెట్లు కొని, నా చెయ్యి పట్టుకొని ఇంటికి నడిచాడు. ఆ వెళ్ళే దారిలో " తాతా ! నీకు ఎన్ని ఇయర్స్ ?" అని అడిగా "ఎందుకు రా ? 49" అని అన్నాడు. నేను నవ్వాపుకుంటూ " ఆ కొట్టు అంకుల్ నువ్వు నా మావయ్య అంటున్నాడు తాత " . చిన్నగా నవ్వుకొని " ఉఁ మరి! ఏవనుకుంటన్నా? నేను ANR కాలేజీ లో PUC చదువుకునే అప్పుడు అందరూ నన్ను జూసి, కాస్తా సాయి తక్కువగానీ  నాయేశ్వరరావులా ఉంటాడు సత్తిం అనేవారు." నేను పెద్దగా నవ్వేసాను. ఇప్పటికీ, ఎప్పటికీ నాకు తాత అంటే గుర్తొచ్చేది, ఆ వీధిలో నేను తన చెయ్యి పట్టుకొని నడవటం, అక్కడక్కడా రాయిని తన్నడం, నేను ANR లాగా ఉండేవాడిని అని తను అన్నప్పుడు తన ముఖం అలా నా హృదయంలో ముద్రించుకుని పోయాయి. అంతకు మించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా, ఇది నా సొంతం. నాకు, తాతకి సొంతం. ఆ నిముషంలో ఎప్పటికీ నేను, తాతే ఉంటాం. ఆ నిముషంలో నేను అత్యంత సంతోషంగా ఉన్నాను, అందుకే అది నాకెప్పటికీ గుర్తుండిపోయింది.


     ఏళ్ళు గడిచే కొద్దీ నాకు తాతకి చిన్నప్పుడు ఉన్నంత మాటలు లేకున్నా, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, చనువుగానే ఉండేదానిని, కాకపోతే ఫోన్ చేసి మాట్లాడటం తక్కువ. నేను ఉద్యోగంలో చేరి, ఒక నిర్ణయం తీసుకోటానికి సతమతమవుతూ ఉన్న సమయంలో ఒకసారి ఎందుకో తాతకి ఫోన్ చేసి " తాతా, ప్రపంచం అంతా ఇది నీకు మంచిది అంటున్నారు, కానీ నీకు అది మంచిది కాదు అనిపిస్తుంది, ఏమి చేస్తావ్? " అని అడిగాను. మా తాత " నాకు ఏది రైట్ అనిపిస్తే అదే చేస్తా " అని అన్నాడు. "సరే తాత " అని పెట్టేసా. అలా ఒక అర నిముషం ఫోన్ కాల్ నాకు జీవితంలో ఎంత ఉపయోగపడిందో చెప్పలేను. తన అన్న ఆ ఒక్క మాటకి నేను ఎప్పటికీ వెల కట్టలేను. 


     మా తాత అంతా మంచే చేశాడు , తప్పులు ఏమీ చెయ్యలేదు అని ఏమీ లేదు. తన జీవితంలో తను పొరపాట్లు చేసినా కానీ తనని తాను ఎప్పుడూ అనుమానించుకోలేదు, చిన్నబుచ్చుకోలేదు, అవమానించుకోలేదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. అందరి జీవితాల్లో ఒక భాగంగా ఉన్నాడు. ముఖ్యంగా తన చివరి  పాతికేళ్లలో, అందరికీ తను ఉన్నాడు అనే ధైర్యం ఉండేది. అలా అని తన అభిప్రాయాలతో ఎవరి జీవితాలని తీర్చిదిద్దెయ్యాలని అనుకోలేదు, ప్రయత్నించలేదు. తన పిల్లలు ఎదిగిన వారు, వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి అనే స్పృహ కలిగి ఉండేవాడు. తన అవసరం ఉంది అని అనిపిస్తే పక్కన మౌనంగా, ఒక కొండంత బలంగా నిలబడేవాడు, లేదు అని అనిపిస్తే, అంతే మర్యాదగా వెళ్ళిపోయేవాడు. అందుకే మా తాత నాకు హీరో. నాలా నేను ఉండటానికి ఆయన ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. He proved to me that you can make mistakes, be human, be very normal  and still be a hero in your own right. 


   తనకు కాన్సర్ అని తెలిసినప్పుడు, ఇంకో రెండు ఏళ్ళు అన్నా ఉంటారేమో అనుకున్నా, ఎందుకంటే తాతకి బాలేదు అనేది కొత్త నాకు. తాతకి ఒంట్లో బాగాలేకపోవడం చాలా తక్కువ. కానీ, చివరి రోజుల్లో, తనతో ఉండగలిగాను, తనకి goodnight kiss పెట్టగలిగాను. తను వెళ్ళిపోయిన రోజు చాలా ఏడ్చాను, నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు తను ఉంటే బాగుండు అనిపించింది, అది అత్యాశలా కూడా అనిపించలేదు. నా మనసుకి శాంతి లేకపోయింది. చాలా రోజుల తరువాత "The Good Place" అనే ఒక సీరీస్ చూస్తుంటే, అందులో ఒక బుద్దిస్ట్ తత్త్వచింతన గురించి చెప్పారు..


 " నువ్వు ఒక సముద్రంలో అలని చూస్తున్నావ్ అనుకో, నువ్వు దానిని చూడగలుగుతావు, దాని పొడవు ఎంత అని చూడగలుగుతావు, దాని మీద సూర్యకాంతి ఎలా నాట్యం చేస్తుందో చూడగలుగుతావు, క్షణం ఆగిన తరువాత అది ఒడ్డుకి చేరి, అల పోయి, నీళ్ళు మిగులుతాయి. కాకపోతే వేరే రూపంలో .. అల అన్నది ఆ నీటికి ఒక రూపు మాత్రమే .. "


"Picture a wave, in the ocean.. you can see it, measure it, the way light refracts when it passes through, it's there , you can see it, you know what it is.. It's a wave. And then it crashes on the shore.. it's gone, but the water is still there.. the wave is just a different way for the water to be, for a little while. The wave returns to the ocean, where it came from, where it's supposed to be.


ఇది చూసిన తరువాత... తను లేరు అనే బాధను వదిలెయ్యగలిగాను.. తను ఇక్కడ ఉన్నందుకు, నా జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండడం నేర్చుకుంటున్నా.. 


 తను వచ్చిన చోటికి తనువెళ్లిపోయారు. తనవి, నావి జ్ఞాపకాలు మోసుకుంటూ..  ఏదో ఒక రోజు నేనూ వెళ్తాను. అందరం వెళతాం.. అల విడిచి...  నీటి రూపంలో...  సముద్రంలోకి .. తిరిగి మనం ఉండవలసిన చోటికి.. మన చోటికి..

Saturday, July 25, 2020

అమావాస్య సిరివెన్నెల

నిద్రలేమి. ఇది  చిన్నప్పుడు ఉండదు. ఎదిగే కొద్దీ వచ్చే జబ్బు. చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాముకష్టపడితే నిజం అయిపోతాయి  అని అనుకుంటాం. పెద్ద అయ్యాక ఎంత కష్టపడినా  తీరం కనపడదు.  ఒక వేళ కనిపించినా చేరుకోలేముచేరుకున్నా ఇది కాకుండా ఇంకేదో ఉంది అంటుంది సమాజం. కలలు ఒకలా ఉంటాయి. నిజాలు ఇంకొకలా ఉంటాయి.          ప్రపంచం అందంగా కనిపిస్తూనే  భయంకరంగా  ఉంటుంది . ప్రేమద్వేషంమనుషులని కోల్పోవటంఈ విశాల విశ్వంలో నేను ఏంటి  అని ఆలోచించటం వంటివి అన్నీ కలిసి  నిద్రపట్టకుండా చేస్తాయి. అలాంటి ఒక నిద్ర రాని రాత్రిచాలా కాలంగా నేను వినకుండా పక్కన పడేసిన ఎంపీత్రీ ప్లేయర్ ఆన్ చెయ్యగానే వినిపించిన మొదటి పాట ... 

 

అంతం సినిమాలోని 

 

 

"చలెక్కి ఉందనుకోఏ చలాకి రాచిలకో .. "

 

ఈ పాట వింటూనేఎన్నాళ్ళైందో ఇది  విని అనిపించింది.  కొన్ని  పాటలతో మనకు తెలియకుండానే  ఒక అనుబంధం ఏర్పడుతుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి. 

 

         నా చిన్నప్పుడు మేము అనంతపురంలో ఉండే వాళ్ళం. నాకు  పదేళ్ళు ఉంటాయి. మా నాన్న ఒక రోజు ఆఫీసు నుంచి రాగానే ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పారు. నాకు ఆ  వార్త ఎంత మాత్రమూ  నచ్చలేదు. ఇక్కడ అలవాటు పడిన స్కూలునిఇష్టమైన స్నేహితులని  వదిలేసి కొత్త ప్రదేశానికి వెళ్ళటం అంటే నాకు చాలా దిగులుగా అనిపించింది. 

 

     మేము అనంతపురం నుంచి నెల్లూరు వెళ్ళే రోజుమా సామాను ఉన్న లారీ లోనే మేమూ  బయలుదేరాము. సామానుకి కాపలాగా ఉంటూనే  మా ప్రయాణ ఖర్చులు కూడా కలిసివస్తాయి అని అలా లారీలో ప్రయాణించాము.  నాకు  ఊరు వదిలి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఏడుస్తూ ఉన్నాను. మా అమ్మానాన్న  నన్ను ఓదార్చటానికి ప్రయత్నించి నేను ఎంతకూ ఏడుపు ఆపకపోవటంతో ఓపిక లేక వదిలేసారు. ఆ డ్రైవర్ మాత్రం "పాపా  ఏడవటం ఆపవూ! ఇది  నాకు చాలు ఇష్టంచాలా కష్టపడి కొనుక్కున్నాపాటలు విందాము. ఏడవకూడదు మరి ! " అని చెప్పి  తన Walkman ఇచ్చారు.  నేను walkman చూడటం అదే మొదటిసారి. ఆయన ఆన్ చెయ్యగానే వినిపించిన మాట 

 

"చీకటి ఉందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగాకోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా  "

 

అసలైతే  అంత వివరంగా నాకు గుర్తుండకూడదుకానీ చీకట్లో లారీ క్యాబిన్ లో  కూర్చునిదాని లైట్లు  ఆ చీకటి  రాత్రిని చీల్చుకుంటూ  ముందుకు వెళ్తుండగా విన్న మాట ( పాట ) కాబట్టి గుర్తుండి పోయింది. అమ్మ నాన్న తమ్ముడు పడుకున్నా  నేనూ డ్రైవర్ మాత్రం నెల్లూరు చేరే  వరకూ పాటలు వింటూనే ఉన్నాం. 

 

         దిగులుగా నిద్ర పట్టని నాకుపదేళ్ళ వయసులో నాకు సాంత్వన ఇచ్చిన పాట వినగానేఎదో తెలియని ఉత్సాహంఎప్పుడో విడిపోయిన స్నేహితురాలిని చూసి పలకరించినట్టు అనిపించింది. బయటకు వెళ్ళి చుక్కల్ని చూస్తూనా బాధలని జోకొట్టే ఈ పాట...  

 

"నలు దిక్కులలో నలుపు ఉందనుకో చిరునవ్వులకేం పాపం!

వెలుగివ్వనని ముసుగేసుకుని మసి బారదు ఏ దీపం "

 

వేసవిలో మల్లెల గాలి ముఖానికి  తాకుతూ ఉంటేఈ మాటలు వినిచిరునవ్వు  విరిసింది నా పెదవులపై. నవ్వినంత మాత్రాన నా బాధలు తీరిపోతాయాకలలు నెరవేరుతాయా  అని నిట్టూర్చే లోపలే 

 

"కారు నల్లని దారిలో ఏ కలల కోసమో యాతనకాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా .. 

కలలన్నిటినీ వినిపించుకుని నిలవేసిన కళ్ళనీ వెలి వేసుకొని వెళ్ళిపోకు మరీ  విలువైన విలాసాన్ని .."

 

అని వింటూ తల పైకి ఎత్తి చూసిన నాకు  అమావాస్య నింగిలో తళుక్కుమనే కోటి చుక్కలు కనిపించాయి 

 

"చురుగ్గా చూస్తావోపరాగ్గా పోతావోవాలేస్తానంటావోఇలానే ఉంటావో.."

 

వెళ్ళి పడుకోకొత్త కలల్ని చూడు చురుగ్గా చూడు కానీ పరాగ్గా బాధ పడకు అన్ని కలల్ని చూపించే కళ్ళని ఇలా  పడుకోకుండా శిక్షించకు అని ఈ పాట చెప్పినట్టు అనిపించింది... 

 

లోపలకి వస్తూ మళ్ళీ ఒక్క సారి ఆ చుక్కల్ని చూడాలి అనిపించి చూశాను ... ఒక తోక చుక్క రాలుతోంది.. ఈ పాట రాసిన సీతారామశాస్త్రి గారిని నాకు ఈ పాట పరిచయం చేసిన ఆ డ్రైవర్ ని మరొక్కసారి  కలిస్తే బాగుండు అని కోరుకుని వచ్చి పడుకున్నాను . వెంటనే నిద్ర పట్టింది. 

 

https://www.youtube.com/watch?v=reP3euk2Vew

 






Saturday, May 09, 2020

ఓ వెండి వెన్నెలా 2

******
మరుసటి రోజు సాయంత్రం భగినీ రెస్టారెంటులో...
"ఏంటి అమ్ము ఏమి మాట్లాడావే?"
వచ్చినప్పటి నుంచి తల వంచుకొని కూర్చుంది అమృత. సుధీర్ మాట్లాడే సరికి తల పైకి ఎత్తి చూసింది.
"ఏం లేదు, ఇది నా జీవితమేనా అనిపిస్తుంది. నువ్వు నాకు నిజంలానే అనిపించడం లేదు తెలుసా?"
"అదేంటి?"
"నువ్వు, నీ మాటలు, నీ గొంతు, నీ నవ్వు, నీ కళ్ళు, నీకు నేను అంటే ఇంత ఇష్టం ఉండటం... నమ్మలేక పోతున్నా!"
"మరీ మొహమాట పెట్టేస్తున్నావ్" అన్నాడు అతను సిగ్గు నటిస్తూ.
"అదేం లేదు, నాకు భయంగా కూడా ఉంది. నాకు నువ్వంటే ఇష్టం కానీ కనీసం 24 ఏళ్ళు రాకుండా పెళ్ళి చేసుకోలేను. అలా అని ఈ రెండు సంవత్సరాలు ఇలా దగ్గరగా ఉన్న తరువాత రేపు మీ ఇంట్లోనో, మా ఇంట్లోనో వద్దంటే విడిపోతామా? అలా జరిగితే నేను ఉండగలనా? ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు"
అతను కొంచెం మొహమాట పడుతూనే టేబుల్ పైన ఉన్న అమృత చెయ్యి మీద చెయ్యి వేసి కొంచెం సౌమ్యంగా "అమ్మూ! ఇలా చూడు. విడిపోతే ఎలా ఉంటుందో ఆ నొప్పి తెలిసినవాడిని. మళ్ళీ అలా జరగనివ్వను అనుకున్న వాడిని. ఏది ఏమైనా మనం విడిపోవడం జరగదు. నా వల్ల అయితే జరగదు. నీకు ధైర్యం కావాలన్నావ్. మరి అదే  ధైర్యం నువ్వు నాకు నువ్విస్తావా?"
ఆమె ఇవ్వగలదో లేదో ఆమెకే తెలియదు. ఇంట్లో ఎదిరించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదా? తీసుకున్నా ఆనందంగా ఉండగలదా? అనుకుంటూనే అతని కళ్ళలోకి చూసింది. ఇలాంటి అబ్బాయి తారసపడడం జరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. ఇది బాగుంది. రేపు ఏమి వచ్చిన ఎదురుకోడానికి తను సిద్ధంగా ఉండాలి అనుకుంది. చిన్నగా నవ్వి, ఇంకా చిన్నగా తల ఊపింది.
*****
అదే రోజు రాత్రి 8:00 గంటలకి, ఖాళీగా ఉన్న నాగవారా, యెలహంక రోడ్ ప్రక్కన...


బైక్ పార్క్ చేసి అమృత, సుధీర్ చెరొక ear -phone పెట్టుకొని వింటున్నారు. "ఏది ఏమైనా ఇళయరాజా ఇళయరాజానే అమ్మాయి ఏదో తెలియని ఒక melancholy ఉంటుంది చాలా పాటల్లో"
"shhh పాట విను. అయిపొయింది, అయ్యే వరకు మాట్లాడకుండా ఉండలేకపోయావ్"
"సారీ"
ఆమె తన watch చూసుకొని "అమ్మో 9 అయ్యింది, లేట్ అవ్వుతుంది వెళ్దాం పద" అని లేచి నిలబడింది. ఆమె చెవిలోని ear phone క్రింద పడింది.
"ఒక్క నిమిషం మన పాట" అని కదలకుండా pavement పైనే కూర్చున్నాడు. అమృత  "ఛా... ఇప్పుడు అందుకోసం ఉండిపోదామా" అన్నట్టు చేతులు కట్టుకొని నిలబడి అతడిని చూసింది. అతనేమో అమృతని పట్టించుకోకుండా. చెవిలో ఉన్న ear phone లోంచి వచ్చే పాట వింటూ కళ్ళు మూసుకొని తన్మయంగా పాడడం మొదలుపెట్టాడు. "అంత దూరమా స్వర్గమన్నదీ చిటికెలో ఇలా మనదైనది..." అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు. నిలబడి ఉన్న వ్యక్తి కాస్త బెట్టుగానే కూర్చుంది. అతను ఇంకా పాడుతూనే ఉన్నాడు. ఆమె భుజం మీద సందేహిస్తూనే చెయ్యి వేసి పాడుతూ పక్కకి ఊయల ఊగుతూ ఉన్నాడు. ఇంకా చిరు కోపం నుంచి చిరు సిగ్గు లోనికి జారుకుంటూ ఆమె కూడా. "అందరానిదా స్వప్నమన్నది అందమైన ఈ నిజమైనది..."
******
10 రోజుల తరువాత ఒక బుధవారం సాయంత్రం...
అమృతకి ఫోన్ వచ్చింది. "హలో!! ఏంటి అయిపోయిందా పని అప్పుడే? నేను కొట్టు కట్టేయాలంటే బోలెడు టైం పడుతుంది. ఆన్-షోర్ కాల్ ఉంది ఎనిమిదింటికి" అటు వైపు నుంచి నిశ్శబ్దం.
"సుధీ? ఏమైంది?" కొంచెం గాబరాగా అడిగింది.
"నాన్నకి paralysis వచ్చింది అంట. hospitaliaze చేశారు నేను వెళ్ళాలి urgentగా బయలుదేరుతున్నా.."
"అయ్యో! ఏంటి? ఏమైంది? బాగా సీరియస్సా? బస్ స్టాండ్ వరకూ రానా? ఎన్నింటికి బస్సు?"
"బాగా ఏమి కాదు కానీ paralysis అంటే చిన్నది కూడా కాదుగా. ఏమి బుక్ చెయ్యలేదు, ఏది దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోతా. నువ్వేం కంగారు పడకు. నేను already ఆటోలో ఉన్నా, సరేనా?"
"ఆటోలో ఎందుకు? ఫ్రెండ్స్ ఎవ్వరు లేరా ? అశోక్? "
"తెలుసుకదా అమ్ము అందరికీ ఆఫీస్ అయ్యేసరికి 10 అవుతుంది. మధ్యలో ఎలా రమ్మనడం?"
"నేనన్నా వచ్చే దాన్ని కదా?"
"అబ్బా! please రా .. I  am really alright ... అయినా నాకు ఒంటరిగా ఉండాలి అని ఉంది. నీకు మాత్రమే చెప్పా. ఎవరితో అనలేదు. బస్సు ఎక్కిన తరువాత తీరికగా మెసేజ్ పెడతా అందరికీ. ఉండనా మరి?"
"సుధీ .. are you alright? నాకు ఏమి అనాలో తెలియటం లేదు"
"frankly అమ్ము, బాలేదు రా! నేను ఏమి బాలేదు. కానీ రేపొద్దున్న బస్సు దిగేసరికి బాగవ్వాలి తప్పదు అమ్మ కోసం, అన్న కోసం" అన్నాడు ఏడుపు గొంతులోనే నొక్కిపెట్టె ప్రయత్నం చేస్తూ.
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే అతని గొంతు అలా వినగానే మనసంతా ఎంతో దిగులుగా అయిపొయింది అమృతకి.
"జాగర్త"
"bye"
******
10 days తరువాత, బెంగళూరు తిరిగి వచ్చిన సుధీ కి ఆత్రంగా ఫోన్ చేసింది అమృత
"హలో అమ్ము !"
"ఏంటి ఎలా ఉన్నావ్ ? మీ నాన్న గారు ఎలా ఉన్నారు ? I Missed you so much !"
"నాన్న బానే ఉన్నారు. పెద్ద గండం గడిచినట్టు అనిపిస్తోంది. నీ సంగతులు ఏంటి ? సాయంత్రం ఖాళీ ఏ నా? కలుద్దామా ?"
"అడగాలా ? నాకు ఎన్నాళ్ళో అయ్యినట్టు ఉంది... 6:30 కి ఆఫీస్ దగ్గర పికప్ చేసుకో "
******
అతను పిక్ చేసుకోటానికి వఛ్చిన అప్పుడే తన మొహం చూసి, చాలా దిగులుగా అనిపించింది. ఎందుకో తెలియని బాధగా అనిపించింది.. ఒక రకంగా తన మనసుకి ఏం జరుగుతుందో ముందే తెలిసిపోయింది ఏమో .. కానీ అలా జరగకూడదు అనే విఫల ప్రయత్నంలో , వాళ్ళు ఎప్పుడూ కలిసి పాటలు వినే చోట బండి ఆగగానే .. " ఏవి విందాం ? వేటూరి? శాస్త్రి గారు ?"  అని అడిగింది. "నాకు ఈ రోజు ఆత్రేయ పాటలు వినాలి అని ఉంది" అని అన్నాడు అతను. అమృత గుండె వేగంగా కొట్టుకుంది. అయినా సరే తన భయం నిజం కాకూడదు అనుకుంది " నా దగ్గర అవి లేవు ప్రస్తుతానికి అంది, ఈ రోజు వద్దు సుధీ please take your time. Think again. Not today అని మనసులోనే అతన్ని వేడుకుంది. అతను మాత్రం " పోనీ గీతాంజలి పాటలు ఉన్నాయ్ కదా , అవి పెట్టు ఓ ప్రియా ప్రియా "  అమృతకి కళ్ళలో నీళ్ళు తిరిగిగాయి.   అతను ఆమెవైపు చూడటం లేదు, తల వంచుకొని ఉన్నాడు..  " అమ్మూ ..."
ఆమె ఏమీ మాట్లాడలేదు.
"నాన్నకి అస్సలు బాలేదు రా "
ఆమె మౌనం
"నేను ఇక్కడ ఉండలేను, హైదరాబాద్ అయితే దగ్గర ఇంటికి"
ఆమె మౌనం
"నాన్నకి ఆరోగ్యం అంత దారుణంగా ఉన్నప్పుడు నీ గురించి నా గురించి చెప్తే ఎలా react అవ్వుతారో .. అయన ఆరోగ్యం ఏమవ్వుతుందో అని భయంగా ఉంది "
ఆమె మౌనం
"నాకు నువ్వంటే చాలా చాలా ఇష్టం కానీ,నాకు వేరే దారి తోచటం లా , ఈ పది రోజుల నుంచి నేను ఇదే ఆలోచిస్తున్నా ... వాళ్ళు మాములుగా ఉన్నప్పుడు ఎంత గొడవ అన్న పడవచ్చు ...కానీ ఇలాంటి స్థితి లో "
మౌనంగానే విలపిస్తున్న తన హృదయం కనురెప్పలు దాటి కన్నీళ్ళని రానివ్వద్దు అని అంది... ఎందుకె నీకింత అహంకారం అనుకుంది అమృత.
" నువ్వు చాలా strong అమ్మాయి వి. I know you can survive this, but I am not sure I can survive" అని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆమెకు ఏడవాలి అని ఉంది. నేను strong కాదు, నాకు నువ్వు కావాలి అని అరవాలి అని ఉంది. కానీ తనేం మాట్లాడలేకపోయింది. మాట్లాడకపోవటమే బలమా? లేక బలహీనత? అతన్ని బ్రతిమాలితే ఇదంతా ఉత్తిదే అంటాడేమో కానీ తను ఏమి అనలేదు ..   అతను ఆమె వైపు చూసి కన్నీళ్లే లేని ఆమె మొహం చూసి , ఆమె చెయ్యి పట్టుకొని "Thanks for understanding" అన్నాడు. అమృత ని హాస్టల్ దగ్గర దింపేసి " I will keep in touch" అని వెళ్ళిపోయాడు.

********

2 ఏళ్ళ తరువాత హైదరాబాద్, లకడి కపూర్ బస్ స్టాండ్ లో ..

బస్సు కోసం ఎదురు చూస్తుంది అమృత. ఎందుకొచ్చిన తిప్పలు ఆటో ఎక్కితే సరిపోతుంది అనుకోని ఆటో ఆపుదాం అని ప్లాటుఫారమ్ వదిలి రోడ్ మీదకు వచ్చింది..  అంతలోనే తన ముందు ఒక బైక్ వచ్చి ఆగింది.  అతను హెల్మెట్ తీశాడు. అమృత అతని మొహం చూడగానే వెనక్కు తిరగబోయింది. ఆమెని చూసిన ఆనందం తో ఉన్న అతను "అమ్ము.. ప్లీజ్ ఒక్క సారి మాట్లాడు" ఆమె వెనక్కు తిరిగింది  " ప్లీజ్ రా! " అన్నాడు అతను. ఆమె కళ్ళు అనుకోకుండా చెమ్మగిల్లాయి.. అతని వైపుకి తిరిగి బండి ఎక్కింది.

  ఒక పావుగంట ప్రయాణం తరువాత, బండి ఆగింది.. అమృత ఒక పది అంతస్థుల అపార్ట్మెంట్ ను తలా పైకి ఎత్తి చూస్తోంది .. " మా అన్న వాళ్ళ ఇళ్ళు, దిగు బండి పార్క్ చేసి వస్తాను"
ఇద్దరు లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్  లోని ఒక ఫ్లాట్ ముందు ఆగారు.. సుధీ తాళాలు తీసాడు " ఎవ్వరూ లేరా ?" అని అడిగింది అమృత.. "లేరు ఊరెళ్ళారు, రా కూర్చో " అని కుర్చీ ముందుకు జరిపాడు..  "మంచినీళ్ళు తాగుతావా ? మామూలువా ? చన్నీళ్ళా ?" "మామూలువి" అంది ..  ఆమె కుర్చీ ముందు బాగా కిందకి ఉన్న  రాజుల కాలం నాటి దివాను మీద అతను కూర్చుంటే.. కిందే కూర్చున్నట్టు ఉంది .. ఆమెకి నీళ్ళు ఇచ్చాడు " ఇప్పుడు చెప్పు అమ్మాయి , ఎలా ఉన్నావు ఏంటి ? అసలు చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నావ్ ? మరీ దారుణంగా !" అమృత ఏమి మాట్లాడకుండా తల వంచుకొని చిన్నగా నీళ్లు తాగింది...  "నీకు పెళ్ళి కుదిరింది అని విన్నాను.. కానీ మళ్ళీ పెళ్ళి కబురు చెప్పలేదు నువ్వు కానీ ఇంకెవ్వరూ కానీ... హైదరాబాద్ వచ్చాక కొంచెం touch లో లేను అనుకో ఎవ్వరితోను కానీ పెళ్ళి లాంటి పెద్ద విషయాలు అన్నా తెలియాలి గా " అంటూ ఆమె వైపు చూసాడు .. అమృత కళ్ళలో కన్నీళ్లు .. అతను కొంచెం ముందుకి వచ్చి ఆమె చెయ్యి అందుకో బోయాడు .. ఆమె చేతిలో ఉన్న గ్లాస్ విసిరికొట్టి ,లేచి నిల్చుంది ..   "పెళ్లి అయ్యిందా? చూస్తున్నావ్  గా ఎమన్నా కనిపిస్తుందా మెడలో ? "  "అమ్ము మెల్లగా , బయటకి వినిపిస్తుందేమో" ఆమె అప్పుడు స్పృహ లోకి వచ్చి దివాను మీద కూలబడి ఏడవ సాగింది "అమ్ము please రా ఏడవకు .. ఏమైందో చెప్పు .. నీకు engagement అయ్యింది అని విన్నాను అందుకే అలా అడిగాను " అమృత ఎక్కి ఎక్కి ఏడ్చి కొంచెం తమాయించుకొని " I don't know sudhi, he left me... he said it's my mistake and our relationship can't  be improved... అని వెళ్ళిపోయాడు కెనడా .. నా దగ్గర అక్కడి  ఫోన్ నెంబర్ కూడా   లేదు , మెయిల్ కి సమాధానం ఇవ్వడు ... worst part ఏంటో తెలుసా  I don't even know the reason.. He just broke off with me..కానీ నేను చాలా ప్రయత్నించాను ... తనకు నచ్చేలా  ఉండటానికి , చూడు వెయిట్ తగ్గాను ... dressing మార్చేసాను కానీ తనకు నచ్చలేదు అంట ... తను అస్సలు నాతో మాట్లాడితే కదా " అని చేతుల్లో  తల పెట్టుకుని ఏడ్చేసింది .. సుధీ మొహమాటంగానే ఆమె తల పై చెయ్యి పెట్టాడు " చూడు పోనీ ఇది నీ మంచికేనేమో ?" ఆమె అతని చెయ్యి విదిలించకుండా ఉన్నందున ధైర్యం చేసి ఆమె పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేశాడు. అమృత వెక్కి వెక్కి ఏడుస్తూ అతని భుజం మీద తల ఆనించింది.. "ఏమి మంచి సుధీ? నువ్వు వెళ్ళిపోయావు .. తనూ వెళ్ళిపోయాడు ..  గత ఆరు నెలలుగా మనిషిని మనిషిలా లేను, మనఃశాంతి లేదు.. బహుశా నాలోనే ఎదో లోపం ఉందేమో.."  "oh my baby! లేదు రా నీలో ఏమి లోపం లేదు, వాడికే ఎదో పిచ్చి ఏమో, ఇంక నా సంగతి అంటావా నీకు తెలిసిందే కదా ! నాన్నకు బాగుంటే నేను దేని గురించి  ఆలోచించకుండా నీతోనే ఉండే వాడిని, మా ఇంట్లో వద్దన్నా సరే ! నీలో ఎదో లోపం ఉంది అని నువ్వు కల్లో కూడా అనుకోకు.. please " అని రెండో చేత్తో ఆమెను వాటేసుకొని ఎదో చంటి పాపని నిద్ర పుచ్చటానికి ముందుకీ వెనక్కీ ఊగినట్టు , ఊగసాగాడు. " I missed you" అంది అమృత .. " I missed you more" అని ఆమె నుదుటి పై ముద్దు పెట్టాడు సుధీ .. అమృత చిన్నగా నవ్వింది .. "ఏంటి" అని అడిగాడు సుధీర్ ఇంకా ఊగుతూనే.. "first kiss విడిపోయాక పెడుతుంటే"  అతనూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. రెండేళ్ళ బాధ, దిగులు అతని పక్కన ఉంటే ఇట్టే కరిగిపోయినట్టు అయ్యి మనసు తేలికపడింది అమృతకి. అలానే నిద్ర పోయింది.. ఆమె నిద్రను చెడపడం ఇష్టం లేక అలానే ఊగుతూ ఉన్నాడు సుధీర్.



                కొంత సేపటికి కిటికీ లోంచి వెన్నెల వచ్చి మొహం మీద పడటంతో మెలకువ వచ్చింది అమృతకి.. ఆమె ఎక్కడ ఉందో పోల్చుకోటానికి ఒక్క నిముషం పట్టింది. తనూ సుధీర్ పక్క పక్కనే కూర్చొని ఉన్నారు, సుధీర్ చేతులు ఇంకా తన భుజం మీద ఉన్నాయ్, తన తల అతని గుండెల మీద ఉంది, అతని తల ఆమె తలకి ఆనించి ఉంది. అతను ఊగటం ఆపేసి, నిద్రలోకి జారుకున్నట్టు ఉన్నాడు. కదలకూడదు అనుకుంటూనే కొంచెం కదిలింది అతనికి మెలకువ వచ్చింది, ఆమెని వదిలేసి కళ్ళు నులుముకుంటూ " టైం ఎంత?" అన్నాడు. అమృత తన గడియారంలో చూసి "7:30, నేను వెళ్ళాలి సుధీ" అంది. "భోజనం చేసి వెళ్ళు, నేను దింపుతాను గా 10 అయ్యిన పర్లేదు గా ? hostel ఆ ?"  "లేదు మా friend రూం లో  ఉంటున్నా, interview ఉంటే వచ్చాను, జాబ్ వచ్చింది, ఒక మూడు నెలల్లో ఇక్కడికే వచ్చేస్తున్నా. నాకు బెంగుళూరులో ఇంక ఉండాలి అనిపించటం లేదు" " అర్ధం అయ్యింది, అయినా ఇక్కడికి రావటమే మంచిది లే కొత్త వాతావరణం, పద కిందకి వెళ్ళి noodles తిందాం నీకు ఇష్టం కదా, తరువాత దింపుతాను" "మానేశాను, noodles లావు అవ్వుతాను అని.." అంటూ సగంలో ఆపేసింది. " ఇప్పుడు వాడు తిరిగి వస్తాడా?నువ్వు మానేసినంత మాత్రాన? అయినా ఒకళ్ళ కోసం మారే అమ్మాయిని కాదె నేను ఇష్టపడింది "
"ఏమో , నువ్వెళ్ళక కూడా బనే ఉన్న సుధీ కానీ దెబ్బ మీద దెబ్బ లా ఇలా తగిలేసరికి .. నీ గురించి చెప్పా తెలుసా వాడికి, నీలా నన్ను బాధ పెట్టను అన్నాడు .. అన్న రెండు నెలలకే కనీసం మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇంక నాకు నాదే తప్పేమో అనిపించింది " " నీ తలకాయ, సరే పద! వాడి మీద చాలా సమయం వృధా చేశాం ఇప్పటికే.. "  అని కదులబోతున్న అతన్ని చెయ్యిపట్టుకొని ఆపి "నాకు తెలుసు మన ఇద్దరికీ కలిపి ఒకటే భవిష్యత్తు ఉండదు అని, కానీ నాకు ఇది అడగాలి అని ఉంది చెప్తావా?" లేవబోయే వాడు కూర్చొని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకొని  " నువ్వు అడగక్కర్లేదు, నాకు నువ్వంటే ఇప్పటికీ, ఎప్పటికీ ఇష్టమే! నువ్వు నా వెండి వెన్నెలవి .. ఎప్పటికీ నిన్ను అభిమానిస్తూనే ఉంటాను" అని ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళలోంచి, మౌనంగా కన్నీళ్లు కారుతున్నాయి, చీకటిగా ఉన్న గదిలోకి, కిటికీ లోంచి తొంగి చూస్తున్న వెన్నెల్లో అవి మెరిసాయి.. " పిచ్చి దానా !" అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇద్దరు కలిసి, పాత స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటూ noodles తిన్నారు. అతను ఆమెని, రూమ్ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు.

*******
6 నెలల తరువాత ఒక రోజు సాయంత్రం 9 గంటలకి..

laptop లోఆఫీస్ పని చేసుకుంటున్న అమృత కి, calling bell వినపడటంతో , ఈ సమయం లో ఎవరై ఉంటారా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది.  "సుధీ?" అని ఆశ్చర్యపోయింది అమృత. "లోపలికి రావచ్చా?", తల కొంచెం ఆడించి  పక్కకి జరిగింది. తలుపు గడియ పెట్టి ఆమె వెనక్కి తిరిగింది. ఇంతలోనే ఆమెని హత్తుకున్నాడు సుధీర్.  అతను హత్తుకున్న నిముషం కరెంటు పోయింది. అమృత laptop లోంచి వచ్చే వెలుగు, కిటికీ లోంచి గదిలోకి తొంగి చూస్తున్న వెన్నెల తప్ప మిగతా అంతా చీకటిగా ఉంది. "ఏమిటి సుధీ? సమంధాలు చూస్తున్నారు అన్నావ్, కుదిరిందా ?" అని అడిగింది అమృత. అతను ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు,  అతని కన్నీళ్లు జారీ ఆమె భుజం మీద పడ్డాయి. " ఏంటి పిచ్చి ? ఎందుకు ఇంత 
బేల తనం, మనం  ఎప్పటి నుంచో అనుకున్నదేగా, అయినా నువ్వు నేను సరిగా మాట్లాడుకొనే 3 నెలలు అయ్యింది.. we are not even friends who are in touch with" అతను ఎదో చెప్పబోయాడు, గొంతు రాలేదు , సరి చేసుకొని " I love you" అన్నాడు "తెలుసు సుధీ ... కానీ మీ కుటుంబం కోసం నువ్వు రెండు ఏళ్ళ కింద తీసుకున్న నిర్ణయం ..  కొత్తది కాదు కదా " అంది అతను ఆమెను విడిచి కిటికీ లోంచి వచ్చే వెన్నెలకి అడ్డం లేకున్నాడా కిటికీ కింద ఒక పక్కకి కూర్చున్నాడు. ఆమె వెళ్ళి అతనిలానే వెన్నెలకి అడ్డం రాకుండా ఇంకో పక్కన కూర్చుంది. " తను నచ్చిందా?" అని అడిగింది అమృత. "తనకీ పాటలంటే ఇష్టం.. డాన్స్ అంటే ఇష్టం .."  అని అతను మొదలుపెట్టాడు. "నాలా ఉంటుంది అనకు సుధీ ... దయచేసి!" "లేదు  I am just saying I have a type.." అన్నాడు. " నాకు తెలుసు" . " నేను నీ కోసం ఎప్పుడూ ఉంటాను అమ్మూ " " వినటానికి బాగుంది కానీ... " " ఆలా అనకే నాకు ఏడుపు వస్తుంది.. నువ్వే ఎప్పటికీ నా వెండి వెన్నెలవి"
"నేను నిష్ఠురం గా అనలేదు సుధీ.. practical గా అవ్వదు అని చెప్పటమే నా ఉద్దేశం". అలానే మౌనంగా రెండు గంటాలు కూర్చున్నారు.. ఇంక అతను లేచి వెళ్ళటానికి బయలుదేరే అప్పుడు దుఃఖం కలిగింది అమృతకి "పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా .." అని పడ సాగింది.. ఆటను ఆగి "అరె అలా పాడకు రా please " అన్నాడు .. ఇద్దరు లేచి  కిటికీ లోంచి వచ్చే వెన్నెల్లో నుంచున్నారు, చేతులు పట్టుకొని.  ఆమె ముందు అడుగు వేసి, అతని పెదాలని ముద్దాడింది. ఇద్దరి కళ్ళలో  నీళ్లు ఆగలేదు. ఒక్క నిముషం ఆగక కరెంటు వచ్చింది,. ఒక్కళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.. ఇద్దరిలోను విడిపోతున్నానం అనే గుండె కోత స్పష్టంగా కనిపిస్తోంది. "ఏంటిది ? విడిపోయే అప్పుడు?" అన్నాడు అతను "నీ వెండి వెన్నెల పాడే హంస గీతిక అనుకో" అంది అమృత.  చివరి సారిగా అమృతని హత్తుకొని, తలుపు తెరచుకొని ఆమె ఇంట్లో నుంచి,జీవితం నుంచి వెళ్ళిపోయాడు సుధీర్.

   (సమాప్తం)

Sunday, April 12, 2020

మృత్యుంజయులు

మరో రెండు వారాలు మన అందరం ఇళ్లలోనే ఉండాలేమో, ఇంకా ప్రకటన రాలేదు కానీ వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పైకి ఎంత నవ్వుతున్నా, పెదవి విప్పి బయట పడినా, పడుకున్నా ప్రపంచ జనావళి అందరి మదిలో ఇప్పుడు నడుస్తున్న ఒకే ఒక భయం కరోనా! మన అందరి ధ్యేయం విపత్తు నుంచి వీలైనంత తక్కువ ప్రాణ నష్టంతో బయట పడాలి. పడతాం కూడా! ఇంట్లో కూర్చోవటం చేతకానితనమో లేదా ఫలితం లేని చర్య అని మనం అనుకోకుండా ఉంటే.  సమయంలో ఇంట్లో కూర్చోవడమే ఒక వీరోచిత చర్య. ఇదే మనం చేసే సమరం. మన అలవాట్లతో, మన మనసులతో మనమే చేసే యుద్ధం. ఇందులో మనం గెలిస్తే మానవాళి గెలుస్తుంది. లేదంటే అందరం ఓడిపోతాం. ఇది మనం చేసే సమాజ సేవ కూడా. ఇంత పెద్ద భాద్యతని ఎలా నిర్వర్తించాలి? దానికి తగిన స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుంది? అలా స్ఫూర్తిని నింపేది ఒక కళ మాత్రమే.

                   
నాకు తెలిసిన కళ అంటే సినిమా పాటలు మాత్రమే. కత్తులు పట్టుకొని కథానాయకుడు వీరోచితంగా విలన్లను ఎడాపెడా నరికేస్తుంటే  బోలెడు పాటలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. కానీ ప్రాణాలను కాపాడుకోవాలని ఒక మనిషి పడే తాపత్రయాన్ని కూడా heroic act గా చూపించే పాట, మన రాజమౌళి గారు మాత్రమే ఊహించగలరు. అటువంటి సందర్భానికి కీరవాణి గారి అద్భుతమైన బాణిలో, సీతారామశాస్త్రి గారి కలంలోంచి వచ్చిన రచన బ్రతకాలని మనకుండే సంకల్పానికి నివాళిలా ఉంటుంది. అలంటి బాణీకీ, రచనకి తన గాత్రంతో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళగలిగారు బాలు గారు.

                   
బయటకి అడుగుపెడితే చంపేస్తారని తెలిసి బిక్కు బిక్కు మంటున్న హీరోకి ఒక అవకాశం వచ్చింది. పరిగెత్తి పారిపోతే బ్రతుకుతాడు కానీ ఇంత సేపు రక్షగా, లక్ష్మణ రేఖగా నిలచిన గడప దాటాలంటే భయం, అనుమానం. ఒక్కసారి దేవుడి గది వైపు చూస్తాడు. శివలింగం కనిపిస్తుంది. అతని గుండె దడే పైకి వినిపిస్తుందేమో అనిపిస్తుంది. అతనికి చెమటలు పట్టి గుండె గొంతులో కొట్టుకుంటుంది. వెనుక నుండి "దడ దడ దడ దడ లాడే ఎద సడి ఢమరుకమై...వడి వడి వడి దూకే పదగతి తాండవమై..."  ప్రాణ భయంతో పారిపోతున్నవాడిని పరమశివుడి భక్తుడు  మార్కండేయుడితో   పోల్చటమే  మజా ఇక్కడ! సహజంగానే భయస్తుడు అయిన  మన హీరో ఎలాగైనా బ్రతకాలి అని సంకల్పించుకొని పరిగెడుతాడు. తరువాత ప్రేమ కోసం ఎంతమంది చావబాదుతున్నా ప్రేయసి చెయ్యి వదలడు.  "పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై..." నీ పంచ ప్రాణాలే పంచాక్షరిగా కాపాడమని శివుని పిలుస్తూ,  "ముంచుకు వచ్చే మృత్యువుకి అందని మార్కండేయుడవై ... పరుగులు తీయ్…" నిన్ను తరుముకు వచ్చే చావుని తప్పించుకుని, మృత్యువు అంటే ఎరుగని మార్కండేయుడవై (మార్కండేయుడుని శివుడు చనిపోనివ్వడు) పారిపో అంటూ ఉంటే హీరో అడుగు తీసి బయట పెట్టినప్పుడు మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

               
కత్తులతో వెంటపడుతున్న వాళ్ళని చూస్తూ "కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకి చేరని దూకుడువై…"
.వెంటపడుతున్న వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్న హీరోని పట్టుకోలేక అలసిపోయి ఒక్క క్షణం ఆగగానే "ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్". తరువాత జీపులో వేగంగా వచ్చే ఇంకో పగవాడిని చూసి "మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కేయాలని దూసుకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి". జీవరాసులన్నీ మట్టి నుంచి వచ్చినవే, చనిపోయాక మళ్ళీ మట్టిలో కలిసిపోతాయ్. ప్రక్రియని circle of life (జీవితచక్రం) అంటాము. మనం కాలాన్ని (time ని) సూర్యుడి గమనంతో పోల్చుకొని లెక్కేస్తాం. సూర్యుడు ఇక్కడ ఉంటే ఉదయం, అక్కడ ఉంటే మధ్యాహ్నం అని. అలాంటి సూర్యుడు సప్తాశ్వాల రథం (A chariot that is driven by seven horses) మీద కదులుతాడు అంటారు. అందుకే ఇక్కడ కాలాన్ని అశ్వంతో పోల్చి, కాలాశ్వం అన్నారు. మనం  చనిపోయాక గొప్ప వాళ్ళం అయితే చరిత్ర అవుతాం. మాములు వాళ్ళం అయితే మన వాళ్ళకి జ్ఞాపకం అవుతాం. ఎలాంటి వాళ్ళమైనా ప్రపంచ గణాంకాలలో ఒక అంకె అవుతాం. కాలాశ్వం మనల్ని మట్టిలోకి కలిపేసాక మనం చేసేది ఏమి లేదు. ఏమి చేసినా ప్రాణం ఉన్నంత వరకే. అందుకే నిన్ను మట్టిలోకి తొక్కేయాలని చూసే కాలం అనే గుఱ్ఱం పైనే నువ్వు స్వారీ చేసి చావుని ఓడించమని మన హీరోకి చెబుతున్నారు అన్నమాట. వాక్యం విన్న ప్రతిసారీ ఎంతో స్ఫూర్తిని నింపుతుంది.

             
అంత సేపు పరిగెత్తాక, ఇక బ్రతుకుతానో లేదో అన్న ఆశ వదులుకుంటున్నావేమో, అలా కాదు "ఎడారి దారిన తడారిపోయిన ఆశకి చెమటల ధారలు పొయ్యి" బీటలువారిన నీ ఆశకి నీ చెమటనే ధారగా పొసి చిగురింపజేయి. "నిస్సత్తువతో నిలబడనియ్యక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి". ఇంత అలుపు వస్తుంటే ఎందుకు అడుగు ముందుకు వేయాలని అనుకుంటవేమో, బ్రతకాలన్న నీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎందుకు బ్రతికుండాలని, ఇలా పరిగెత్తడం పిరికితనమని అనుకుంటవేమో, ఇప్పటివరకు నువ్వు చూడని ఎన్నో సమస్యలని, నిన్ను భయపెట్టే సమస్యల్ని, ఎదురుకునేందుకు బ్రతికి ఉండటమే ఒక సాహసం! అందుకే పరిగెత్తు. "వంద ఏళ్ళ నీ నిండు జీవితం గండి పడదనే నమ్మకమై శతకోటి సమస్యలని ఎదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై  పరుగులు తీయ్య్" అని ఇలాంటి పాట వెనుక వస్తుండగా, హీరో ఎవరినీ ఎదిరించకుండా తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్నా కూడా ఇది సైతం మాస్ అంశమే. ఎందుకంటే, తాను మనుషుల నుండి తప్పించుకుంటున్నా, అంతకంటే పెద్ద శత్రువైనమృత్యువుని మాత్రం జయిస్తున్నాడు.


ఇంత గొప్ప పాట మనకు ఇచ్చిన రాజమౌళి గారు, కీరవాణి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, బాలు గారు ఎప్పటికీ మృత్యుంజయులు. ఎందుకంటే కాలం మీద స్వారీ చేసి దానిపై తమ తమ ముద్రలను వేశారు.

   
మనం కూడా మన ముద్ర (స్టాంప్) కాలం మీద వేయాలి అంటే, ఇప్పుడు ప్రపంచాన్నే మట్టిలోకి తొక్కేస్తాను అని వణికిస్తున్న కాలాశ్వం పై స్వారీ చెయ్యాలి. అయితే అది ఇంట్లో ఉంటేనే సాధ్యపడుతుంది. సంకల్పమే మన ఆయుధం. ఇదే మనం దేశానికి ప్రస్తుతం చేయగలిగిన సేవ కూడా. కనుక, ఇంట్లో ఉండే ప్రాణాలు కాపాడుదాం. గండం గడిచాక మన వైపు వచ్చే శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బ్రతికి ఉందాం. అలా ఉండటమే ఒక గొప్ప సాహసం.  Because we need our lives to make adventures.  కరోనా నుంచి అందరం తప్పించుకొని, మృత్యుమజయులం అవుదాం.